అగ్రస్థానమే లక్ష్యంగా..
►నేడు పుణేతో తలపడనున్న కోల్‌కతా ∙
►సొంతగడ్డపై బలంగా నైట్‌రైడర్స్ ∙
►వరుస విజయాలతో సూపర్‌జెయింట్ జోరు
కోల్‌కతా: సొంతగడ్డపై చెలరేగే కోల్‌కతా నైట్‌రైడర్స్ బుధవారం రైజింగ్ పుణే సూపర్‌జెయింట్‌తో తలపడనుంది. ఇప్పటివరకు వరుస విజయాలతో దూకుడు కనబర్చిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు చివరిమ్యాచ్‌లో అడ్డుకట్ట పడింది. దీంతో పుణేతో మ్యాచ్‌లో నెగ్గి టాప్‌ప్లేస్‌ను కైవసం చేసుకోవాలని గంభీర్‌సేన భావిస్తోంది. మరోవైపు రెండు వరుస విజయాలతో ఊపుమీదున్న పుణే అదే జోరును కొనసాగించాలని కృతనిశ్చయంతో ఉంది.
టాప్ ఆర్డరే బలం..
రెండుసార్లు చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ ఈ సీజన్‌లో మంచి జోరుమీదుంది. ఓవరాల్‌గా పది మ్యాచ్‌లాడిన కోల్‌కతా ఏడు మ్యాచ్‌ల్లో విజయం సాధించి మూడింటిలో ఓడిపోయింది. దీంతో 14 పాయింట్లతో ముంబై ఇండియన్స్ తర్వాత పట్టికలో రెండోస్థానంలో కొనసాగుతోంది. ఈక్రమంలో పుణేతో మ్యాచ్‌లో విజయం సాధించి తిరిగి అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవడంతోపాటు ప్లే ఆఫ్ బెర్త్‌ను ఖరారు చేసుకోవాలని పట్టుదలగా ఉంది. మరోవైపు కోల్‌కతా బలం అంతా టాప్ ఆర్డర్‌లోనే ఉంది. కెప్టెన్ గౌతమ్ గంభీర్ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. ఈ సీజన్‌లో పది మ్యాచ్‌లాడిన గంభీర్ 55 సగటుతో 387 పరుగులు చేశాడు. దీంతో జట్టు తరఫున అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా కొనసాగుతున్నాడు. మరోవైపు రాబిన్ ఉతప్ప (384 పరుగులు), మనీశ్ పాండే (304 పరుగులు) ఆకట్టుకుంటున్నారు. సునీల్ నరైన్ ఓపెనర్ అవతారంలో ఓ మోస్తరుగా రాణించాడు.
కోల్‌కతా విజయం సాధించిన మ్యాచ్‌ల్లో ఎక్కువగా గంభీర్, నరైన్, ఉతప్ప, మనీశ్ పాండే రాణించారు. అయితే సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన చివరిమ్యాచ్‌లో కోల్‌కతా టాప్‌ఆర్డర్ విఫలమైంది. 210 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతాకు టాప్ ఆర్డర్ నుంచి సరైన భాగస్వామ్యం రాలేదు. గంభీర్, నరైన్ విఫలమైనా ఉతప్ప, మనీశ్ పాండే పోరాడారు. అయితే వారికి మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ నుంచి సహకారం అందలేదు. ముఖ్యంగా జట్టు ఆశలు పెట్టుకున్న యూసుఫ్ పఠాన్ చేతులెత్తేశాడు. సూర్యకుమార్ యాదవ్ స్థానంలో వచ్చిన షెల్డన్ జాక్సన్ నిరాశపర్చాడు. దీంతో భారీ తేడాతో సన్‌రైజర్స్ చేతిలో ఓటమి ఎదురైంది. వరుస విజయాలతో జోరు మీదున్న కోల్‌కతాకు ఇది ఒక కుదుపులాగా పరిణమించింది.
దీంతో తమ జట్టు కూర్పుపై మరోసారి ఆలోచించుకోవాల్సిన అవసరముంది. ముఖ్యంగా ఆరోస్థానంలో సూర్యకుమార్, జాక్సన్ స్థానంలో ఇషాంక్ జగ్గీని బరిలోకి దింపితే బాగుంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు వరుసగా విఫలమవుతోన్న కొలిన్ గ్రాండ్‌హోమ్ స్థానంలో బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ షకీబల్ హసన్‌ను జట్టులోకి తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇక బౌలింగ్ విషయానికొస్తే నాథన్ కూల్టర్‌నీల్ అద్భుతంగా రాణిస్తున్నాడు. కేవలం ఐదు మ్యాచ్‌ల్లోనే 11 వికెట్లతో సత్తాచాటాడు. మరోవైపు క్రిస్ వోక్స్ కూడా 11 వికెట్ల (10 మ్యాచ్‌లు) ఆకట్టుకుంటున్నాడు. ఉమేశ్ యాదవ్, కుల్‌దీప్ యాదవ్, సునీల్ నరైన్ ఫర్వాలేదనిపిస్తున్నారు. యూసుఫ్ పఠాన్ మాత్రమే బ్యాటింగ్‌తోపాటు బౌలింగ్‌లోనూ విఫలమవుతున్నాడు. ఈక్రమంలో సాధ్యమైనంత త్వరగా తను గాడిలో పడాలని జట్టు మేనేజ్‌మెంట్ ఆశిస్తోంది. ఓవరాల్‌గా సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో కోల్‌కతా బౌలింగ్ విఫలమైంది. దీంతో ఈ సీజన్‌లో తొలిసారి కోల్‌కతాపై ఓ జట్టు 200 పరుగుల మార్కును సాధించింది. దీంతో ఈ విభాగంపై జట్టు మరింత దృష్టి సారించాల్సిన అవసరముంది.
మరోవైపు కోల్‌కతా మరో విజయం సాధిస్తే ఎనిమిది విజయాలతో ప్లే ఆఫ్ బెర్త్‌ను దాదాపు కైవసం చేసుకోవడంతోపాటు తిరిగి అగ్రస్థానాన్ని అలంకరిస్తుంది. దీంతో పుణేతో జరిగే మ్యాచ్‌లో కచ్చితంగా నెగ్గాలని కృత నిశ్చయంతో ఉంది. అలాగే ఈ సీజన్‌లో సూపర్‌జెయింట్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా అద్భుత విజయం సాధించింది. భారీ లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. దీంతో బుధవారం మ్యాచ్‌లో మరింత ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగనుంది.
పుణే దూకుడు..
ఈ సీజన్ ప్రథమార్థంలో నిరాశజనక ప్రదర్శన కనబర్చిన పుణే.. అనంతరం గాడిన పడింది. చివరగా ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఐదింటిలో విజయం సాధించింది. ఓడిన ఈ ఒక్కమ్యాచ్ కోల్‌కతా చేతిలోనే కావడం విశేషం. ప్రస్తుతం ఈ సీజన్‌లో పది మ్యాచ్‌లాడిన పుణే.. ఆరు విజయాలు, నాలుగు పరాజయాలు నమోదు చేసింది. ఓవరాల్‌గా 12 పాయింట్లతో పట్టికలో ఐదోస్థానంలో కొనసాగుతోంది. మరో రెండు విజయాలు సాధిస్తే ప్లే ఆఫ్ బెర్త్‌ను దాదాపు ఖరారు చేసుకుంటుంది. ఈక్రమంలో కోల్‌కతాతో బుధవారం మ్యాచ్ ఆడనుంది. జట్టు విషయానికొస్తేసారథి స్టీవ్ స్మిత్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. గుజరాత్ లయన్స్‌తో చివరిమ్యాచ్‌లో విఫలమైనా.. ఇప్పటికీ జట్టు తరఫున అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు.
ఇప్పటివరకు తొమ్మిది మ్యాచ్‌లాడిన స్మిత్ 324 పరుగులు సాధించి జట్టు తరఫున టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. రాహుల్ త్రిపాఠి (259 పరుగులు), అజింక్య రహానే (215 పరుగులు), ఎంఎస్ ధోని (199 పరుగులు), మనోజ్ తివారీ (182 పరుగులు) ఆకట్టుకుంటున్నారు. గత మ్యాచ్‌లో ఈ సీజన్‌లోనే ఖరీదైన ఆటగాడు బెన్‌స్టోక్స్ సత్తాచాటాడు. లయన్స్‌పై విధ్వంసక సెంచరీతో ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించాడు. ఆ మ్యాచ్‌లో టాపార్డర్ విఫలమైన దశలో ధోనితో కలిసి ఉపయుక్తమైన ఇన్నింగ్స్ ఆడాడు. తీవ్రమైన ఒత్తిడిలో సైతం జట్టును విజయ తీరాలకు చేర్చాడు. ఇక బౌలింగ్ విషయానికొస్తే ఇమ్రాన్ తాహిర్ అదరగొడుతున్నాడు. పది మ్యాచ్‌ల్లో 16 వికెట్లతో సత్తా చాటాడు. జయదేవ్ ఉనాద్కట్ పది వికెట్లతో ఆకట్టుకుంటున్నాడు. శార్దుల్ ఠాకూర్, డాన్ క్రిస్టియాన్ ఫర్వాలేదనిపిస్తున్నారు.
మరోవైపు ఐపీఎల్ చరిత్రలో కోల్‌కతాపై పుణే ఇప్పటివరకు విజయం సాధించలేదు. గతేడాది రెండు మ్యాచ్‌ల్లోనూ, ఈ సీజన్‌లో జరిగిన మ్యాచ్ కలిపి మొత్తం మూడుసార్లు పుణే పరాజయం పాలైంది. ఈ క్రమంలో సొంతగడ్డపై చెలరేగే కోల్‌కతాను పుణే ఎంతవరకు నిలువరిస్తుందో చూడాలి. మరోవైపు కోల్‌కతాపై విజయం సాధిస్తే పుణే ప్లే ఆఫ్‌కు మరింత చేరువవతుంది కాబట్టి ఈ మ్యాచ్‌లో విజయం కోసం స్మిత్‌సేన సర్వశక్తులు ఒడ్డుతుందనడంలో సందేహం లేదు.