క్షణాల్లో దుర్ఘటన.. ఐదుగురి దుర్మరణం | In seconds .. five killed in accident | Sakshi
Sakshi News home page

క్షణాల్లో దుర్ఘటన.. ఐదుగురి దుర్మరణం

Published Thu, Jun 26 2014 4:46 AM | Last Updated on Thu, Apr 4 2019 2:50 PM

క్షణాల్లో దుర్ఘటన.. ఐదుగురి దుర్మరణం - Sakshi

క్షణాల్లో దుర్ఘటన.. ఐదుగురి దుర్మరణం

రెప్పపాటులో ఘోరం జరిగిపోయింది. లారీ రూపంలో పొంచి ఉన్న మృత్యువు ఐదుగురిని బలితీసుకుంది. విధి నిర్వహణలో ఉన్న రెవెన్యూ ఉద్యోగులతో పాటు స్థానికుడు దుర్మరణం చెందారు. కలెక్టర్ రాక కోసం నిరీక్షిస్తూ పిచ్చాపాటిగా మాట్లాడుకుంటున్న వీరిపై అతి వేగంగా వస్తున్న లారీ దూసుకెళ్లి.. బోల్తా పడింది. క్షణాల్లో ఆ ప్రాంతం రక్తసిక్తమైంది. కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలతో ఘటనా స్థలంలో విషాదం అలుముకుంది.
 
- విధుల్లో ఉన్న ఉద్యోగులపైకి దూసుకొచ్చిన లారీ
- ఆర్‌ఐ, ముగ్గురు తలారులు, మరో వ్యక్తి మృతి
- తహశీల్దార్, వీఆర్వో, తలారికి తీవ్ర గాయాలు
- నన్నూరు గ్రామ సమీపంలో ఘటన
- కలెక్టర్ కోసం ఎదురుచూస్తుండగా ప్రమాదం
 సాక్షి ప్రతినిధి, కర్నూలు:
కర్నూలు పెద్దాసుపత్రి కన్నీటి సంద్రమైంది. ఐదుగురు మృతి వార్తతో కుటుంబ సభ్యులు, బంధువులు పెద్ద ఎత్తున చేరుకోవడంతో రోదనలు మిన్నంటాయి. ఘటనా స్థలంలోనే ముగ్గురు మరణించగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు తనువు చాలించారు. ఆసుపత్రిలో హడావుడి.. అధికారులు, నేతల పరామర్శల నడుమ ఏమి జరుగుతుందో తెలియని దయనీయ స్థితి. ఒకరు చనిపోయారంటే.. మరొకరు ఇంకా బతికే ఉన్నారంట అనే సమాచారం గందరగోళానికి గురి చేసింది. ‘చివరి’ వరకు తమ కుటుంబ పెద్ద కోలుకుంటారనే ఆశ. ఘటనా స్థలం నుంచి ఆసుపత్రికి తరలించే వరకు ఎందరు శ్రమించినా.. వైద్యులు శక్తివంచన లేకుండా కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది.

 ఆ కుటుంబాల్లో విషాదం అలుముకుంది. ఇక మాకు దిక్కెవరంటూ తలారి రామకృష్ణ భార్య ఈశ్వరమ్మ.. కుమారుడు, కవలలైన ఇద్దరు ఆడ పిల్లలతో కలసి రోదించడం అక్కడున్న వారిని సైతం కంటతడి పెట్టించింది. అంబులెన్స్ డ్రైవర్‌గా పని చేస్తూ ఎందరో ప్రాణాలు కాపాడిన హుసేనాపురం గోపాల్ మృతితో ఆయన స్వగ్రామం కన్నీరుమున్నీరైంది. ‘‘పెద్ద సారోళ్లు వచ్చారంట. పని అయిపోగానే మధ్యాహ్నానికి తిరిగొస్తాం’’ అని చెప్పి ఇంటి నుంచి బయలుదేరిన నిరుపేద తలారులు శివరాముడు, వెంకటేశ్వర్లు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారనే విషయం తెలిసి వారి కుటుంబ సభ్యులు కుప్పకూలారు.
 
విధి నిర్వహణలో విషాదం
రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్ర జిల్లాల్లో విద్యాసంస్థల ఏర్పాటుకు అనువైన స్థలాల వివరాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సేకరిస్తున్నాయి. ఆ మేరకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) ఏర్పాటుకు సుమారు 300 ఎకరాల భూమి అవసరమని ప్రభుత్వం కోరగా.. అధికారులు భూ సేకరణలో నిమగ్నమయ్యారు. జిల్లాలోని ఓర్వకల్లు మండలం నన్నూరు సమీపంలో అనువైన భూములు ఉండటంతో జిల్లా కలెక్టర్ సి.సుదర్శన్‌రెడ్డి బుధవారం ఉదయం పరిశీలన నిమిత్తం ఓర్వకల్లుకు బయలుదేరారు.

విషయం తెలుసుకున్న ఓర్వకల్లు తహశీల్దార్ సునీతాబాయి, ఆర్‌ఐ శ్రీనివాసులు, తలారులు శివరాముడు, రామకృష్ణ, వెంకటేశ్వర్లు కర్నూలు-నంద్యాల రహదారిలోని గడెంతిప్ప వద్ద రోడ్డు పక్కన వేచి చూస్తున్నారు. హుసేనాపురానికి చెందిన గోపాల్ కర్నూలుకు వెళ్తూ తన స్నేహితుడు, అధికారులు కనిపించడంతో వారి వద్దకు వెళ్లి పలకరించాడు. కలెక్టర్ రాక కోసం ఎదురుచూస్తున్న వీరంతా పిచ్చాపాటిగా మాట్లాడుకుంటున్నారు. ఇంతలో ఓ మృత్యు వాహనం వారి వైపునకు దూసుకొచ్చింది. మహారాష్ట్రకు చెందిన లారీ సిలికా లోడ్‌తో కర్నూలు వైపునకు వస్తూ రోడ్డు పక్కన నిల్చొన్న ఉద్యోగుల మీదుగా వెళ్లింది.

ఘటనలో గ్రామ సేవకులు శివరాముడు(36), వెంకటేశ్వర్లు(43), హుసేనాపురం గోపాల్(28) అక్కడికక్కడే మరణించగా.. రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసులు(45), గ్రామ సేవకుడు రామకృష్ణ(45)లు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందారు. తీవ్ర గాయాలపాలైన తహశీల్దార్ సునీతాబాయి, పూడిచర్ల వీఆర్వో తిమ్మయ్య, నన్నూరు తలారి నాయుడును కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరితో పాటు అక్కడే ఉన్న సర్వేయర్ మల్లికార్జున, పత్రికా విలేకరులు గోపాల్, రాజేంద్రలు తమవైపునకు దూసుకొస్తున్న లారీని గమనించి పక్కకు దూకడంతో ప్రాణాలతో బయటపడ్డారు. లారీ డ్రైవర్, క్లీనర్ పరారీలో ఉన్నారు.
 
45 మీటర్లు ఈడ్చుకెళ్లిన లారీ
అధికారుల మీదుగా వెళ్లిన లారీ వారిని 45 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లింది. వేగంగా వస్తున్న లారీ తమ వైపునకు వస్తుందని గ్రహించలేక భూముల వివరాలు మాట్లాడుతూ ఉండిపోయారు. తప్పించుకోవాలన్నా వెనుక ముళ్లకంచె ఉండటంతో సాహసం చేయలేకపోయారు. లారీ ముందుగా తహశీల్దార్‌ను ఢీకొనగా.. తలారులు ఒకరినొకరు పట్టుకుని తప్పించుకోవాలని ప్రయత్నించినా రెప్పపాటులో లారీ కింద నలిగిపోయారు. మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల రోదనలు ఘటనా స్థలంలో మిన్నంటాయి.
 
ఆసుపత్రికి భారీగా తరలిన రెవెన్యూ ఉద్యోగులు...
ప్రమాదంలో గాయపడి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించేందుకు రెవెన్యూ ఉద్యోగులు  భారీగా తరలివెళ్లారు. సహచరులు మరణించడంపై ప్రతి ఒక్కరిలో ఆందోళన వ్యక్తమయింది. కలెక్టర్ సి.సుదర్శన్‌రెడ్డి, జేసీ కన్నబాబు, ఏజేసీ అశోక్‌కుమార్, డీఆర్వో వేణుగోపాల్‌రెడ్డి, కలెక్టర్ కార్యాలయ పరిపాలనాధికారి రమణరావు, జిల్లా రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ అధ్యక్షుడు సంపత్‌కుమార్, రెవెన్యూ సంఘం నాయకులు రామన్న, సుధాకర్‌రావు, సిరాజ్ ఉద్దీన్, రాజశేఖర్‌బాబు, సుబ్బరాయుడు, సత్యదీప్, పలువురు.. మృతుల కుటుంబాలను, గాయపడి చికిత్స పొందుతున్నవారిని పరామర్శించారు.
 
మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం

కర్నూలు(కలెక్టరేట్): రోడ్డు ప్రమాదంలో మరణించిన రెవెన్యూ ఉద్యోగుల కుటుంబాలకు రూ.10 వేల ప్రకారం ఆర్థిక సహాయం అందిస్తున్నట్లుగా జిల్లా రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ అధ్యక్షుడు సంపత్‌కుమార్ తెలిపారు. ఈ ఆర్థిక సహాయాన్ని అసోసియేషన్ ద్వారా తక్షణం ఇస్తున్నట్లు చెప్పారు. భూములను సర్వే చేస్తున్న రెవెన్యూ ఉద్యోగులపై భారీ వాహనం దూసుకురావడంతో ఒక ఆర్‌ఐతో పాటు ముగ్గురు వీఆర్‌ఏలు మరణించారని, ఈ సంఘటన రెవెన్యూ శాఖలో తీవ్ర విషాదాన్ని నింపిందన్నారు. మృతిచెందినవారి కుటుంబాలను, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నవారిని పరామర్శించినట్లు పేర్కొన్నారు. విధి నిర్వహణలో మరణించినవారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం అందివ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మరణించిన వారి కుటుంబాల్లో చదువుకున్న పిల్లలకు తక్షణం ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలన్నారు. బాధిత కుటుంబాలకు ఇంటి స్థలాలు కూడా ఇవ్వాలన్నారు.
 
అన్ని విధాలా ఆదుకుంటాం : కలెక్టర్ సుదర్శన్ రెడ్డి
కర్నూలు(కలెక్టరేట్): మృతుల కుటుంబాలను అన్ని విధాల ఆదుకుంటామని  కలెక్టర్ సి.సుదర్శన్‌రెడ్డి తెలిపారు. బుధవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదం తనకు తీవ్ర దిగ్భ్రాంతిని కల్గించిందని ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన కుటుంబాలకు తక్షణ సహాయం కింద రూ.25 వేల ప్రకారం ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు. తగిన పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు వివరించారు. మృతుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇచ్చే విధంగా వీలైనంత త్వరగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రభుత్వ పరంగా అందాల్సినవన్నీ త్వరలోనే అందజేస్తామని పేర్కొన్నారు. ప్రమాదంలో గాయపడిన తహశీల్దార్ సునీతాబాయి పరిస్థితి విషమంగానే ఉందని, ఆమె కోలుకుంటుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. చనిపోయిన కుటుంబాలకు సంతాపాన్ని ప్రకటించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement