శ్రీ శారదాపీఠం... ఉత్తరపథం | Sri Shardapetam decided to surrender to Kiran Kumara Sharma | Sakshi
Sakshi News home page

శ్రీ శారదాపీఠం... ఉత్తరపథం

Published Sun, Jun 9 2019 2:43 AM | Last Updated on Sun, Jun 9 2019 2:43 AM

Sri Shardapetam decided to surrender to Kiran Kumara Sharma - Sakshi

ఆదిశంకరుల మార్గాన్ని అనుసరిస్తూ అద్వైతసిద్ధాంత ప్రచారకులుగా మన నేల మీద నడయాడిన మహోపాధ్యాయులు ఎందరో ఉన్నారు. వారిలో అగ్రేసరునిగా చెప్పదగ్గవారు జగద్గురు శ్రీ సచ్చిదానందేంద్ర సరస్వతీ మహాస్వామి. వారు శంకరాద్వైతానికి ప్రతీక. ఆ కోవలో చేరేవారే విశాఖ శ్రీ శారదాపీఠాధిపతులు శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి. సచ్చిదానందేంద్రస్వామి నిరూపించిన నిర్గుణ బ్రహ్మవాదాన్ని పుణికి పుచ్చుకుని స్వరూపానందేంద్ర ధర్మపరిరక్షకులుగా నేటి భారతాన దర్శనమిస్తున్నారు.సనాతన ధర్మ పరిరక్షణమే సమాజానికి ఆవశ్యకమని చాటి చెబుతున్నారు. ధర్మపోరాటాలు చేపడుతున్నారు.

అలాంటి స్వరూపానందేంద్రులవారు 1990 దశకంలో విశాఖపట్నంలోని పెందుర్తి సమీపాన చినముషిడివాడ గ్రామంలో వేదోక్తంగా నెలకొల్పిన శారదా పీఠం దినదిన ప్రవర్థమానమవుతూ ఎందరికో మార్గనిర్దేశం చేస్తోంది. ప్రతిష్టాత్మకమైన శ్రీ విశాఖ శ్రీశారదాపీఠ వైభవం రాబోయే తరాల్లోనూ వెల్లివిరియాలన్న లక్ష్యంతో స్వరూపానందేంద్ర స్వామి పీఠం భావి బాధ్యతలను ఇరవై ఆరేళ్ల బ్రహ్మచారి కిరణ్‌ కుమారశర్మకు అప్పగించాలని నిర్ణయించుకున్నారు. కుమారశర్మకు శిష్యతురీయాశ్రమ దీక్షను స్వయంగా తానే ప్రదానం చేయదలిచారు. ఈ నెల 15, 16, 17 తేదీల్లో వేదవేద్యుల సన్నిధిలో ఆహితాగ్ని సాక్షిగా కిరణ్‌కుమారశర్మ సన్యాసాశ్రమ స్వీకరణ ఉత్సవం ఘనంగా జరిగేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రత్యేక వ్యాసం...

భారతీయ ధర్మపీఠాలు నిత్యం ప్రవహించే జీవనదులు. జనబాహుళ్యంలో చేతన నింపగల దివ్యధామాలు. ప్రజాళిని మంచి మార్గాన నడిపించే భక్తి సదనాలు. ఆదిశంకరాచార్యుని మొదలు ఇప్పటి మహాస్వాముల వరకూ ఎందరెందరో స్వధర్మ సంరక్షణకు పాటుపడుతున్నారు. శ్రుతి, స్మృతి పురాణాలను మరింతగా సమన్వయం చేస్తున్నారు. ప్రకరణ గ్రంథాల సాయంతో జీవితసత్యాలను వెల్లడి చేస్తున్నారు. పరబ్రహ్మతత్వాన్ని ఎరుకపరుస్తున్నారు. ఇలాంటి మహనీయుల పరంపర ఆగిపోకూడదు. వీరు నిర్వహించే పీఠాలు నిత్యమై శాశ్వతమై ధర్మప్రచారాన్ని నిర్వహిస్తూనే ఉండాలి.

ఈ యోచనతోనే భారతీయ ధర్మకేంద్రాల అధిపతులు తమ ఉత్తరాధికారిగా ఒకానొక శిష్యుణ్ణి ఎంపిక చేసుకుంటారు. భావి మహాస్వామిగా ఆ బాలసన్యాసిని ప్రకటిస్తారు. శంకరభగవత్పాదులు ప్రారంభించిన పూరీ, శృంగేరీ, ద్వారక, జ్యోతిర్మఠాలు సహా వివిధ సంప్రదాయ పీఠాలెన్నో పరంపరానుగతంగా ఈ సరళిలోనే ముందుకు సాగుతున్నాయి. అజరామరమై విరాజిల్లుతున్నాయి. ఈ ధర్మపీఠాలకు నియుక్తులైన ఉత్తరాధికారులు భవిష్యత్తులో జగద్గురు స్థానాన్ని చేపట్టవలసి ఉంటుంది. జాతికి నీతిని నేర్పవలసి ఉంటుంది. సనాతన భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను కాపాడవలసి ఉంటుంది.

