గుంటూరు: విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోపాటు కేసు దర్యాప్తులో సరైన ఆధారాలను సేకరించడంలో విఫలమైన నెల్లూరు జిల్లా పొదలకూరు సీఐ హైమారావును గుంటూరు రేంజ్ ఐజీ పి.వి.సునీల్‌కుమార్ సస్పెండ్ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. 2012లో పొదలకూరు మండలం తాడిపర్తి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న నీలకుల రమేష్ పదేళ్లలోపు విద్యార్థినులపై అసభ్యంగా ప్రవర్తించడంతోపాటు, లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై విద్యార్థినుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
పోక్సో చట్టంలోని సెక్షన్ 164-ఏ సీఆర్పీసీ ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలి. 24 గంటల్లోగా బాధిత విద్యార్థినులను వైద్యశాలకు తరలించి వైద్య పరీక్షలు చేయించడంతోపాటు వారి స్టేట్‌మెంట్లను సీఐ నమోదు చేయాల్సి ఉంది. పోక్సో చట్టం ప్రకారం దర్యాప్తు కొనసాగించాల్సిన సీఐ పూర్తిగా విఫలమయ్యూరు. దీంతో కోర్టులో కేసు విచారణలో సరైన ఆధారాలు చూపించలేకపోయూరు.
అందుకు బాధ్యుడైన సీఐకు నెల్లూరు జిల్లా ఎస్పీ సింథల్‌కుమార్ ఈ ఏడాది సెప్టెంబర్ 16న వివరణ కోరుతూ మెమో జారీచేశారు. ఎస్పీ కోరిన వివరాలు ఇవ్వడంలోనూ సీఐ విఫలమవ్వడంతో ప్రత్యేక నివేదికలు రూపొందించి ఐజీకి పంపారు. గతంలో కూడా పలు కేసుల విచారణలో సీఐ విఫలమయ్యూరనీ ఎస్పీ అందజేసిన నివేదిక ఆధారంగా సీఐ హైమారావును సస్పెండ్ చేసి వెంటనే విధుల నుంచి తొలగించాలని ఐజీ ఆదేశాలు జారీ చేశారు.
పొదలకూరు సీఐ సస్పెన్షన్
Published Fri, Nov 21 2014 2:07 AM | Last Updated on Sat, Oct 20 2018 6:04 PM
Advertisement