రాజస్తాన్‌ ఆశలపై నీళ్లు  | Rain Washes Out Royal Challengers Bangalore vs Rajasthan Royals Match In Bengaluru | Sakshi
Sakshi News home page

రాజస్తాన్‌ ఆశలపై నీళ్లు 

Published Wed, May 1 2019 1:15 AM | Last Updated on Wed, May 1 2019 8:09 AM

Rain Washes Out Royal Challengers Bangalore vs Rajasthan Royals Match In Bengaluru - Sakshi

బెంగళూరు: ఐపీఎల్‌లో అందరి కంటే ముందే రేసు నుంచి తప్పుకున్న జట్టు రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు. ఎటొచ్చి రాజస్తాన్‌ రాయల్స్‌కే మ్యాచ్‌తోనూ, గెలుపుతోనూ పని ఉంది. కానీ వర్షం ఆగేదాకా నిరీక్షించి బరిలోకి దిగినా మళ్లీ వెంటాడిన వర్షం రాయల్స్‌ను నిండా ముంచేసింది. బెంగళూరులో మంగళవారం రాత్రి కురిసిన హోరు వానలో రాజస్తాన్‌ ‘ప్లేఆఫ్‌’ ఆశలు దాదాపుగా కొట్టుకుపోయాయి. చిన్నస్వామి స్టేడియాన్ని పెద్ద వాన తడిపేసింది. పొట్టి ఫార్మాట్‌లోనే నాలుగో వంతు పొట్టి మ్యాచ్‌ను (5 ఓవర్ల) మొదలుపెట్టినా... పూర్తి కాకుండానే ఆగిపోయింది.  మ్యాచ్‌ రద్దు కావడంతో రెండు జట్లకు ఒక్కో పాయింట్‌ కేటాయించారు. 

టాస్‌తో మొదలైంది ఆట కాదు... వాన! 
టాస్‌ నెగ్గిన రాజస్తాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ స్మిత్‌ బౌలింగ్‌ ఎంచుకున్నాడు. ఆ తర్వాత భారీ వర్షంతో చిన్నస్వామి స్టేడియం చెరువును తలపించింది. వర్షం పూర్తిగా తగ్గాక అంపైర్లు పలుమార్లు పిచ్‌ను, ఔట్‌ఫీల్డ్‌ను పరిశీలించారు. చివరకు 30–30 బాల్స్‌ (5 ఓవర్ల) మ్యాచ్‌ను ఆడించారు. బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 5 ఓవర్లలో 7 వికెట్లను కోల్పోయి 62 పరుగులు చేసింది. కోహ్లి (7 బంతుల్లో 25; 1 ఫోర్, 3 సిక్సర్లు) మెరిపించాడు. శ్రేయస్‌ గోపాల్‌ (3/12) హ్యాట్రిక్‌తో అదరగొట్టాడు. వర్షంతో మ్యాచ్‌ రద్దయ్యే సమయానికి రాజస్తాన్‌ 3.2 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 41 పరుగులు చేసింది. సామ్సన్‌ (13 బంతుల్లో 28; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) చెలరేగాడు. 

30–30 బంతులాట ఆగిందిలా.... 
తొలి ఓవర్‌: 6, 6, 1, 4, 2, 4; వరుణ్‌ అరోన్‌ వేసిన ప్రారంభ ఓవర్‌లో 23 పరుగులొచ్చాయి. డివిలియర్స్‌తో ఇన్నింగ్స్‌ ఓపెన్‌ చేశాడు కోహ్లి. తొలి మూడు బంతుల్ని ఆడిన విరాట్‌ 2 సిక్సర్లు బాదాడు. చివరి మూడు బంతుల్ని ఆడిన డివిలియర్స్‌ 2 ఫోర్లు కొట్టాడు. 
రెండో ఓవర్‌: 6, 4, 2 తర్వాత శ్రేయస్‌ గోపాల్‌ హ్యాట్రిక్‌ తీశాడు. మెరుపులకు కళ్లెంవేశాడు. కోహ్లి వరుస బంతుల్లో సిక్స్, ఫోర్‌ కొట్టాడు. నాలుగో బంతినీ బాదేందుకు ప్రయత్నించాడు. లాంగాన్‌లో లివింగ్‌స్టోన్‌ క్యాచ్‌ పట్టడంతో కోహ్లి నిష్క్రమించాడు. ఆ మరుసటి బంతికే డివిలియర్స్‌ (4 బంతుల్లో 10; 2 ఫోర్లు) ఔటయ్యాడు. స్టొయినిస్‌ (0) డకౌట్‌ కావడంతో ఈ సీజన్‌లో రెండో ‘హ్యాట్రిక్‌’ నమోదైంది. 
మూడో ఓవర్‌: 2, 1, 2, 4, వి, 1; పరాగ్‌ 10 పరుగులిచ్చి వికెట్‌ తీశాడు.   క్లాసెన్‌ 3 పరుగులు చేయగా, బౌండరీ కొట్టిన గుర్‌కీరత్‌ సింగ్‌ (6) ఔటయ్యాడు.  
నాలుగో ఓవర్‌: 1, 4, 2, 2, 0, వి; బంతిని అందుకున్న ఉనాద్కట్‌ 9 పరుగులిచ్చి పార్థివ్‌ పటేల్‌ (8) వికెట్‌ తీశాడు. ఈ ఓవర్లో ఒక బంతి బౌండరీని దాటింది. 
ఐదో ఓవర్‌: నోబ్, 1, 1, వి, 4, వి, 1; పొదుపుగా వేసిన ఓవర్‌ ఇది. థామస్‌ బౌలింగ్‌లో ముందుగా క్లాసెన్‌ (6), ఫోర్‌ కొట్టిన తర్వాత పవన్‌ నేగి (4) ఔటయ్యారు. 

లక్ష్యఛేదన...
తొలి ఓవర్‌: 0, 6, 4, 0, 0, 0; ఉమేశ్‌ 10 పరుగులిచ్చాడు. నాలుగు డాట్‌ బాల్స్‌ వేశాడు. లివింగ్‌స్టోన్‌తో కలిసి ఛేదన ప్రారంభించిన సంజూ సామ్సన్‌ సిక్స్, ఫోర్‌ కొట్టాడు. 
రెండో ఓవర్‌: 4, 6, 1, 1, 0, 0; సైనీ బౌలింగ్‌లో 12 పరుగులు చేసింది రాయల్స్‌. లివింగ్‌స్టోన్‌ ఫోర్, సిక్స్‌ కొట్టాడు. తర్వాత వైవిధ్యమైన బంతులతో కట్టడి చేశాడు సైనీ. 
మూడో ఓవర్‌: 6, 1, 1, 0, 6, 4; కుల్వంత్‌ 18 పరుగులు  సమర్పించుకున్నాడు. సామ్సన్‌ రెండు సిక్సర్లు, ఓ బౌండరీ సాధించాడు. 
నాలుగో ఓవర్‌: 1, వి; చహల్‌ రెండు బంతులే వేశాడు. సామ్సన్‌ను ఔట్‌ చేశాడు. ఈ దశలో మళ్లీ వర్షం రావడంతో మ్యాచ్‌ను రద్దు చేశారు. 

ఐపీఎల్‌ చరిత్రలో ‘హ్యాట్రిక్‌’ తీసిన 16వ బౌలర్‌ శ్రేయస్‌ గోపాల్‌. ఇప్పటివరకు లీగ్‌ చరిత్రలో మొత్తం 19 హ్యాట్రిక్‌లు నమోదయ్యాయి. అమిత్‌ మిశ్రా (ఢిల్లీ, డెక్కన్‌ చార్జర్స్, సన్‌రైజర్స్‌) మూడుసార్లు... యువరాజ్‌ సింగ్‌ (పంజాబ్‌) రెండుసార్లు ఈ ఘనత సాధించారు. లక్ష్మీపతి బాలాజీ (చెన్నై), ఎన్తిని (చెన్నై), రోహిత్‌ శర్మ (డెక్కన్‌ చార్జర్స్‌), ప్రవీణ్‌ కుమార్‌ (బెంగళూరు), అజీత్‌ చండేలా (రాజస్తాన్‌), సునీల్‌ నరైన్‌ (కోల్‌కతా), ప్రవీణ్‌ తాంబే (రాజస్తాన్‌), షేన్‌ వాట్సన్‌ (రాజస్తాన్‌), అక్షర్‌ పటేల్‌ (పంజాబ్‌), సామ్యూల్‌ బద్రీ (బెంగళూరు), ఆండ్రూ టై (గుజరాత్‌ లయన్స్‌), జైదేవ్‌ ఉనాద్కట్‌ (పుణే), స్యామ్‌ కరన్‌ (పంజాబ్‌), శ్రేయస్‌ గోపాల్‌ (రాజస్తాన్‌) ఒక్కోసారి హ్యాట్రిక్‌ నమోదు చేశారు. 


►ఐపీఎల్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో కోహ్లి, డివిలియర్స్‌లను మూడేసి సార్లు ఔట్‌ చేసిన తొలి బౌలర్‌గా  శ్రేయస్‌ గోపాల్‌ నిలిచాడు. 

►ఐపీఎల్‌ చరిత్రలో రద్దయిన మ్యాచ్‌ల సంఖ్య. ఇందులో నాలుగు బెంగళూరులోని చిన్నస్వామి  స్టేడియంలోనే కావడం గమనార్హం.    
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement