యువ క్రికెటర్ నితీష్‌కుమార్‌రెడ్డితో జిల్లాకు అనుబంధం
అతని తల్లి స్వగ్రామం జిల్లాలోని చెరువుకొమ్ముపాలెం
ఒంగోలులోను రంజీ మ్యాచ్‌లు ఆడిన నితీష్‌రెడ్డి
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టెస్ట్ మ్యాచ్‌లో అద్భుత సెంచరీతో మెరిసిన యువతేజం
ఒంగోలు: కాకి నితీష్‌కుమార్‌రెడ్డి.. నేడు ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ప్రేమికుల్లో ఎనలేని క్రేజ్ నింపేశాడు. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టెస్ట్ మ్యాచ్‌లో అతను ఆడిన అద్భుత ఇన్నింగ్స్ భారత క్రికెట్ ప్రేమికులకు చిరకాలం గుర్తుండిపోతుంది. ఈ యువ ఆటగాడి స్వస్థలం విశాఖ అయినా అతని తల్లి స్వగ్రామం ప్రకాశం జిల్లా ఒంగోలు (Ongole) నగర శివారులోని చెరువుకొమ్ముపాలెం కావడంతో అతనికి జిల్లాతో ఎంతో అనుబంధం ఉంది.
చిన్నతనం నుంచి క్రికెట్ అంటేనే క్రేజ్:
అందరు చదువుతూ ఆడతామంటారు. కానీ నితీష్‌కుమార్‌రెడ్డి (Nitish Kumar Reddy) మాత్రం ఆడుతూ చదువుకుందామంటారు. చిన్నతనం నుంచి క్రికెట్ (Cricket) అంటే ఎంతో మక్కువ ఉన్న నితీష్ కఠోర సాధనతో రైట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్‌గానే కాకుండా మీడియం పేసర్‌గా కూడా రాణిస్తూ నేడు అంతర్జాతీయ క్రికెట్‌కు మరో అద్భుత వరంగా మారాడు.
ఒంగోలుతో అనుబంధం ఇలా..
చెరువుకొమ్ముపాలేనికి చెందిన పూసపాటి నరశింహారెడ్డి, సుశీలకు ఇద్దరు సంతానం. ఒకరు మానస (నితీష్ రెడ్డి తల్లి). మరొకరు సురేంద్రరెడ్డి (ప్రస్తుతం ఆస్ట్రేలియాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం). మానస, ముత్యాలరెడ్డిలకు ఇద్దరు సంతానం. పెద్ద కుమార్తె తేజస్వి ఆస్ట్రేలియాలో మెడిసిన్ చేస్తున్నారు. ఇక రెండో సంతానమే నితీష్‌రెడ్డి. ఒక వైపు విద్యను అభ్యసిస్తూనే మరో వైపు క్రికెట్‌లో దూసుకెళుతున్నాడు. ఐదో ఏటనే ప్లాస్టిక్ బ్యాట్‌తో క్రికెట్ ఆటలో అరంగేట్రం చేసిన నితీష్‌రెడ్డి అంచెలంచెలుగా ఎదిగి నేడు అంతర్జాతీయ స్థాయికి చేరుకున్నాడు.
2017–18లో విజయ్ మర్చంట్ ట్రోఫీలో నాగాలాండ్ జట్టుపై 441 బంతుల్లో 345 పరుగులు చేసి క్రికెట్ అభిమానుల మనస్సును దోచుకున్నాడు. దీంతో ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున అవకాశాన్ని కై వసం చేసుకున్నాడు. పంజాబ్‌పై అద్భుతంగా 64 పరుగులు (ఒకే ఒక్క పరుగుతో గెలుపు), రాజస్థాన్‌పై 76 పరుగులు చేసి సన్‌రైజర్స్ జట్టు గెలుపులో తనదైన ముద్ర వేసుకున్నాడు. ఒంగోలులోని శర్మా కాలేజీ గ్రౌండులో సైతం 2018, 2019లో రంజీ మ్యాచ్‌లు ఆడాడు. ఇటీవల అమ్మమ్మ సుశీల పరమపదించడంతో అంత్యక్రియల్లో పాల్గొనేందుకు నితీష్‌రెడ్డి చెరువుకొమ్ముపాలేనికి వచ్చారని గ్రామస్తులు తెలిపారు.
సంతోషంగా ఉంది
నితీష్‌రెడ్డికి చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటేనే ప్రేమ. అనేక మార్లు గ్రామానికి తల్లితో పాటు వచ్చి వెళుతుండేవాడు. విద్యాభ్యాసం ఇక్కడ చేయకున్నా ఇక్కడ ఉన్న కుర్రాళ్లతో మాత్రం పరిచయాలు మెండుగానే ఉన్నాయి. ఇన్నాళ్లకు అంతర్జాతీయంగా క్రికెట్‌లో రాణించాడని తెలియడంతో గ్రామంలో చాలామంది నా మనవడి గురించి గొప్పగా మాట్లాడుతుంటే చెందే అనుభూతిని వర్ణించలేం. ఇంకా ఉన్నత స్థాయికి చేరాలనేదే మా ఆకాంక్ష.
– పూసపాటి నరశింహారెడ్డి, నితీష్‌రెడ్డి తాతయ్య
స్నేహితుడిగా ఆనందంగా ఉంది
నాది చెరువుకొమ్ముపాలెమే. నితీష్‌రెడ్డి మేనమామ సురేంద్రరెడ్డి నాకు క్లాస్‌మేట్. దీంతో అమ్మమ్మ గారింటికి వచ్చినపుడల్లా నాకు నితీష్‌రెడ్డితో పరిచయం ఉండేది. మాతో ఎక్కువగా క్రికెట్ ప్రాక్టీస్ గురించే మాట్లాడేవాడు. ఒంగోలులో రంజీ మ్యాచ్‌లు ఆడేందుకు వచ్చిన సమయంలోను నాతో మాట్లాడాడు. స్నేహితులను గుర్తుపెట్టుకుని పలకరిస్తాడు. చాలామంది యువ క్రికెటర్లలో ఎనలేని క్రేజ్‌ను నితీష్ రెడ్డి సంపాదించుకోవడం ఆనందంగా ఉంది. వచ్చే ఏడాది జూన్‌లో మళ్లీ చెరువుకొమ్ముపాలేనికి నితీష్‌రెడ్డి వస్తారని సమాచారం. ఆ రోజు గ్రామంలో ఘనంగా సత్కారం చేయాలని భావిస్తున్నాం.
– ఆల నారాయణ, నితీష్‌రెడ్డి చిన్ననాటి స్నేహితుడు
Comments
Please login to add a commentAdd a comment