ఐపీఎల్-2024 ఆఖరి అంకానికి చేరుకుంటోంది. ఇప్పటికే ఒక ఫైనలిస్టు ఖరారు కాగా.. తుది పోరుకు అర్హత సాధించేందుకు మిగిలిన మూడు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి.
ఈ సీజన్‌లో ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టిన కోల్‌కతా నైట్ రైడర్స్ క్వాలిఫయర్-1లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్‌లో మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో రైజర్స్‌ను ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తు చేసి ఫైనల్‌కు దూసుకువెళ్లింది కేకేఆర్.
ఇక ఫైనల్ రేసులో మిగిలినవి రెండే మ్యాచ్‌లు. ఎలిమినేటర్, క్వాలిఫయర్-2. పాయింట్ల పట్టికలో మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన రాజస్తాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య బుధవారం ఎలిమినేటర్ మ్యాచ్ జరుగనుంది.
సన్‌రైజర్స్‌తో ఎలిమినేటర్ విజేత పోటీ
ఇందులో గెలిచిన జట్టు క్వాలిఫయర్-2కు అర్హత సాధిస్తుంది. క్వాలిఫయర్-1లో కేకేఆర్ చేతిలో ఓడిన సన్‌రైజర్స్‌తో అమీతుమీ తేల్చుకుంటుంది. ఆ మ్యాచ్‌లో గనుక గెలిస్తే ఫైనల్‌కు చేరుకుంటుంది.
ఈ క్రమంలో బెంగళూరు- రాజస్తాన్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ మరింత ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజం, ప్రముఖ కామెంటేటర్ సునిల్ గావస్కర్ ఎలిమినేటర్ విజేత ఎవరన్న అంశంపై తన అంచనా తెలియజేశాడు.
‘‘ఆర్సీబీ ఈసారి ఎంతటి అద్భుతం చేసిందో చూశాం. ముఖ్యంగా వరుస పరాజయాల తర్వాత వాళ్లు తిరిగి పుంజుకున్న తీరు అమోఘం. మామూలు జట్లకు ఇలాంటివి సాధ్యం కావు.
అయ్యో.. మనం ఓడిపోతూనే ఉన్నాం
ఆర్సీబీ ప్రధాన ఆటగాళ్లలో కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్, విరాట్ కోహ్లితో పాటు మిగతా సీనియర్ ప్లేయర్లు తమ ఆట తీరుతో.. జట్టులో ఉత్సాహం నింపారు. ఆర్సీబీ స్థానంలో మరే ఇతర జట్టు ఏదైనా ఉంటే.. ‘అయ్యో.. మనం ఓడిపోతూనే ఉన్నాం. అంతా ముగిసిపోయింది’ అని బెంబేలెత్తిపోయేవాళ్లు.
కానీ డుప్లెసిస్, కోహ్లి ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని సడలనివ్వలేదు. ఇక రాజస్తాన్.. గత నాలుగు- ఐదు మ్యాచ్‌లలో ఓడిపోతూనే ఉంది. ఆఖరిగా ఆడిన మ్యాచ్‌లోనూ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది.
వాళ్లను చూస్తే పూర్తిగా ఫామ్ కోల్పోయినట్లు కనిపిస్తున్నారు. పదకొండు రోజుల పాటు ఆటకు దూరంగా ఉన్న కేకేఆర్ మాదిరి ఏదైనా ప్రత్యేకంగా చేస్తే తప్ప రాజస్తాన్‌కు గెలిచే అవకాశాలు ఉండవు.
లేదంటే మ్యాచ్ ఏకపక్షంగా సాగిపోయే ఛాన్స్ ఉంది. ఆర్సీబీ రాజస్తాన్‌ను చిత్తు చేసినా చేస్తుంది. ఒకవేళ అలా జరగకపోతేనే ఆశ్చర్యం’’ అని సునిల్ గావస్కర్ స్టార్ స్పోర్ట్స్ షోలో వ్యాఖ్యానించాడు. ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆర్సీబీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంచనా వేశాడు.
గావస్కర్ వర్సెస్ కోహ్లి
కాగా ఇటీవల గావస్కర్- కోహ్లి మధ్య మాటల యుద్ధం నడిచిన విషయం తెలిసిందే. కోహ్లి స్ట్రైక్‌రేటు గురించి గావస్కర్ విమర్శించగా.. రన్‌మెషీన్ అందుకు కాస్త ఘాటుగానే బదులిచ్చాడు. ఎలా ఆడాలో తనకు తెలుసునని.. జట్టు ప్రయోజనాల కోసం ఏం చేయాలో కూడా తెలుసంటూ కౌంటర్ వేశాడు.
Comments
Please login to add a commentAdd a comment