తహసీల్దార్లపై బదిలీ వేటు
అవినీతి ఆరోపణలే కారణమా..?
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : జిల్లాలో నలుగురు తహసీల్దార్లపై బదిలీ వేటు పడింది. ప్రధాన మండలాలైన ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్‌తో పాటు జైనథ్ మండల తహసీల్దార్లను బదిలీ చేస్తూ కలెక్టర్ ఎం.జగన్మోహన్, జాయింట్ కలెక్టర్ సుందర్ అబ్నార్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నలుగురు తహసీల్దార్లను లూప్‌లైన్ పోస్టులకు బదిలీ చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆదిలాబాద్ తహసీల్దార్‌గా పనిచేసిన సుభాష్‌చందర్, జైనథ్ తహసీల్దార్ సంజయ్‌కుమార్‌ను కలెక్టరేట్‌లో రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మంచిర్యాల తహసీల్దార్‌గా ఉన్న కాసబోయిన సురేష్‌కు కోనేరు రంగారావు కమిటీ సిఫార్సుల విభాగం ఆసిఫాబాద్‌కు బదిలీ అయింది. అలాగే నిర్మల్ తహసీల్దార్ నారాయణను ఖాళీగా ఉన్న లక్ష్మణచాంద తహసీల్దార్‌గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
వీరి స్థానంలో ఆదిలాబాద్ తహసీల్దార్‌గా ఇక్కడి ఆర్డీవో కార్యాలయంలో ఏవోగా పనిచేస్తున్న వర్ణను నియమించారు. అలాగే నిర్మల్ తహసీల్దార్‌గా అక్కడి ఆర్డీవో కార్యాలయంలోని ఏవో శ్రీహరికి పోస్టింగ్ ఇచ్చారు. చెన్నూరు తహసీల్దార్‌గా పనిచేస్తున్న దిలీప్‌కుమార్‌ను మంచిర్యాల తహసీల్దార్‌గా ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. తాంసి తహసీల్దార్ రాంరెడ్డికి జైనథ్ తహసీల్దార్‌గా ఇన్‌చార్జి బాధ్యతలు ఇచ్చారు. సిర్పూర్-యు తహసీల్దార్ ఇమ్రాన్ ఖాన్ సెలవుపై వెళ్లడంతో ఉట్నూర్ తహసీల్దార్ రాథోడ్ రమేష్‌కు బాధ్యతలు అప్పగించారు. వీరందరికీ ఎఫ్‌ఏసీగా బాధ్యతలు ఇచ్చారు.
ఆరోపణలే కారణమా?
ఈ బదిలీల వెనుక పలు ఆరోపణలే ప్రధాన కారణమనే అభిప్రాయం వ్యక్తవుతోంది. కానీ.. రెవెన్యూ ఉన్నతాధికారులు మాత్రం పరిపాలన సౌలభ్యం కోసమే బదిలీ చేశామని చెప్పుకొస్తున్నారు. జిల్లాలో పలుచోట్ల రూ.కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూములను కబ్జా కోరల్లోకి వెళ్లిపోతున్నాయి. అధికారుల కళ్లముందే అన్యాక్రాంతమవుతున్నా.. కళ్లు మూసుకుని పరోక్షంగా కబ్జాదారులకు సహకరించారనే ఆరోపణలు కొందరు తహశీల్దార్లు ఎదుర్కొంటున్నారు. ఈ వ్యవహారాల్లో రూ.కోట్లు వెనకేసుకున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. స్థానిక ప్రజాప్రతినిధులతో చేతులు కలిపి పెద్దఎత్తున అక్రమాలకు పాల్పడ్డారనే విమర్శలు వ్యక్తమయ్యాయి. చాలాచోట్ల రూ.కోట్లు విలువ చేసే ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతమవడమే ఇందుకు నిదర్శనం.. ఈ నేపథ్యంలో తహసీల్దార్ల ఆకస్మిక బదిలీలు రెవెన్యూ వర్గాలతో పాటు, సంబంధిత వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.