
నవతరం స్పిన్నర్ల తీరును భారత స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ (Harbhajan Singh) విమర్శించాడు. ముఖ్యంగా టీ20 ఫార్మాట్లో చాలా మంది స్పిన్నర్లు తమ సహజత్వానికి భిన్నంగా బౌలింగ్ చేస్తున్నారన్నాడు. బంతిని స్పిన్ చేసేందుకు బదులు.. డిఫెన్సివ్‌గా ఆడేందుకే ఎక్కువగా మొగ్గుచూపుతున్నారని విమర్శలు గుప్పించాడు.
కాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)- 2025 సీజన్ శనివారం ఆరంభం కానున్న విషయం తెలిసిందే. ప్రఖ్యాత ఈడెన్ గార్డెన్స్ మైదానంలో కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్‌తో క్యాష్ రిచ్ లీగ్ తాజా సీజన్‌కు తెరలేవనుంది. ఇదిలా ఉంటే.. ఐపీఎల్‌లో గత పదిహేడు ఎడిషన్లలో స్పిన్నర్లు కేవలం మూడుసార్లు మాత్రమే పర్పుల్ క్యాప్ గెలుచుకున్నారు.
ఇమ్రాన్ తాహిర్, ప్రజ్ఞాన్ ఓజా తర్వాత.. 2022లో అత్యధిక వికెట్ల వీరుడిగా టీమిండియా లెగ్‌బ్రేక్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ ఈ ఘనత సాధించాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఫాస్ట్ బౌలర్ల మాదిరి బౌలింగ్ దేనికి? ఆ మాత్రం ధైర్యం లేదా?
‘‘టీ20లలో.. మరీ ముఖ్యంగా ఐపీఎల్‌లో చాలా మంది స్పిన్నర్లు ఫాస్ట్ బౌలర్ల మాదిరి బౌలింగ్ చేస్తున్నారు. బంతిని స్పిన్ చేసేందుకు ఏమాత్రం ప్రయత్నించడం లేదు. అసలు బ్యాటర్లపై అటాకింగ్ చేయడమే లేదు. వికెట్లు తీయాలనే తాపత్రయం వారిలో కరువైంది.
వికెట్లు తీసే విషయంలో స్పిన్నర్లు కాస్త ధైర్యం చూపించాలి. ప్రతిసారీ ఆత్మరక్షణ ధోరణితో ఉండటం సరికాదు’’ అని భజ్జీ స్పిన్నర్ల తీరును విమర్శించాడు. ఇండియా టుడేతో ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.
కాగా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి.. తన బౌలింగ్ శైలి ఫాస్ట్ బౌలర్ల మాదిరి ఉంటుంది కాబట్టి తాను కేవలం వన్డే, టీ20లు ఆడతానని.. టెస్టులకు సరిపడనని ఇటీవలే పేర్కొన్న విషయం తెలిసిందే.
ఇక ఐపీఎల్-2025 సీజన్‌లో బంతిపై సెలైవా (లాలాజలం) ఉపయోగించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అనుమతించిన విషయం తెలిసిందే.
ఐపీఎల్-2025 కెప్టెన్ల సమావేశం తర్వాత.. వారి అంగీకారంతో ఈ మేరకు సెలైవా ఉపయోగంపై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు బోర్డు ప్రకటించింది. అయితే, అంతర్జాతీయ క్రికెట్‌లో మాత్రం ఐసీసీ నిబంధనలకు కట్టుబడి ఉంటామని స్పష్టం చేసింది.
స్వాగతించదగ్గ విషయం
ఈ నేపథ్యంలో హర్భజన్ సింగ్ స్పందిస్తూ.. ‘‘బౌలర్లు సెలైవా ఉపయోగించేందుకు అనుమతి లభించడం స్వాగతించదగ్గ విషయం. అంతర్జాతీయ క్రికెట్‌లోనూ ఇదే మాదిరి లాలాజలంతో బంతిని నునుపు చేసేందుకు అనుమతి వస్తే.. పేసర్లు బంతిని మరింత స్వింగ్ చేయగలుగుతారు. స్పిన్నర్లకు కూడా ప్రయోజనకరంగానే ఉంటుంది’’ అని అభిప్రాయపడ్డాడు.
కాగా కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో అప్పట్లో లాలాజలంతో బంతిని రుద్దకుండా ఐసీసీ నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. హర్భజన్ సింగ్ టీమిండియా తరఫున టెస్టుల్లో 417, వన్డేల్లో 269, టీ20లలో 25 వికెట్లు తీశాడు. ఐపీఎల్‌లో 163 మ్యాచ్‌లు ఆడిన ఈ ఆఫ్ స్పిన్నర్ 150 వికెట్లు కూల్చాడు.
చదవండి: నమ్మశక్యం కాని ఇన్నింగ్స్.. అతడి బ్యాటింగ్ అద్భుతం: కివీస్ కెప్టెన్
Comments
Please login to add a commentAdd a comment