శతకాల వీరుడికి... సువర్ణావకాశం | - | Sakshi
Sakshi News home page

శతకాల వీరుడికి... సువర్ణావకాశం

Published Wed, Aug 21 2024 7:46 AM | Last Updated on Wed, Aug 21 2024 12:56 PM

-

ఆలిండియా అంతర్‌రాష్ట్ర అండర్‌–19 క్రికెట్‌ టోర్నీకి సుశాంత్‌ ఎంపిక 

 బీసీసీఐ ఆధ్వర్యంలో గుజరాత్‌ వేదికగా జరగనున్న మెగా టోర్నీ 

 15 మంది సభ్యులతో కూడిన ఆంధ్రా జట్టుకు నంబళ్ల సుశాంత్‌ ఎంపిక 

శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాకు చెందిన స్టార్‌ క్రికెటర్‌ నంబళ్ల సుశాంత్‌ ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌కు ఎంపికయ్యాడు. గత రెండు నెలలగా జరిగిన ఏసీఏ అంతర్‌జోనల్‌ క్రికెట్‌ టోర్నీల్లో భీకర ఫామ్‌ను కొన సాగిస్తూ సెంచరీల మోత మోగించిన సుశాంత్‌ బీసీసీఐ నిర్వహిస్తున్న అంతర్‌రాష్ట్ర క్రికెట్‌ టోర్నమెంట్‌లో పాల్గొనే ఏసీఏ ఆంధ్రా అండర్‌–19 పురుషుల జట్టుకు ఎంపికయ్యాడు. ఈ మేరకు ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ ప్రకటించిన 15 మంది సభ్యులతో కూడిన ఆంధ్రా జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఓపెనర్‌గానే సుశాంత్‌కు ఛాన్స్‌ లభించింది.

బీసీసీఐ ఆధ్వర్యంలో మెగా టోర్నీ..
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ వేదికగా బీసీసీఐ ఆధ్వర్యంలో రిలయన్స్‌ సంస్థ సహకారంతో ఈనెల 24 నుంచి ఆలిండియా అంతర్‌రాష్ట్ర అండర్‌–19 పురుషుల ఇన్విటేషన్‌ లీగ్‌ అండ్‌ నాకౌట్‌ టెస్ట్‌(త్రీడేస్‌ మ్యాచ్‌ల) టోర్నమెంట్‌ 2024–25 జరగనుంది. యువ టాలెంట్‌ను వెతికేందుకు బీసీసీఐ మెగా టోర్నీని నిర్వహిస్తుంది. ఈ మూడో సీజన్‌ మెగా టోర్నీలో ఆంధ్రప్రదేశ్‌తోపాటు బరోడా, బెంగాల్‌, గోవా, గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌, కేరళ, మద్యప్రదేశ్‌, ముంబాయ్‌, పంజా బ్‌, సౌరాష్ట్ర రాష్ట్రాల జట్ల ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ఈనెల 24 నుంచి ఈ పోటీలు మొదలుకానున్నాయి. ఈ టోర్నీలో పాల్గొనే ఆంధ్రా జట్టుకు శ్రీకాకుళం నుంచి ఒకే ఒక్కడు నంబళ్ల సుశాంత్‌ ఎంపికయ్యాడు.

అత్యద్భుతమైన ఆటతీరుతో రాణింపు..
గత కొన్నేళ్ల నుంచి అటు బ్యాటింగ్‌, ఇటు బౌలింగ్‌లో సుశాంత్‌ అద్భుతంగా రాణిస్తున్నాడు. ముఖ్యంగా ఈ సీజన్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. వైఎస్సార్‌ కడప జిల్లాలో కేఓఆర్‌ఎం కాలేజ్‌ క్రికెట్‌ మైదానంలో జరుగుతున్న ఏసీఏ అంతర్‌జోనల్‌ పురుషుల అండర్‌–19 త్రీడేస్‌(టెస్ట్‌) మ్యాచ్‌ల టోర్నీలో శ్రీకాకుళం జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న నంబళ్ల సుశాంత్‌ టాప్‌ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ఇటీవలి ముగిసిన పరిమిత ఓవర్ల వన్డే టోర్నీలో 5 మ్యాచ్‌ల్లో 341 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా త్రీడేస్‌ టోర్నీలోనూ సెంచరీల మోత మో గిస్తున్నాడు. అటు ఏసీఏ ఆంధ్రా అండర్‌–19జట్టుతోపాటు ఇటు ఆంధ్రా రంజీ జట్టుకు ఎంపికయ్యేందుకు బలమైన బాటలు వేసుకుంటున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటికే ఐదు సెంచరీలతో కదంతొక్కాడు. ఆఫ్‌స్పిన్‌ బౌలింగ్‌లోనూ అదరగొడుతున్నాడు.

తండ్రి ప్రోత్సాహంతో..

సుశాంత్‌ స్వస్థలం జిల్లాలోని టెక్కలి పట్టణంలోని వెంకటేశ్వర కాలనీ. ప్రస్తుతం శ్రీకాకుళంలోనే నివాసం ఉంటున్నారు. ఎచ్చెర్లలోని శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. తండ్రి నంబళ్ల జగదీష్‌ శ్రీకాకుళంలోని రిమ్స్‌ ఆస్పత్రిలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తుండగా, తల్లి అర్చన గృహిణి. తండ్రి దగ్గరుండి నిరంతరం ప్రోత్సహిస్తుండటంతో సుశాంత్‌ అదరగొట్టేలా ప్రతిభను చూపిస్తున్నాడు.

క్రికెట్‌ సంఘం అభినందన..

ప్రతిష్టాత్మక ఆలిండియా అంతర్‌రాష్ట్ర మెగా క్రికెట్‌ టోర్నీకి నంబళ్ల సుశాంత్‌ ఎంపికపై క్రికెట్‌ సంఘ జిల్లా అధ్యక్షుడు పీఎల్‌ఎన్‌ శాస్త్రి, కార్యదర్శి హసన్‌రాజ షేక్‌, మెంటార్‌ ఇలియాస్‌ మహ్మద్‌, కోశాధికారి మదీనా శైలానీ, డాక్టర్‌ రవికుమార్‌ తదితరులు అభినందించారు. యువ క్రీడాకారుడి రాణింపుపై తల్లిదండ్రులు, జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు, కోచ్‌లు సంతోషం వ్యక్తం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement