
సునిల్ నరైన్ (Photo Courtesy: BCCI)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)-2025లో డిఫెండింగ్ చాంపియన్‌గా కోల్‌కతా నైట్ రైడర్స్ బరిలోకి దిగనుంది. తాజా సీజన్‌లో తొలి మ్యాచ్‌లో భాగంగా సొంతమైదానం ఈడెన్ గార్డెన్స్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో శనివారం తలపడనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా.. కోల్‌కతా స్టార్ సునిల్ నరైన్ (Sunil Narine) గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఐపీఎల్-2025 ఆరంభ మ్యాచ్‌లో అందరి కళ్లు నరైన్‌పైనే ఉన్నాయని.. ఈసారి కూడా గతేడాది మాదిరి అతడు రాణిస్తే కేకేఆర్‌కు తిరుగు ఉండదని పేర్కొన్నాడు. బ్యాట్‌తో, బంతితో రాణించగల ఈ వెస్టిండీస్ ఆటగాడు మరోసారి కోల్‌కతాకు కీలకం కాబోతున్నాడని ఆకాశ్ చోప్రా (Aakash Chopra) పేర్కొన్నాడు.
పవర్ ప్లేలో ధనాధన్ ఇన్నింగ్స్‌తో
కాగా గతేడాది కేకేఆర్ చాంపియన్‌గా నిలవడంలో సునిల్ నరైన్‌ది కీలక పాత్ర. ఈ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ ఓపెనర్‌గా బరిలోకి దిగి పరుగుల సునామీ సృష్టించాడు. పవర్ ప్లేలో ధనాధన్ ఇన్నింగ్స్‌తో దంచికొట్టి కేకేఆర్ విజయాలకు బాట వేశాడు.
గత సీజన్‌లో పద్నాలుగు ఇన్నింగ్స్‌లో మొత్తంగా 488 పరుగులు సాధించాడు ఈ ఎడమచేతి వాటం బ్యాటర్. 180.74 స్ట్రైక్‌రేటుతో పరుగులు రాబట్టి కేకేఆర్ తరఫున టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు.
ఈ నేపథ్యంలో కామెంటేటర్ ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. ‘‘ఓపెనర్ సునిల్ నరైన్. నాలుగు ఓవర్లపాటు పూర్తి స్థాయిలో బౌలింగ్ చేయగలడు కూడా! అయితే, ఈసారి బ్యాట్‌తో ఎలా విజృంభిస్తాడన్నది ఆసక్తికరం.
అతడిని ఆపటం ఎవరితరం కాలేదు
గతేడాది కేకేఆర్ విజయాలను నిర్దేశించింది అతడే! అతడి అద్భుత ప్రదర్శన కారణంగా కేకేఆర్ రాత మారిపోయింది. నరైన్ బ్యాట్ నుంచి సెంచరీ కూడా జాలువారింది. ముఖ్యంగా పవర్‌ప్లేలో నిలకడైన బ్యాటింగ్‌తో పరుగులు రాబట్టిన తీరు అద్బుతం.
టీ20 క్రికెట్‌కు ఏం కావాలో నరైన్ అది చేసి చూపించాడు. పరుగులు రాబట్టుకుంటూ పోయాడు. అతడిని ఆపటం ఎవరితరం కాలేదు. బౌలర్లు ఎన్ని వ్యూహాలు మార్చినా నరైన్‌ను కట్టడి చేయలేకపోయారు. సునిల్ నరైన్ ఈసారి కూడా అలాగే రాణిస్తే కేకేఆర్‌కు తిరుగు ఉండదు’’ అని పేర్కొన్నాడు.
ఆర్సీబీ స్పిన్నర్లే కీలకం
ఇక తొలి మ్యాచ్‌లో కేకేఆర్- ఆర్సీబీ తలపడనున్న నేపథ్యంలో.. ‘‘ఆర్సీబీ స్పిన్నర్లు ఎలా బౌలింగ్ చేస్తారన్న అంశం మీదే మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంటుంది. కృనాల్ పాండ్యా, సూయశ్ శర్మలతో పాటు లియామ్ లివింగ్‌స్టోన్, జేకబ్ బెతెల్ ప్రదర్శనే ఆర్సీబీకి కీలకం కానుంది.
ఇక కేకేఆర్‌కు ఈసారి మిచెల్ స్టార్క్ లేడు. అతడి స్థానంలో స్పెన్సర్ జాన్సన్ లేదంటే అన్రిచ్ నోర్జే ఆడతారు. బ్యాటర్ల విషయానికొస్తే ఫిల్ సాల్ట్, శ్రేయస్ అయ్యర్‌లను కేకేఆర్ కోల్పోయింది.
నరైన్.. క్వింటన్ డికాక్ లేదంటే రహ్మనుల్లా గుర్బాజ్‌తో కలిసి ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. టాపార్డర్ రాణిస్తేనే కోల్‌కతాకు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి’’ అని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.
చదవండి: నమ్మశక్యం కాని ఇన్నింగ్స్.. అతడి బ్యాటింగ్ అద్భుతం: కివీస్ కెప్టెన్
Comments
Please login to add a commentAdd a comment