కోహ్లి... శతకలహరి | Royal Challengers won by 10 runs to Kolkata Knight Riders | Sakshi
Sakshi News home page

కోహ్లి... శతకలహరి

Published Sat, Apr 20 2019 3:56 AM | Last Updated on Sat, Apr 20 2019 7:39 AM

Royal Challengers won by 10 runs to Kolkata Knight Riders - Sakshi

తమ సొంతగడ్డపై బెంగళూరు జట్టు కోల్‌కతాపై 200 పైచిలుకు పరుగులు చేసినా ఓడిపోయింది. అదే జట్టు ఇప్పుడు కోల్‌కతాలో అదే ప్రత్యర్థిపై 213 పరుగులు చేసి గెలిచింది. రసెల్, నితీశ్‌ రాణా సిక్సర్లతో ఆఖరి ఓవర్‌దాకా హోరెత్తించినా చివరకు కోహ్లి సేన గెలిచి హమ్మయ్య అని ఊపిరిపీల్చుకుంది.   

కోల్‌కతా: బెంగళూరు భారీస్కోరైతే చేసింది... కానీ చచ్చీచెడి గెలిచింది. కోల్‌కతా హిట్టర్లు రసెల్, రాణా సిక్సర్లతో ఊపేసిన ఈ మ్యాచ్‌ ఆఖరి మూడు బంతుల్లో బెంగళూరుకు గెలుపు మలుపు తీసుకుంది. చివరకు రాయల్‌ చాలెంజర్స్‌ జట్టు 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌ చేపట్టిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. కోహ్లి (58 బంతుల్లో 100; 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) శతక్కొట్టగా, మొయిన్‌ అలీ (28 బంతుల్లో 66; 5 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరుపులు మెరిపించాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 203 పరుగులు చేసి ఓడింది. నితీశ్‌ రాణా (46 బంతుల్లో 85 నాటౌట్‌; 9 ఫోర్లు, 5 సిక్స్‌లు), రసెల్‌ (25 బంతుల్లో 65; 2 ఫోర్లు, 9 సిక్స్‌లు) భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డారు. కోహ్లికి ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది. అస్వస్థతతో ఈ మ్యాచ్‌లో డివిలియర్స్‌ బరిలోకి దిగలేదు. క్లాసెన్, స్టెయిన్‌ బెంగళూరు తుది జట్టులోకి వచ్చారు. 

మెల్లిగా మొదలై... ఉప్పెనలా మారి! 
టాస్‌ నెగ్గిన కోల్‌కతా ఫీల్డింగ్‌ ఎంచుకోవడంతో బెంగళూరు ఆటకు కోహ్లి, పార్థివ్‌ పటేల్‌ శ్రీకారం చుట్టారు. ఆరంభంలో ఆట చాలా నెమ్మదించింది. తొలి ఓవర్లో 3, రెండో ఓవర్లో 4 పరుగులే వచ్చాయి. మూడో ఓవర్లో 2 బౌండరీలు కొట్టిన పార్థివ్‌ (11)ను నరైన్‌ ఔట్‌ చేశాడు. కోహ్లికి జతయిన అ„Š దీప్‌... ప్రసిధ్‌ కృష్ణ బౌలింగ్‌లో సిక్సర్‌ బాదగా, కోహ్లి ఫోర్‌ కొట్టాడు. కెప్టెన్‌ క్రీజులో ఉన్నా... బెంగళూరు 8 ఓవర్లలో 50 పరుగులే చేసింది. మరుసటి ఓవర్లో అ„Š దీప్‌ (13)ను రసెల్‌ ఔట్‌ చేశాడు. అప్పటికి జట్టు స్కోరు 59/2. మొయిన్‌ అలీ రాకతో ఆట స్వరూపమే మారింది. వచ్చీరాగానే సిక్సర్‌ బాదాడు. 10 ఓవర్లలో 2 వికెట్లకు 70 పరుగులు చేసింది. రసెల్‌ ఓవర్లో కోహ్లి, చావ్లా బౌలింగ్‌లో మొయిన్‌ భారీ సిక్సర్లు బాదడంతో స్కోరు జోరందుకుంది. ప్రత్యేకించి మొయిన్‌... కుల్దీప్‌ బౌలింగ్‌నైతే చీల్చి చెండాడాడు. కోహ్లి 40 బంతుల్లో ఫిఫ్టీ చేశాడు. 

కుల్దీప్‌ స్పిన్నేస్తే... మొయిన్‌ దంచేస్తే... 
బెంగళూరు 15 ఓవర్లు ముగిసేసరికి 122/2 స్కోరు చేసింది. కోహ్లి అర్ధసెంచరీ మీదుంటే... మొయిన్‌ అలీ జోరు మీదున్నాడు. కుల్దీప్‌ 16వ ఓవర్‌ వేసేందుకు వచ్చాడు. స్ట్రయిక్‌లో ఉన్న అలీ 4, 6, 4, 6, వైడ్, 6తో చెలరేగాడు. 24 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్సర్లతో అర్ధసెంచరీని మెరుపువేగంతో పూర్తి చేశాడు. 27 పరుగులు కొట్టాక ఆఖరి బంతికీ భారీషాటే ఆడాడు. కానీ బౌండరీ దగ్గర ప్రసిధ్‌ కృష్ణ చేతికి చిక్కాడు. ఒక్క ఓవర్‌తో జట్టు స్కోరు 149/3కి చేరింది. స్టొయినిస్‌ జతకాగా... తర్వాత గర్నీ ఓవర్‌ను కోహ్లి ఆడుకున్నాడు. రెండు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 19 పరుగులు పిండుకున్నాడు. నరైన్‌ బౌలింగ్‌లో మరో సిక్సర్‌ కొట్టిన చాలెంజర్స్‌ కెప్టెన్‌... ప్రసిధ్‌ వేసిన 19వ ఓవర్లో దంచేశాడు.

6, 4తో కలిపి 15 పరుగులు చేయగా, స్టొయినిస్‌ బౌండరీతో 19 పరుగులొచ్చాయి. చివరి ఓవర్లో స్టొయినిస్‌ బౌండరీ, సిక్సర్‌ బాదగా... కోహ్లి ఫోర్‌ కొట్టి 57 బంతుల్లోనే (9 ఫోర్లు, 4 సిక్స్‌లు) శతకాన్ని పూర్తి చేశాడు. ఆఖరి బంతికి ఔటయ్యాడు. ఈ ఆఖరి ఐదు ఓవర్లలో 2 వికెట్లను కోల్పోయిన బెంగళూరు ఏకంగా 91 పరుగులు చేయడం విశేషం. తొలి 10 ఓవర్లలో 70/2 స్కోరైతే... చివరి 10 ఓవర్లలో 143 పరుగులు చేసింది.  


స్టెయిన్‌ దెబ్బ... 
భారీ లక్ష్యఛేదనకు దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను స్టెయిన్‌ దెబ్బ తీశాడు. తన తొలి ఓవర్లో లిన్‌ (1)ను, మూడో ఓవర్లో (ఇన్నింగ్స్‌ 5వ) శుబ్‌మన్‌ గిల్‌ (9)ను ఔట్‌ చేశాడు. నరైన్‌ (18) సైనీ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. 33 పరుగులకే 3 వికెట్లను కోల్పోయిన జట్టును నితీశ్‌ రాణా ఆదుకున్నాడు. ఒక దశలో స్కోరు మందగించింది. తొలి 10 ఓవర్లలో 3 వికెట్లకు 60 పరుగులే చేసింది. ఉతప్ప (9) కూడా విఫలమవగా... రాణాకు రసెల్‌ జతయ్యాక బంతులు సిక్సర్లకు బలయ్యాయి. దీంతో భారీస్కోరైనా రసవత్తరంగా మారింది. 14 ఓవర్లు ముగిసేదాకా 101/4 స్కోరుతో ఉన్న కోల్‌కతా ఇన్నింగ్స్‌లో 15వ ఓవర్‌ నుంచి రసెల్‌ గర్జన మొదలైంది. దీంతో కోహ్లి శిబిరంలో ఆందోళన కూడా పెరిగింది.

చహల్‌ వేసిన ఆ ఓవర్లో రసెల్‌ హ్యాట్రిక్‌ సిక్సర్లు బాదాడు. దీంతో 20 పరుగులొచ్చాయి. 16వ ఓవర్‌ వేసేందుకు వచ్చి సైనీకి ఇదే ఇనుభవం ఎదురైంది. కానీ ఈసారి రాణా ఆ పని చేశాడు. 1 ఫోర్, 2 సిక్సర్లు బాదడంతో 17 పరుగులు జతయ్యాయి. సిరాజ్‌ వేసిన 17 ఓవర్లో రసెల్‌ మరో సిక్సర్, ఫోర్‌తో 15 పరుగులు రావడంతో జట్టు స్కోరు 153/4కు చేరింది. ఇక మూడు ఓవర్లు మిగిలాయి. కోల్‌కతా విజయానికి 18 బంతుల్లో 61 పరుగులు కావాలి. స్టెయిన్‌ బౌలింగ్‌లో రాణా చెలరేగాడు. 2 సిక్సర్లు, ఒక ఫోర్‌ బాదడంతో 18 పరుగులు వచ్చేశాయి.


ఇక కావాల్సిన పరుగులు 43 అయితే బంతులు 12! స్టొయినిస్‌ బౌలర్‌... 3 బంతులు బాగానే వేశాడు. కానీ తర్వాతి 3 బంతుల్ని రసెల్‌ 6, 6, 6గా తరలించాడు. ఆఖరి ఓవర్‌కు 24 పరుగులు చేయాల్సి వుండగా... కోహ్లి బంతి మొయిన్‌ అలీకిచ్చాడు. రెండు బంతులెదుక్కొన్న రాణా పరుగు తీసి రసెల్‌కు స్ట్రయిక్‌ ఇచ్చాడు. 4 బంతుల్లో 23 పరుగులు చేయాల్సిన దశలో సిక్సర్‌ కొట్టిన రసెల్‌ ఒక బంతి బీట్‌ అయ్యాడు. ఐదో బంతికి రనౌటయ్యాడు. రాణా సిక్సర్‌తో ఆట ముగించగా... బెంగళూరు విజయంతో ఊపిరి పీల్చుకుంది. 

ఈ‘డెన్‌’లో విరాట్‌ షో 
ఈ‘డెన్‌’లో మ్యాచ్‌ అంతా కోహ్లి మ్యాజికే! ముందు ఓపిగ్గా ఆడినా... తర్వాత బౌండరీలతో ఊపేసినా... చివరకు శతక్కొట్టినా... అద్భుతమైన క్యాచ్‌లు పట్టినా... ఈడెన్‌ గార్డెన్స్‌లో ‘విరాట్‌’పర్వమే కనబడింది. అంతేకాదు. తన సరదాలహరి కూడా ఈడెన్‌ ప్రేక్షకుల్ని రంజింపజేసింది. 18వ ఓవర్‌ వేసిన నరైన్‌ బౌలింగ్‌లో సిక్స్‌ కొట్టిన కోహ్లి పరుగు తీసి నాన్‌ స్ట్రయిక్‌లోకి వచ్చాడు. బంతి వేసేందుకు వచ్చిన నరైన్‌ బంతిని సంధించలేదు. ‘మన్కడింగ్‌’ అనుకొని కోహ్లి క్రీజ్‌లోకి బ్యాట్‌ పెడుతూ ఫోజు ఇచ్చాడు. ఇది అందరినీ నవ్వించింది. 

►5 ఐపీఎల్‌లో కోహ్లికిది ఐదో సెంచరీ. ఆరు సెంచరీలతో గేల్‌ అగ్రస్థానంలో ఉన్నాడు. వార్నర్, వాట్సన్‌ మూడేసి సెంచరీలతో మూడో స్థానంలో ఉన్నారు. 

►1ఐపీఎల్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు ఇచ్చిన స్పిన్నర్‌గా తాహిర్‌ (59–ఢిల్లీ; ముంబైపై 2016 వైజాగ్‌లో) పేరిట ఉన్న చెత్త రికార్డును కుల్దీప్‌ సమం చేశాడు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement