మండలపరిధిలోని దామవరం, సున్నపుబట్టి, దగదర్తి, వెలుపోడు గ్రామాల సమీపంలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ ఏర్పాటు చేసేందుకు రెవెన్యూ అధికారులు ప్రతిపాదించిన భూములను మంగళవారం జిల్లా కలెక్టర్ జానకి పరిశీలించారు.
దగదర్తి: మండలపరిధిలోని దామవరం, సున్నపుబట్టి, దగదర్తి, వెలుపోడు గ్రామాల సమీపంలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ ఏర్పాటు చేసేందుకు రెవెన్యూ అధికారులు ప్రతిపాదించిన భూములను మంగళవారం జిల్లా కలెక్టర్ జానకి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో విమానాశ్రయం అవసరమని, అందుకోసమే సంబంధిత భూములను పరిశీలించామన్నారు. ఇప్పటికే జిల్లాలో కృష్ణపట్నం పోర్టు, భారీగా పరిశ్రమలు ఉన్నాయన్నారు. విదేశాల నుంచి అనేకమంది పారిశ్రామికవేత్తలు జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు వస్తున్నందున వారికి అవసరమైన భూములను కూడా పరిశీలిస్తున్నామన్నారు.
త్వరలో విజయవాడ నుంచి అధికారులు విమానాశ్రయ భూములు పరిశీలించేందుకు జిల్లాకు వస్తున్నట్లు పేర్కొన్నారు. తొలుత కలెక్టర్ దగదర్తి నుంచి వెలుపోడు, సున్నపుబట్టి, దామవరంలలో పర్యటించి మ్యాప్ ఆధారంగా సంబంధిత భూములను పరిశీలించారు. పట్టాభూమి 362.99 ఎకరాలు, ఢిఫారం భూమి 414.71, అటవీభూమి 446.09, ప్రభుత్వ భూమి 534.55, సీజెఎఫ్‌ఎస్ 479.37, చెరువు 24.26, కొండలు 224.87 ఎకరాలను ఎయిర్‌పోర్టు కోసం ప్రతిపాదించినట్లు కలెక్టర్ దృష్టికి రెవెన్యూ అధికారులు తీసుకెళ్లారు. ఈ విషయమై మ్యాప్‌లో సూచించిన 2,486.84 ఎకరాలకు సంబంధించిన మ్యాప్‌ను మరొకమారు సరిచేయాలని రెవెన్యూ సిబ్బందికి సూచించారు.
చిగురిస్తున్న ఆశలు : అయితే గతంలో ఎన్నోసార్లు ఏయిర్‌పోర్టు అథారిటీ అధికారులు, జిల్లా అధికారులు సంబంధిత భూములను పరిశీలించి ఏయిర్‌ఫోర్ట్ నిర్మాణానికి భూములు అనుకూలంగా ఉన్నాయని పేర్కొన్నారు. అయినా ఎయిర్‌పోర్టు నిర్మాణం ముందుకుసాగడం లేదు. అయితే మంగళవారం జిల్లా కలెక్టర్ సంబంధిత భూములను పరిశీలించడంతో జిల్లావాసుల్లో ఆశలు చిగురించాయి. పరిశీలనలో కలెక్టర్‌తో పాటుగా కావలి ఆర్డీఓ నరసిం హం, తహశీల్దార్ కె లీల, సర్వేయర్ రాము, ఎస్సై వెంకటరావులు ఉన్నారు.