కీలక పోరులో ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడుతున్న వేళ... గత మ్యాచ్‌లో ఆండ్రీ రసెల్ తమ బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా విరుచుకు పడి చావబాదిన తీరు రాయల్ చాలెంజర్స్ బెంగళూరును వెంటాడుతూనే ఉంటుంది. ఢిల్లీకి కూడా తమ సొంత సమస్యలు ఉండటం ఒక్కటే బెంగళూరుకు కాస్త ఊరటనిచ్చే విషయం. తమ బ్యాట్స్‌మెన్ చెత్త షాట్లు ఆడటంతో తక్కువ స్కోరుకే పరిమితమై సన్‌రైజర్స్‌కు మ్యాచ్ సమర్పించుకుంటే ఆ జట్టు పిచ్‌ను నిందిస్తోంది. నిజాయితీగా తమ లోపాలను గుర్తించి సరిదిద్దుకునే బదులు పిచ్‌ను తిట్టి ప్రధాన అంశాన్ని పక్కదోవ పట్టించడం చూస్తే ‘పని చేతకానివాడు తమ పనిముట్లను తప్పు పట్టాడట’...అనే పాతకాలం సామెత నాకు గుర్తుకొస్తోంది.
అసలు వారు ఆడిన షాట్లు చూశారా! ఆ తర్వాత ఐదు వికెట్లు తీసిన తర్వాత కూడా ఒత్తిడి పెంచకుండా పస లేని బౌలింగ్‌తో వారు హైదరాబాద్‌కు కోలుకునే అవకాశం కల్పించారు. బెంగళూరులో బ్యాటింగ్‌కు బాగా అనుకూలించిన పిచ్‌పై శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఇరు జట్లు చెలరేగడంతో 400కు పైగా పరుగులు రావడం అభినందించదగ్గ విషయం. పిచ్ ఇక ముందు కూడా మారకపోవచ్చు. కాబట్టి కోహ్లి టాస్ గెలిచి ఛేదనకు మొగ్గు చూపాలని బెంగళూరు అభిమానులు ఆశిస్తున్నారు. ఎందుకంటే ఎంత పెద్ద లక్ష్యాన్నైనా జట్టు బౌలర్లు నిలబెట్టలేకపోతున్నారు. సరైన లెంగ్త్‌లో బౌలింగ్ చేస్తే ఇక్కడి అదనపు బౌన్స్ రబడ, మోరిస్‌లకు సహకరించవచ్చు.
ఓటమి దిశగా వెళుతున్న సమయంలో రసెల్ భీకర బ్యాటింగ్‌తో మ్యాచ్ గెలుచుకున్న అనంతరం కోల్‌కతా జట్టులో జోరు మరింత పెరిగింది. ఇలాంటి సమయంలో ఆ జట్టు తో రాజస్తాన్ రాయల్స్‌కు పోరాటం తప్పదు. రాయ ల్స్ పవర్‌ప్లేలో మరింత సానుకూలంగా ఆడితే మం చిది. ఇప్పటి వరకు చెలరేగని స్మిత్, స్టోక్స్ కూడా బా గా ఆడితే రాజస్తాన్ భారీ స్కోరు చేయవచ్చు. కోల్‌కతా నైట్‌రైడర్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. రసెల్ చెలరేగడం, ఇతర ఆటగాళ్లు కూడా తమ వంతు పాత్ర పోషిస్తుండటంతో పాటు చివరి వరకు ఓటమిని అంగీకరించని తత్వం ఆ జట్టును గెలిపిస్తున్నాయి. ఇక నరైన్ ఒక్కడు గతంలోలాగా ఆరంభంలో వికెట్లు తీయగలిగితే కోల్‌కతాను ఆపడం కష్టం కావచ్చు.
Comments
Please login to add a commentAdd a comment