ఒంగోలు టౌన్ : విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన తహశీల్దార్లకు షోకాజు నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ విజయకుమార్ జిల్లా రెవెన్యూ అధికారిని ఆదేశించారు. ఆ మేరకు.. వైద్యారోగ్యశాఖతో ముందస్తు సమీక్షలు నిర్వహించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన లింగసముద్రం, కొనకనమిట్ల తహశీల్దార్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అదే విధంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని సబ్‌సెంటర్లకు స్థలాలు కేటాయించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన జరుగుమల్లి, గుడ్లూరు, లింగసముద్రం, తాళ్లూరు, పామూరు, ఉలవపాడు తహశీల్దార్లకు కూడా షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
వెలిగండ్లలో ఐసీడీఎస్ భవన నిర్మాణానికి, హనుమంతునిపాడులో సంక్షేమ వసతి గృహానికి స్థలాలు కేటాయించని హనుమంతునిపాడు తహశీల్దార్‌తో పాటు కనిగిరి ఏఎస్‌డబ్ల్యూవోకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. కందుకూరులో ఐసీడీఎస్ భవన నిర్మాణానికి స్థలం చూపించకపోవడంతో అక్కడి తహశీల్దార్‌కు, పచ్చతోరణం పథకం కింద మొక్కలు నాటేందుకు స్థలాలు సేకరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన దొనకొండ, సీఎస్ పురం, గుడ్లూరు, వలేటివారిపాలెం, పొన్నలూరు, జరుగుమల్లి తహశీల్దార్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. గుడ్లూరులో రేషన్‌కార్డుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అక్కడి డిప్యూటీ తహశీల్దార్‌కు కూడా షోకాజ్ నోటీసు జారీ అయింది.
రెవెన్యూ వర్గాల్లో కలకలం...
జిల్లాలో గతంలో ఎన్నడూ లేనివిధంగా పెద్ద సంఖ్యలో తహశీల్దార్లకు షోకాజ్ నోటీసులు ఇవ్వడంతో రెవెన్యూ వర్గాల్లో కలకలం రేగింది. ఇప్పటివరకు ఒకటీఅరా మాత్రమే షోకాజ్ నోటీసులు ఇస్తూ వస్తున్న కలెక్టర్ విజయకుమార్.. ఒకేసారి పదుల సంఖ్యలో తహశీల్దార్లకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో రెవెన్యూ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఇటీవల డివిజనల్ సమీక్ష సమావేశాల తీరుతెన్నులను కలెక్టర్ మార్చారు. తాను సమీక్షించే నాటికి గ్రూపులుగా ఏర్పడి శాఖాపరమైన సమీక్షలు నిర్వహించాలని గత నెలలో జరిగిన సమావేశాలకు ముందుగానే కలెక్టరేట్ నుంచి జిల్లా అధికారులు, డివిజనల్ అధికారులు, తహశీల్దార్లకు ఆదేశాలందాయి.
అయితే, తాజాగా శుక్రవారం జరిగిన కందుకూరు డివిజనల్ సమీక్ష సమావేశంలో తహశీల్దార్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై కలెక్టర్ విజయకుమార్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారికి వెంటనే షోకాజ్ నోటీసులు జారీ చేయాలని డీఆర్వోను ఆదేశించారు. వారు ఇచ్చే సమాధానాన్ని బట్టి తదుపరి చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. మొత్తంమ్మీద అధిక సంఖ్యలో తహశీల్దార్లకు షోకాజ్ నోటీసులివ్వడం జిల్లాలో చర్చనీయాంశమైంది.
తహశీల్దార్లకు షోకాజ్ నోటీసులు
Published Sun, Aug 3 2014 3:24 AM | Last Updated on Thu, Apr 4 2019 2:50 PM
Advertisement