శంకర పదం.. స్వరూప పథం..
తురీయాశ్రమ ధర్మాన్ని భారతీయ ఉపనిషద్‌సారం విడమరిచి చెప్పింది. మానవజన్మకు సంబంధించిన జాగృత, స్వప్న, సుషుప్తావస్థలను దాటి నాలుగవదశకు చేరిన చతుర్థశ్రేణి అశ్రమమే తురీయాశ్రమ సన్యాసం. సర్వసంగాలను తెంచుకుని బ్రహ్మజ్ఞానాన్ని అనుసరిస్తూ సన్యాసి తన జీవితాన్ని గడపవలసి ఉంటుంది. ఇలాంటి సన్యాసాశ్రమం స్వీకరించడానికి ధర్మనిష్ఠతో పాటు, స్వీయ ఆత్మను తెలుసుకోవడం పునాది అవుతుంది. శారదా పీఠం ఉత్తరాధికారిగా నియమితులవుతున్న కిరణ్‌కుమారశర్మ ఈ విషయంలో పూజనీయులు. వేదవిద్యను ఆకళింపు చేసుకున్న వేత్తలు.

కనక దుర్గమ్మ సాక్షిగా..
కనకదుర్గమ్మ పాదాలచెంత ఈ ఉత్తరాధికార నియామకాన్ని ఒక మహత్కార్యంగా జరిపించాలని స్వరూపానందేంద్ర తలపోశారు. విజయవాడ కృష్ణా నది ఒడ్డున ఉన్న గణపతి సచ్చిదానంద ఆశ్రమం జయదుర్గా తీర్థాన్ని ఇందుకు వేదికగా శ్రీ చరణులు ఖరారు చేశారు. జూన్‌ 15, 16, 17 తేదీల్లో వేదవేద్యుల సన్నిధిలో ఆహితాగ్ని సాక్షిగా కిరణ్‌కుమారశర్మ సన్యాసాశ్రమ స్వీకరణ ఉత్సవం ఘనంగా జరిగేందుకు చురుగ్గా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ సందర్భంగా వేదవిహితమైన అగ్నికార్యాలు ఏర్పాటవుతున్నాయి.

సన్యాసాంగ చతుష్కృత్య ప్రాయశ్చిత్తం, దశవిధ స్నానాలు, షోడశమహాదానాలు నిర్వహిస్తారు. శాస్త్ర వాక్యార్థ సభలు సాకారమవుతాయి. వైశ్వానర స్థాలీపాకం, విరజా హోమాలూ భక్తి శ్రద్ధలతో కొనసాగుతాయి. ప్రాచీన, నవీన గురువందనాలు సభక్తికంగా వీటికి జతపడతాయి. బాలస్వామికి యోగపట్టాను శ్రీ చరణులు అనుగ్రహిస్తారు. ఈ మహత్కార్యంలో భాగం పంచుకునేందుకు ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాల నుంచే కాకుండా దేశవిదేశాలనుంచీ భక్తకోటి తరలిరానుంది. తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ ఈ.ఎస్‌.ఎల్‌. నరసింహన్, ముఖ్యమంత్రులు కె. చంద్రశేఖరరావు, వై.ఎస్‌. జగన్మోహనరెడ్డి తదితర పెద్దల సమక్షంలో కార్యక్రమం జరుగుతుంది.

భక్తి ఉద్యమసారధి బాలస్వామి..
శ్రీశారదా పీఠం ఉత్తరాధికారిగా  నియమితులయ్యే కిరణ్‌కుమారశర్మ స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం. 1993 ఏప్రిల్‌ 4 విశాఖలో జన్మించారు. తల్లిదండ్రులు పోణంగి హనుమంతరావు, ప్రభావతమ్మ. వీరిది మధ్యతరగతి కుటుంబం. హనుమంతరావు ఇద్దరు పిల్లలలో పెద్దవాడు కిరణ్‌కుమారశర్మ మూడవ తరగతి చదువుతుండగా యాదృచ్ఛికంగా తల్లిదండ్రులతో కలిసి స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామిని దర్శించే భాగ్యం కలిగింది. బాలకిరణుడు మహాస్వామి కంటికి అపరశంకరునిగా గోచరించారు. అద్భుత ముఖవర్ఛస్సుతో, బ్రహ్మజ్ఞాన సముపార్జనార్హతతో కళకళలాడుతూ పిల్లవాడు కనిపించడం స్వామివారిని విశేషంగా ఆకర్షించింది.వెనువెంటనే తల్లిదండ్రులతో మాట్లాడారు.

లౌకికవిద్యకు స్వస్తి పలికించి పిల్లవాణ్ణి పీఠానికి చేర్చమని సూచించారు.  పీఠానికి వచ్చిన నాటినుంచీ కిరణ్‌కుమారశర్మ జీవితం పూర్తిగా మారిపోయింది.  ఆంగ్ల విద్య మలిగిపోయింది. అంతఃచక్షువులకు సంబంధించిన వేదాధ్యయనం మొదలైంది. సంధ్యావందనంతో ప్రారంభమైన చదువు షోడశకర్మలు, పంచదశ కర్మలూ దాటింది. స్మార్తం హృదయగతమైంది. ద్వాదశి విశ్వనాథం, ఉప్పులూరి సంతోష్‌కుమార్‌శర్మల గురుత్వంలో కుమారశర్మ రాటుదేలుతూ వచ్చారు. రాణి దక్షిణామూర్తిగారి వద్ద  ఉపనిషత్తులు, కారికలు, అరుణం పూర్తి చేశారు. దక్షిణామూర్తి, గిరీశశర్మ అధ్యాపకత్వంలో కృష్ణయజుర్వేదాన్ని అస్థిగతం చేసుకున్నారు. వ్యావహారిక సంస్కృతగ్రామంగా ప్రపంచంలోనే ప్రసిద్ధమైన కన్నడసీమలోని మత్తూరు వాస్తవ్యులు అరుణావధాని, బోధనలో మెళకువలు తెలిసిన ఇరుకు విద్యాసాగరశర్మ వంటి గురువుల నుంచి సంస్కృతం నేర్చుకున్నారు.

శ్రీ చరణుల వద్దనే  కిరణ్‌కుమార శర్మ తర్క, సాంఖ్య, యోగ, వేదాంత, మీమాంసలతో పాటుగా వేదాంగాలను, ఉపనిషత్తులను అధ్యయనం చేశారు. మహాస్వామి ప్రధాన శిష్యునిగా మారిపోయారు. బాలస్వామిగా ప్రఖ్యాతమయ్యారు. రామేశ్వరం నుంచీ హిమాలయాలవరకూ స్వరూపానందేంద్రతో కలిసి విశేష పర్యటనలు జరిపారు. ఆ రకంగా మహాస్వామి అడుగులలో అడుగులు కదుపుతూ శిష్య తురీయాశ్రమ సన్యాస దీక్షా స్వీకరణకు సిద్ధమయ్యారు.విశ్వజనీనమైన స్వధర్మాన్ని రానున్న కాలాన బాలస్వామి కుమారశర్మ మునుముందుకు నడిపిస్తారనేదే భక్తజనుల ఆశ. ఆకాంక్ష.
– డాక్టర్‌ చింతకింది శ్రీనివాసరావు
సీనియర్‌ పాత్రికేయులు

బాలస్వామి యోగ్యుడు
అదిశంకరుడు, సచ్చిదానందేంద్రుడు, అద్వైతానందేంద్రుడు వీరి పరంపరగా శారదా పీఠం నడుస్తూ వస్తోంది. దీనికి ఉత్తరాధికారిగా కిరణ్‌కుమారశర్మ వ్యవహరించబోతున్నారు. వీరి సన్యాసనామం వేరుగా ఉంటుంది. దానిని శిష్యతురీయాశ్రమదీక్ష స్వీకార సమయంలో వెల్లడి చేస్తాం. కిరణ్‌కుమార శర్మ యోగ్యులు. వేదవేదాంగాలు చదువుకున్నవారు. వారి నేతృత్వంలో శ్రీ శారదా పీఠం మరిన్ని సత్కార్యాలు చేయనుంది.
– స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి

పూర్వజన్మ సుకృతం
బంగారం లాంటి మా అబ్బాయిని స్వరూపానందేంద్ర స్వామివారే మేలిమి బంగారంలా తయారు చేశారు. ధర్మ పరిరక్షణకోసం వినియోగిస్తున్నారు. ఇంతకంటే ఏ తల్లిదండ్రులకయినా కావలసింది ఏముంటుంది. అందుకే విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారిగా బాబు నియమితులవుతున్నారని తెలిసి సంతోషించాం. కిరణ్‌కుమారశర్మ ఇంతవరకూ మా అబ్బాయి. ఇప్పుడు జగద్గురువు స్థానానికి చేరారు. ఇది మా పూర్వజన్మ సుకృతం.
– పోణంగి హనుమంతరావు, ప్రభావతమ్మ,
కిరణ్‌కుమారశర్మ తల్లిదండ్రులు

స్వామి అడుగుజాడల్లో...
విశాఖ శ్రీ శారదాపీఠం విలక్షణమైనది. బాధ్యతాయుతమైనది. ఆదిశంకరాచార్యుల వారందించిన చైతన్యంతో నడుస్తోంది. శ్రీ స్వరూపానందేంద్ర మహాస్వామి అడుగుజాడల్లో నడిచి మరిన్ని ధర్మపోరాటాలు చేయాలనేది నా ఆకాంక్ష. వారి సూచనలు పాటిస్తూ ధర్మప్రచారం కోసం అహరహమూ శ్రమిస్తాను. సర్వశక్తులూ ఒడ్డుతాను.
– కిరణ్‌కుమారశర్మ,
శ్రీశారదా పీఠం ఉత్తరాధికారి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement