ఐపీఎల్ మొదటి వారం చివరికి వచ్చేసరికి గెలుపు ట్రెండ్ నెమ్మదిగా మారుతున్నట్లుంది. అంతకుముందు వరకు ఛేజింగ్‌కు దిగిన జట్లు నెగ్గగా... గత రెండు మ్యాచ్‌ల్లో మాత్రం మొదట బ్యాటింగ్‌కు దిగిన జట్లు విజయం సాధించాయి. మెరుపు ఆరంభం దక్కితే... 200 పరుగుల వరకు చేసే అవకాశం ఉంటుంది. ప్రత్యర్థిని ముందే ఒత్తిడిలోకి నెట్టి, ఓవర్‌కు 10 రన్‌రేట్ సాధించాల్సి ఉంటుంది కాబట్టి ఇది ఎప్పుడైనా సరిపోయే స్కోరే. ఇలాంటి సమయంలో రెండు వికెట్లు పడితే రన్‌రేట్ 12కు పైగా చేరి ఒత్తిడి మరింత అధికమవుతుంది. జట్టును గట్టెక్కించే సామర్థ్యం అందరు ఆటగాళ్లకు ఉండదు. కానీ, పంజాబ్‌పై మహేంద్ర సింగ్ ధోని దాదాపు దగ్గరగా వచ్చాడు. అతడి విధ్వంసకర ఆట గెలుపును అందించకపోయినా, ఆ భారీ సిక్స్‌లు చూడటం గొప్ప థ్రిల్. మొత్తానికి చెన్నై విజయ యాత్రకు అడ్డుకట్ట పడింది. కానీ సన్‌రైజర్స్ హైదరాబాద్ మాత్రం పరంపర కొనసాగిస్తోంది. ముంబై ఖాతా తెరవకపోయినా కొన్నేళ్లుగా దాని ప్రయాణం నెమ్మదిగానే మొదలవుతోంది.
ఇప్పటివరకు పాయింట్ల పట్టికలో చోటు లేని ఏకైక జట్టు ముంబై. ఈ విషయమై చాలా ఆత్రుతతో ఉంది. వారు మరింత బాగా బ్యాటింగ్ చేయాలి. ఎవిన్ లూయీస్‌కు జతగా సూర్యకుమార్‌ను ఓపెనర్‌గా పంపడం అద్భుత ఫలితాన్నిచ్చింది. ఇషాన్ కిషన్ వేగంగా ఆడుతున్నందున గత మ్యాచ్‌లో 200పైగా స్కోరు సాధించడం తేలికే అనిపించినా మిడిలార్డర్ పేలవ షాట్లు దెబ్బతీశాయి. హార్దిక్ పాండ్యా క్రీజులో ఉండగా స్పిన్నర్లతో బౌలింగ్ చేయించకూడదని అన్ని జట్లు తెలుసుకున్నాయి. స్పిన్నర్ల బంతులను అవలీలగా స్టాండ్స్‌లోకి కొట్టే అతడు పేసర్ల బౌలింగ్‌లో ఆ పని చేయలేడని ప్రత్యర్థి కెప్టెన్లు అంచనాకు వచ్చారు. కాబట్టి ఫీల్డింగ్ పరిమితులు ఉండే సమయంలో హార్దిక్‌ను బ్యాటింగ్‌కు పంపడంపై ముంబై ఓసారి ఆలోచించాలి. అదే జరిగితే సోదరుడు కృనాల్ కంటే విధ్వంసకరంగా ఆడగలడు. కృనాల్ తన తమ్ముడిలా భారీ సిక్స్‌లు కొట్టకున్నా ఎడమ చేతివాటం స్పిన్, లోయరార్డర్‌లో విలువైన పరుగులు చేస్తున్నాడు. రాజస్తాన్ రాయల్స్‌పై బెంగళూరు ఛేదన ప్రయత్నం స్ఫూర్తిదాయకం. అయితే కోహ్లి, డివిలియర్స్ అవుటయ్యాక కొండలాంటి స్కోరును అందుకోలేకపోయింది. వారి టాప్ ఫోర్ బ్యాట్స్‌మెన్‌ను చూస్తే మిగతా జట్లకు అసూయ కలగక మానదు. కానీ ఇంకా గెలుపును అందించే స్థాయిలో పరుగులు చేయడం లేదు. వాంఖెడేలో బ్యాటింగ్‌ను కోహ్లి, డివిలియర్స్ చాలా ఇష్టపడతారు. వారు గనుక చెలరేగితే పాయింట్ల పట్టికలో చోటుకోసం ముంబైకి నిరీక్షణ తప్పదు.
అతడిని ముందుకు పంపితే...
Published Tue, Apr 17 2018 12:43 AM | Last Updated on Tue, Apr 17 2018 12:43 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment