అధికారులు మా భూమిని లాక్కున్నారు
అర్ధరాత్రి దొంగల్లా ఆస్తిని కబ్జా చేశారు: ఎంపీ కొత్తపల్లి గీత
సాక్షి, హైదరాబాద్: ఒక ఎంపీ భూమికే రక్షణ లేకపోతే ఎలా అని అరకు ఎంపీ కొత్తపల్లి గీత ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం తన నివాసంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ హైదరాబాద్ శివారులోని శేరిలింగంపల్లి మండలం రాయదుర్గంలో తమ సంస్థకు చెందిన విలువైన భూమిని అధికారులు లాక్కున్నారని ఆరోపించారు. రాయదుర్గంలోని సర్వే నం.83/2లో 53 ఎకరాల భూమిని ఎనిమిదేళ్ల కిందట చట్ట ప్రకారం కొనుగోలు చేశామన్నారు. అయితే ఆదివారం అర్ధరాత్రి రంగారెడ్డి జిల్లా రెవెన్యూ అధికారులు దొంగల్లా తమ స్థలంలోకి ప్రవేశించి సెక్యూరిటీ సిబ్బంది దాడిచేసి భూమిని కబ్జా చేశారని ఆరోపించారు.
ఈ వ్యవహారంలో జాయింట్ కలెక్టర్ రంజిత్ కుమార్ ఉద్ధేశపూర్వకంగా ప్రభుత్వాన్ని, పోలీసులను తప్పు పట్టించారన్నారు. ఇందులో టీఎస్‌ఐసీ చైర్మన్ నరసింహారెడ్డి హస్తం కూడా ఉందని చెప్పారు. పర్సంటేజీలకు ఆశించే జేసీ ఇదంతా చేశారన్నారు. ఈ ఆస్తే తమ జీవితాధారమని.. అది లేని నాడు తమ కుటుంబం రోడ్డున పడాల్సి వస్తుందని చెప్పారు. ఈ విషయంలో న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు. దీనిపై ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్‌ను కలిసి ఫిర్యాదు చేశామన్నారు. ఈ విషయంలో న్యాయం చేయాల్సిందిగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరతానని ఏంపీ గీత తెలిపారు.