నిర్లక్ష్యం వద్దు.. పనితీరు మార్చుకోండి
- రెవెన్యూ అధికారులపై కలెక్టర్ నిర్మల ఆగ్రహం
సాక్షి, సిటీబ్యూరో: విధి నిర్వహణలో నిర్లక్ష్యం తగదని, పనితీరు మెరుగుపడకపోతే ఉపేక్షించేది లేదని తహశీల్దార్లు, రెవెన్యూ అధికారులను కలెక్టర్ నిర్మల హెచ్చరించారు. ఇకపై రెండు నెలలకోసారి జిల్లా రెవెన్యూ అధికారులతో సమావేశాన్ని నిర్వహించటంతోపాటు పనితీరు, ప్రగతి నివేదికను బట్టి గ్రేడులిస్తామని ఆమె పేర్కొన్నారు.
ప్రభుత్వం నిర్థేశించిన లక్ష్యాల అమలులో భాగంగా శనివారం కలెక్టరేట్ సమావేశమందిరంలో పదిహేను ప్రాధాన్యతాంశాలను కలెక్టర్ నిర్మల సమీక్షించారు. హైదరాబాద్, సికింద్రాబాద్ రెవెన్యూ డివిజన్‌ల పరిధిలోని రెవెన్యూ అధికారులు, ఆర్డీఓలు, తహశీల్దార్లతో విడివిడిగా సమావేశాన్ని నిర్వహించారు. మండలాల వారిగా తహశీల్దార్లతో పెండింగ్ సమస్యలపై ముఖాముఖి చర్చించారు.
భూ వివాదాలకు సంబంధించి కోర్టు కేసులు, కంటెమ్డ్ కేసులపై అవగాహన లేకపోవటం, సీఎంఓ నుంచి వచ్చిన పిటీషన్లపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఆసిఫ్‌నగర్, బహదూర్‌పుర, సికింద్రాబాద్ మండలాలతోపాటు మరికొందరు తహశీల్దార్లపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. జీవో 58, 59 కింద పట్టాల పంపిణీ, ఆసరా పింఛన్లు, ప్రభుత్వ భూములు, కోర్టు కేసులు, ఎన్‌ఓసీ, సీఎంఓ పిటీషన్లు, ధృవీకరణ పత్రాల జారీ, ఆపద్బంధు, సీఎం సహాయ నిధి, జాతీయ కుటుంబ ప్రయోజన పథకంతోపాటు రెవెన్యూశాఖ నుంచి ప్రజలకు అందిస్తున్న సేవలపై సమావేశంలో మండలాల వారిగా కలెక్టర్ సమీక్షించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం తగదని, బయోమెట్రిక్ విధానాన్ని అందరూ పాటించాల్సిందేనని తెలిపారు.
జీవో 59 కింద వచ్చిన దరఖాస్తులకు సంబంధించిన భూములను ఆర్డీఓలు క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించాలన్నారు. జీవో 58 నుంచి 59కి మార్పిడి చేసిన దరఖాస్తుదారులు మొదటి వాయిదా డబ్బులు ఆగస్టు 10 లోగా, రెండవ వాయిదా డబ్బులు ఆగస్టు 31లోగా చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. జీవో 59 కింద దరఖాస్తు చేసుకున్నవారు రెండ వాయిదా సొమ్మును ఆగస్టు 31 వరకు చెల్లించాలన్నారు.
ఆసరా లబ్ధిదారులకు బ్యాంకు ఖాతాలు..
ఆసరా పింఛన్లు పొందుతున్న లబ్ధిదారుల ఆధార్ నెంబర్లు, బ్యాంకు ఖాతాల వివరాలు త్వరితగతిన సేకరించాలని తహశీల్దార్లను కలెక్టర్ నిర్మల ఆదేశించారు. ఎనిమిది మండలాలల్లో బ్యాంకు ఖాతాల సేకరణ వెనుకబడి ఉండటంపై ఆగ్రహం వెలిబుచ్చారు. ఈ ప్రక్రియను వెంటనే పూర్తిచేయాలని కోరారు.
భూ సమస్యపై..
షేక్‌పేట మండలంలోని ప్రభుత్వ భూములపై అత్యధికంగా కోర్టు కేసులు ఉన్నాయని, వీటిన్నంటినిపై ఆర్డీఓ, లా ఆఫీసర్, తహశీల్దార్ కలిసి కౌంటర్లు తయారు చేయాలన్నారు. ప్రభుత్వ భూములను తహశీల్దార్లు ప్రతినెల తనిఖీలు చేసి నివేదిక ఇవ్వాలన్నారు. భూముల పరిరక్షణకు కలెక్టర్ స్థాయిలో తీసుకోవాల్సిన చర్యలుంటే వెంటనే తగిన ప్రతిపాదనలు చేయాలన్నారు. సమావేశంలో జేసీ కె.సురేంద్రమోహన్, ఏజేసీ కె.రాజేందర్, డీఆర్‌ఓ అశోక్‌కుమార్, ఆర్డీఓలు నిఖిల, రఘురాంశర్మ, అధికారులు గోపాల్‌రావు, సంగీత, డిప్యూటీ కలెక్టర్లు పాల్గొన్నారు.