కొత్త సీఎస్ శైలేంద్రకుమార్ జోషి
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టును నిర్ణీత గడువులోగా పూర్తి చేయడమే తన స్వప్నమని కొత్త సీఎస్‌గా బాధ్యతలు స్వీక రించిన శైలేంద్రకుమార్ జోషి పేర్కొన్నారు. ఈ బృహత్తర ప్రాజెక్టును వీలైనంత తొందరగా ప్రజలకు అంకితం చేయాలని ఉందన్నారు. రాష్ట్రంలో పలు ప్రాజెక్టుల ద్వారా, ప్రత్యేకించి పాలమూరు ప్రాజెక్టుల ద్వారా పంట పొలాలకు నీరందడం వృత్తిపరంగా తనకు అత్యంత సంతృప్తినిచ్చిందని చెప్పారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ పకడ్బందీగా అమలు చేయటంతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా పని చేస్తానన్నారు. సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించాక ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. తనకు ఈ అవకాశమిచ్చిన సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.
శక్తి సామర్థ్యాల మేరకు రాష్ట్ర ప్రజలకు సేవ చేసేందుకు పునరంకితమవుతానని చెప్పారు. ‘తెలంగాణ కొత్త రాష్ట్రం. రాష్ట్రానికి మంచి పేరుంది. అధికారులు, ఉద్యోగులందరం కలిసికట్టుగా, ఒక జట్టుగా పని చేస్తాం. ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలన్నీ కాలవ్యవధి నిర్ణయించుకొని పూర్తి చేస్తాం. జూలై నాటికి కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేయాలనే లక్ష్యానికి అనుగుణంగా శరవేగంగా పనులు చేపట్టేందుకు ప్రాధాన్యమిస్తాం. గత మూడేళ్లలో పలు రంగాల్లో తెలంగాణ శరవేగంగా ప్రగతి సాధించింది. రాష్ట్రం ఏర్పడ్డ కొత్త నుంచి ఇప్పటిదాకా పని చేసిన అధికారులంతా అద్భుతమైన సేవలందించారు. ఆ వారసత్వాన్ని కొనసాగిస్తాను’’అని చెప్పారు. తనకు రెండేళ్ల పదవీకాలం ఉందని, అందరినీ కలుపుకొని ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వామిగా పని చేస్తానన్నారు.
సంతృప్తిగా పని చేశా: ఎస్‌పీ సింగ్
కొత్త సీఎస్ బాధ్యతల స్వీకరణ అనంతరం పాత సీఎస్ ఎస్‌పీ సింగ్‌కు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు వీడ్కోలు పలికారు, 13 నెలల పాటు చేసిన ఆయన సేవలను, ఆయనతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ‘‘తెలంగాణ ప్రజలు చాలా గొప్ప వాళ్లు. ఎవరినైనా అక్కున చేర్చుకుంటారు. దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ ప్రజల ఆతిథ్యం మరిచిపోలేనిది. తెలంగాణ దేశంలోనే నంబర్‌వన్‌గా ఉంది. బంగారు తెలంగాణ సాధనకు సీఎం కేసీఆర్ కష్టపడుతున్నారు’’అని అన్నారు. తనకు ఏ వర్గాలూ లేవని, అందరితో టీం వర్క్ చేశానన్నారు.
ఔటర్ రింగ్ రోడ్డు, మెట్రో రైలు పనులు తన నేతృ త్వంలో పూర్తవడం, మిషన్ భగీరథ పనులు 95%పూర్తవడం అత్యంత సంతోషాన్నిచ్చాయని చెప్పారు. తనకు గ్రూపులు, శత్రువులు లేరన్నారు. అధర్‌సిన్హా, అజయ్ మిశ్రా, కె.రామకృష్ణారావు, జయేశ్ రంజన్, రాజీవ్ త్రివేది, సురేష్ చందా, పీకే ఝా, హర్‌ప్రీత్ సింగ్, కళ్యాణ్ చక్రవర్తి, సీవీ ఆనంద్, బి.జనార్దన్‌రెడ్డి, అనితా రాజేంద్ర, శ్రీ లక్ష్మి, నవీన్ మిట్టల్ తదితర ఐఏఎస్, ఐపీఎస్‌లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment