అధికారులపై కలెక్టర్ సీరియస్
ఆరుగురు ఎంపీడీవోలు, 10 మంది స్పెషల్ ఆఫీసర్లు, ఇద్దరు
తహశీల్దార్లకు షోకాజ్‌లు
మహారాణిపేట (విశాఖ): సమాశాలంటే తమాషాలనుకుంటున్నారా.. సమీక్షకు రావాలని ముందే చెప్పినా గైర్హాజరవుతారా... అంటూ జిల్లా కలెక్టర్ ఎన్.యువరాజ్ అధికారులపై మండిపడ్డారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో బుధవారం సాయంత్రం వివిధ పథకాల అమలు తీరుపై ఎంపీడీవోలు, తహశీల్దార్లు, నియోజకవర్గాల స్పెషల్ ఆఫీసర్లతో సమీక్షించారు. సమావేశానికి గైర్హాజరైన వి.మాడుగుల, కోటవురట్ల, నక్కపల్లి, అరకు, పాయకరావుపేట, జి.మాడుగుల ఎంపీడీవోలతో పాటు ఇద్దరు తహశీల్దార్లు, 10 మంది నియోజక వర్గాల స్పెషల్ ఆఫీసర్లకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని జెడ్పీ సీఈవో జయప్రకాశ్ నారాయణ్, డీఆర్వో సి.చంద్రశేఖర్‌రెడ్డిని కలెక్టర్ ఆదేశించారు.
పింఛన్లపై చర్చ
ఎన్టీఆర్ భరోసా కార్యక్రమంపై మండలాల వారీగా కలెక్టర్ చర్చించారు. మాకవరపాలెంలో 2జీ సిమ్ వాడుతున్నందున నెట్‌వర్క్ స్లోగా ఉంటోందని, హుకుంపేటలో సర్వర్లు పనిచేయడం లేదని, ముంచంగిపుట్ మండలానికి రెండు అదనపు ట్యాబులు ఇవ్వలేదని, దానివల్ల పింఛన్ల పంపిణీ సకాలంలో చేయలేకపోతున్నామని ఆయా మండలాల ఎంపీడీవోలు తెలిపారు. బుచ్చయ్యపేటలో ఆధార్‌కార్డు మేచ్ కాకపోవడంతో మండలంలో 8 మంది పింఛన్లు కోల్పోయారని ఆ మండల ఎంపీడీవో కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ఒకే మెషీన్ ఉండడం వల్ల చార్జింగ్ అయిపోతోందని మళ్లీ చార్జింగ్ చేసేవరకు పింఛన్లు ఇవ్వలేకపోతున్నామని రెండో మెషీన్ ఉంటే ఇబ్బందులు ఉండవని పలువురు అధికారులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు.
స్కూల్ టాయిలెట్ల నిర్వహణపై..
పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణ డ్వాక్రా సంఘాలకు అప్పగించామని డీఆర్‌డీఏ పీడీ సత్యసాయి శ్రీనివాస్ తెలిపారు. 3070 స్కూళ్లలో ఈ సంఘాలు పనిచేస్తున్నాయని, వీటి నిర్వహణకు రూ. కోటి 50 లక్షలు మంజూరు చేశామని చెప్పారు. స్కూల్ నర్సరీ పనలు త్వరతగతిన చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. వంటగదుల నిర్మాణాలపై పీఆర్ ఎస్‌ఈ బి.వి.వి.ఎస్.చిరంజీవిని అడిగి తెలుసుకున్నారు. అదనపు తరగతి గదులు ఎందుకు నిర్మించలేకపోతున్నారో స్పెషల్ ఆఫీసర్లు గ్రామాల్లో తిరిగి తెలుసుకోవాలని సూచించారు. 13 మండలాలకు మొదటి విడతగా ఎన్టీఆర్ హెల్త్‌కార్డులు వచ్చాయని మిగతావి త్వరలో అందచేస్తామన్నారు. సీసీ రోడ్ల పనులు త్వరితగతిన పూర్తిచేయాలని పీఆర్ ఎస్‌ఈని ఆదేశించారు.
పాఠశాలల్లో వంటగదులు, అదనపు తరగతి గదుల నిర్మాణం, పౌరసరఫరాలు, ప్రజాపంపిణీ వ్యవస్థ, దీపం, గ్యాస్ కనెక్షన్లు, ఉపాధిహామీ పథకం, గ్రామాల్లో మరుగుదొడ్ల పరిస్థితి, గృహనిర్మాణం, గ్రామీణ తాగునీటి పథకం, నీరు చెట్టు, జికా వైరస్, స్మార్ట్‌వార్డ్, స్మార్ట్ విలేజ్ తదితర అంశాలపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో జేసీ-2 డి.వెంకటరెడ్డి, డీఆర్‌డీఏ పీడీ సత్యసాయి శ్రీనివాస్, డ్వామా పీడీ శ్రీరాములునాయుడు, హౌసింగ్ పీడీ ప్రసాద్ ఎంపీడీవోలు, తహశీల్దార్లు, స్పెషల్ ఆఫీసర్లు పాల్గొన్నారు.
సమావేశాలంటే తమాషానా!
Published Wed, Feb 10 2016 11:16 PM | Last Updated on Thu, Apr 4 2019 2:50 PM
Advertisement