భారత ప్లేయర్లకు హెడ్ కోచ్ గంభీర్ చురకలు
జట్టులో అంతా సవ్యంగా లేదనే వాదనలకు ఊతం
ఆ్రస్టేలియా పర్యటనలో స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోతున్న భారత క్రికెట్ జట్టుపై విమర్శలు ఎక్కువవుతున్నాయి. గౌతమ్ గంభీర్ టీమిండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టి ఆరు నెలలైనా ఆశించిన ఫలితాలు రావడంలేదు. దాంతో ఇక కఠిన నిర్ణయాలు తప్పవనే సంకేతాలు వెలువడుతున్నాయి.
శ్రీలంక చేతిలో వన్డే సిరీస్ కోల్పోవడం, స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ‘వైట్‌వాష్’కు గురవడం... తాజాగా ‘బోర్డర్–గావస్కర్’ ట్రోఫీలో 1–2తో వెనుకంజలో ఉండటంపై గంభీర్ కోచింగ్ తీరుపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.
ఇన్నాళ్లు జట్టు కోచ్‌గా ఆటగాళ్లు సహజ శైలిలో ఆడేందుకు స్వేచ్ఛనిచ్చిన కోచ్ గౌతమ్ గంభీర్ ‘ఇప్పటికే ఎక్కువైంది... ఇక చాలు’ అని ఆటగాళ్లకు ఘాటుగా హెచ్చరించినట్లు సమాచారం.
సిడ్నీ: ప్రతిష్టాత్మక ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో భాగంగా మెల్‌బోర్న్‌లో జరిగిన నాలుగో టెస్టును ‘డ్రా’ చేసుకోగలిగే స్థితిలో నిలిచిన టీమిండియా... చివర్లో చేతులెత్తేసి ఓడిపోవడంపై హెడ్ కోచ్ గంభీర్ ఆటగాళ్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ప్రత్యేకంగా ఆటగాళ్ల పేర్లు తీసుకోకపోయినా... ఇకపై జట్టు అవసరాలకు తగ్గట్లు ఆడకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయనే ధోరణిలో గంభీర్ ప్లేయర్లకు క్లాస్ తీసుకున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
డ్రెస్సింగ్ రూమ్ చర్చలు బయటకు రాకపోవడమే జట్టుకు శ్రేయస్కరమని మాజీ ఆటగాళ్లు హితబోధ చేస్తుండగా... ధోనీ, విరాట్ కోహ్లి సారథిగా ఉన్నప్పుడు ఇలాంటి విషయాలు బయటకు వచ్చేవి కావని పలువురు గుర్తు చేస్తున్నారు.
వరుస వైఫల్యాలతో ఇప్పటికే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు చేరే అవకాశాలను దాదాపు కోల్పోయిన భారత జట్టు... ఇక చివరిదైన సిడ్నీ టెస్టులోనైనా విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకుంటుందా చూడాలి. ఆఖరి టెస్టులో టీమిండియా విజయం సాధిస్తే సిరీస్ 2–2తో ‘డ్రా’ అయినా... గత సిరీస్‌లో విజేతగా నిలిచినందుకు ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’ భారత్ వద్దే ఉంటుంది.
వేడెక్కిన డ్రెస్సింగ్ రూమ్...
ప్రధాన ఆటగాళ్లు అందుబాటులో లేని సమయంలో జరిగిన తొలి టెస్టు (పెర్త్)లో చక్కటి ప్రదర్శన కనబర్చిన టీమిండియా... ఆ తర్వాత అదే జోరు కొనసాగించడంలో విఫలమైంది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు, యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ జట్టులో లేకపోయినా... తాత్కాలిక సారథి జస్‌ప్రీత్ బుమ్రా జట్టును ముందుండి నడిపించాడు.
రెండో టెస్టు నుంచి రోహిత్, గిల్ తుది జట్టులోకి రావడంతో టీమిండియా ప్రదర్శన మరింత మెరుగవుతుందనుకుంటే... నానాటికి దిగజారింది. ఆ తర్వాత ఆడిన మూడు టెస్టుల్లో భారత జట్టు రెండింట ఓడి ఒక దానిని ‘డ్రా’ చేసుకుంది. మెల్‌బోర్న్ టెస్టులో ఒకదశలో మెరుగైన స్థితిలో నిలిచి ఆ తర్వాత పేలవ ఆటతీరుతో ఓటమిని కోరి కొని తెచ్చుకుంది. స్టార్ బ్యాటర్ కోహ్లి మరోసారి తన బలహీనత కొనసాగిస్తూ ఆఫ్‌స్టంప్ అవతలి బంతిని వెంటాడి అవుట్ కాగా... రిషభ్ పంత్ రెండు ఇన్నింగ్స్‌లలో అనవసర షాట్‌లు ఆడి వికెట్ సమర్పించుకున్నాడు.
ఇక నిలకడగా ఆడిన యశస్వి జైస్వాల్ కూడా షాట్ సెలెక్షన్ లోపంతోనే వెనుదిరగగా... ఈ సిరీస్‌లో ఇటు సారథిగా, అటు బ్యాటర్‌గా విఫలమవుతున్న రోహిత్ శర్మ ఎలాంటి ప్రభావం చూపలేకపోయాడు. దీంతో మ్యాచ్ అనంతరం డ్రెస్సింగ్ రూమ్‌లో ఆటగాళ్లపై గంభీర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.
ఇప్పటి వరకు సహజశైలిలో ఆడమని ప్రోత్సహించిన గంభీర్... జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఇష్టారీతిన షాట్లు ఆడి అవుట్ కావడంపై పలువురు ఆటగాళ్లపై సీరియస్ అయినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. డ్రెస్సింగ్‌రూమ్‌లో పరిస్థితి అంతా సవ్యంగా లేదని... ఆటగాళ్లలో అనిశ్చితి నెలకొందనే వార్తలు బయటకు వస్తున్నాయి.
పుజారా కోసం పట్టుబట్టినా...
గత రెండు పర్యాయాలు ఆ్రస్టేలియా పర్యటనలో భారత జట్టు టెస్టు సిరీస్‌లు గెలవడంలో కీలక పాత్ర పోషించిన వన్‌డౌన్ బ్యాటర్ చతేశ్వర్ పుజారాను ఈసారి కూడా జట్టులోకి తీసుకోవాలని గంభీర్ పట్టుబట్టినా... సెలెక్షన్ కమిటీ మాత్రం అందుకు అంగీకరించలేదు. జట్టులో స్థిరత్వం తీసుకురాగల పుజారా వంటి ప్లేయర్ అవసరమని గంభీర్ చెప్పినా... సెలెక్షన్ కమిటీ పెడచెవిన పెట్టింది. తాజా సిరీస్‌లో తొలి టెస్టు అనంతరం కూడా గంభీర్ పుజారాను జట్టులోకి తీసుకునేందుకు ప్రయత్నించినట్లు సమాచారం.
ఇక జట్టును ముందుండి నడిపించాల్సిన సారథి రోహిత్ శర్మనే టీమ్‌కు భారంగా పరిణమించాడనేది కాదనలేని సత్యం. ఏ స్థానంలో బ్యాటింగ్‌కు దిగినా... ‘హిట్‌మ్యాన్’ తన సహజసిద్ధ ఆటతీరు కనబర్చలేక పోతున్నాడు. ఈ నేపథ్యంలో అతడి కెరీర్‌పై నీలినీడలు కమ్ముకోగా... ఆస్ట్రేలియాతో సిరీస్ అనంతరం కఠినమైన నిర్ణయాలు తప్పకపోవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
అయితే యువ ఆటగాళ్లు నాయకత్వ బాధ్యతలు తీసుకునేందుకు ఇది తగిన సమయం కాదని... ఇలాంటి సంధి దశలో పరిస్థితులను చక్కదిద్దాలంటే అనుభవమే ముఖ్యమని ఓ సీనియర్ ఆటగాడు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం. పింక్ బాల్ టెస్టులో ఆకాశ్‌దీప్‌ను కాదని హర్షిత్ రాణాను తుదిజట్టుకు ఎంపిక చేయడంపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment