
ఆర్సీబీ కెప్టెన్ పాటిదార్- కేకేఆర్ సారథి రహానే (Photo Courtesy: BCCI)
మెగా క్రికెట్ సమరం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) పద్దెనిమిదవ సీజన్‌కు శనివారం తెరలేవనుంది. తారల సందడితో ఈడెన్ గార్డెన్స్‌లో క్యాష్ రిచ్ లీగ్ తాజా ఎడిషన్‌ను ఆరంభించేందుకు నిర్వాహకులు సిద్ధమయ్యారు.
డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)- ఇంత వరకు ఒక్కసారి కూడా ట్రోఫీ గెలవని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య పోరుతో ఈ క్రీడా సంబరం మొదలుకానుంది.
పొంచి ఉన్న వర్షం ముప్పు
అయితే, ఆరంభ వేడుకలతో పాటు మ్యాచ్‌కు వర్షం అడ్డుతగిలే అవకాశం ఉంది. ఆక్యూవెదర్ నివేదిక ప్రకారం కోల్‌కతాలో శనివారం భారీ వాన పడే అవకాశం ఉంది. ఉదయం 11 గంటల తర్వాత వర్షం ఎక్కువయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
దీంతో సాయంత్రం 6.20 నిమిషాల నుంచి 6.45 నిమిషాల వరకు జరగాల్సిన ప్రారంభోత్సవ వేడుకల ఏర్పాట్లు సజావుగా సాగడం కష్టమే. సాయంత్రం ఆరు గంటల తర్వాత వర్షం పడే అవకాశం 25 శాతం ఉందని ఆక్యూవెదర్ పేర్కొంది. టాస్ సమయానికి అంటే ఏడు గంటల సమయంలో పదిశాతం వర్ష సూచనలు ఉన్నట్లు తెలిపింది. ఇక రాత్రి పదకొండు గంటల తర్వాత ఇందుకు డెబ్బై శాతం ఆస్కారం ఉన్నట్లు వెల్లడించింది.
రెండు రోజులుగా వాన
ఈ నేపథ్యంలో కేకేఆర్- ఆర్సీబీ మధ్య ఐపీఎల్-2025 ఆరంభ మ్యాచ్ సాఫీగా సాగడం కష్టమే అనిపిస్తోంది. కోల్‌కతాలో గత రెండు రోజులుగా వర్షం కురుస్తూనే ఉంది. దీంతో కేకేఆర్- ఆర్సీబీ ప్రాక్టీస్ మ్యాచ్‌లకు అంతరాయం కలిగింది. మరోవైపు.. శుక్రవారం కూడా వాన పడగా.. ఈడెన్ గార్డెన్స్ గ్రౌండ్‌స్టాఫ్ కవర్లతో మైదానాన్ని కప్పి ఉంచారు.
అంతేకాదు.. ఎప్పటికప్పుడు మైదానం నుంచి నీటిని క్లియర్ చేసేందుకు డ్రైనేజీ సిస్టమ్ సిద్ధంగానే ఉంది. అయితే, ఎడతెరిపిలేని వర్షం పడితే మాత్రం మ్యాచ్ జరగడం సాధ్యం కాదు. మరి వర్షం వల్ల కేకేఆర్- ఆర్సీబీ మ్యాచ్ రద్దయితే పరిస్థితి ఏమిటి?
జరిగేది ఇదే..
ప్లే ఆఫ్స్, ఫైనల్ మాదిరి ఐపీఎల్ గ్రూప్ దశ మ్యాచ్‌లకు రిజర్వ్ డే ఉండదు. అయితే, వర్షం వల్ల మ్యాచ్ ఆలస్యమైతే.. మ్యాచ్ ముగియడానికి నిర్ణీత సమయం కంటే అరవై నిమిషాల అదనపు సమయం ఇస్తారు.
ఫలితం తేల్చేందుకు ఇరుజట్లు కనీసం ఐదు ఓవర్లపాటు బ్యాటింగ్ చేసే అవకాశం ఉంటుంది. ఈ ఐదు ఓవర్ల మ్యాచ్‌కు కటాఫ్ టైమ్ రాత్రి 10.56 నిమిషాలు. అర్ధరాత్రి 12.06 నిమిషాల వరకు మ్యాచ్‌ను ముగించేయాల్సి ఉంటుంది. ఒకవేళ వర్షం వల్ల మ్యాచ్ మరీ ఆలస్యమైతే ఓవర్ల సంఖ్యను తగ్గించే అవకాశం కూడా ఉంటుంది.
ఇంత చేసినా ఫలితం తేలకుండా.. మ్యాచ్ రద్దు చేయాల్సి వస్తే ఇరుజట్లకు చెరో పాయింట్ లభిస్తుంది. అయితే, టైటిల్ రేసులో నిలిచే క్రమంలో ఈ ఒక్క పాయింట్ కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.
అందుకే.. ఇటు కేకేఆర్.. అటు ఆర్సీబీ అభిమానులు మ్యాచ్ సజావుగా సాగాలని కోరుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2025 ఆరంభ వేడుకలో శ్రేయా ఘోషాల్, కరణ్ ఔజ్‌లా, దిశా పటాని తదితరులు ఆట, పాటలతో అలరించేందుకు సిద్ధమయ్యారు.
చదవండి: IPL 2025: కెప్టెన్ల మార్పు.. ఎవరి జీతం ఎంత?.. అతి చవగ్గా దొరికిన సారథి అతడే!
A little rain won’t stop us! 🌧
The ground’s got its cozy cover, and the drainage system will be ready to save the day 𝘒𝘺𝘶𝘯𝘬𝘪 𝘠𝘦𝘩 𝘐𝘗𝘓 𝘩𝘢𝘪, 𝘺𝘢𝘩𝘢𝘯 𝘴𝘢𝘣 𝘱𝘰𝘴𝘴𝘪𝘣𝘭𝘦 𝘩𝘢𝘪!#IPLonJioStar 👉 SEASON OPENER #KKRvRCB | SAT, 22nd March, 5:30 PM | LIVE on… pic.twitter.com/UwdonS9FeN— Star Sports (@StarSportsIndia) March 21, 2025
Comments
Please login to add a commentAdd a comment