
రాజస్తాన్ రాయల్స్‌తో జరిగే నాకౌట్ మ్యాచ్ సొంతగడ్డపై ఆడే అవకాశం రావడం కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు అతి పెద్ద బలంగా చెప్పవచ్చు. ఈడెన్ అభిమానులు పెద్ద ఎత్తున నైట్‌రైడర్స్‌కు అండగా నిలుస్తారు కాబట్టి రాజస్తాన్‌కు అంత సులువు కాదు. సహజంగానే ఆరంభంలో కెప్టెన్‌గా కొంత తడబాటు తర్వాత దినేశ్ కార్తీక్ స్ఫూర్తిదాయక నాయకత్వంతో జట్టును నాకౌ ట్స్ వరకు నడిపించా డు. యువ ఆటగాళ్ల నుంచి అతను మంచి ప్రదర్శన రాబట్టిన తీరు అసలైన నాయకత్వానికి మంచి ఉదాహరణ. వారికి మంచి అవకాశాలు ఇవ్వడమే కాదు... తప్పులు చేసినా వాటినుంచి నేర్చుకునేలా చేయడం, ఫలితంపైనే కాకుండా వారి ప్రతిభపై నమ్మకం ఉంచి జట్టులో కొనసాగించాడు. ఈ కోణంలో చూస్తే శివమ్ మావి, ప్రసిధ్ కృష్ణ అతని నాయకత్వంలో ఎంతో ఎదిగారని నాకనిపిస్తోంది. తన అసలు ప్రతిభ ప్రదర్శించేందుకు తగినన్ని ఓవర్లు లభించకపోయినా శుబ్‌మన్ గిల్ ఆకట్టుకున్నాడు. తాను ఎదుర్కొన్న తక్కువ బంతుల్లోనే చక్కటి షాట్లు ఆడటమే కాదు, మ్యాచ్ పరిస్థితులను బట్టి స్పందించగలనని నిరూపించుకున్నాడు. భవిష్యత్తులో అతను గొప్ప ఆటగాడిగా ఎదగుతాడు. నరైన్, రసెల్, లిన్‌వంటి విదేశీయులు కోల్‌కతా విజయంలో కీలక పాత్ర పోషించినా భారత ఆటగాళ్ల పాత్ర కూడా చాలా ఉంది.
మరోవైపు రాజస్తాన్ కుర్రాళ్లలో కూడా ఇదే పట్టుదల కనిపించింది. స్టోక్స్, బట్లర్ వెళ్లిపోయిన తర్వాత బెంగళూరుతో తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో భారత స్పిన్నర్లు చెలరేగారు. సంజు శామ్సన్ ప్రస్తుతం ఫామ్ కోల్పోయినా... అతని సామర్థ్యాన్ని బట్టి చూస్తే ఇప్పటికీ అతనికే జట్టులో ఎక్కువ ఓవర్లు ఆడే అవకాశం ఇవ్వాలి. ఆర్చర్‌ను ఓపెనర్‌గా పంపిన ప్రయత్నం విఫలం అయింది కాబట్టి ఆ స్థానంలో శామ్సన్‌ను ఉపయోగించుకోవచ్చు. గత మ్యాచ్‌లో శ్రేయస్ గోపాల్, త్రిపాఠి చక్కటి ప్రదర్శన కనబర్చారు. ఈ సారి కూడా వారు మ్యాచ్‌ను మలుపు తిప్పగల సమర్థులు. తమ స్థాయి కి తగిన గుర్తింపు లభించని రెండు అత్యుత్తమ జట్లు పంచే వినోదంలో ఫలితంతో సంబంధం లేకుండా ఈడెన్ అభిమానులు తడిసి ముద్దవడం ఖాయం.