Liability
-
వన ఉత్పత్తులకు.. దమ్మక్క బ్రాండ్!
అడవుల జిల్లాగా పేరొందిన భద్రాద్రి కొత్తగూడెం నుంచి ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలుగా గిరిజన మహిళలు ఎదుగుతున్నారు. ఐదేళ్ల కిందట శిక్షణతో మొదలైన వారి ప్రయాణం నేడు ఈ కామర్స్ వాకిలి వరకు చేరుకుంది. వీరి విజయ గాథ...నైపుణ్య శిక్షణలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన మహిళలు 2018లో హైదరాబాద్‌కు ఐటీడీఏ తరఫున వెళ్లారు. అక్కడ సబ్బులు, షాంపులు తయారు చేసే ఓ సంస్థలో మూడు నెలలు శిక్షణ తీసుకున్నారు. ఆ శిక్షణతోనే సరిపెట్టుకోకుండా అదే కంపెనీ లో మరో తొమ్మిది నెలల పాటు పనిచేసి తమ నైపుణ్యానికి మరిన్ని మెరుగులు అద్దుకున్నారు. ఇందులో పదిహేను మంది సభ్యులు కలిసి దమ్మక్క జాయింట్ లయబిలిటీ గ్రూప్‌గా ఏర్పడ్డారు. రూ. 25 లక్షలతో షాంపూ, సబ్బుల తయారీ పరిశ్రమ స్థాపించాలని నిర్ణయించుకున్నారు.అవరోధాలన్నింటినీ అధిగమిస్తూ..దమ్మక్క గ్రూప్ సభ్యుల ఉత్సాహం చూసి అప్పటి ఐటీడీఏ పీవో గౌతమ్ పోట్రు బ్యాంకు అధికారులతో మాట్లాడి లోను ఇప్పించడంతో భద్రాచలంలో 2019 నవంబరులో షాంపూ తయారీ యూనిట్నుప్రారంభించారు. పనిలో చేయి తిరగడం అలవాటైన కొద్ది రోజులకే 2020 మార్చిలో కరోనా విపత్తు వచ్చి పడింది. లాక్డౌన్ లు, కరోనా భయాల వల్ల బయటకు వెళ్లి పని చేసేందుకు ఇంట్లో కుటుంబ సభ్యులు అభ్యంతరం చెప్పడం ఒక ఇబ్బందైతే, మరోవైపు తయారీ యూనిట్లో షాంపూ బాటిళ్లు పేరుకుపోయాయి. ఇంతలోనే ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు షాంపూ బాటిళ్లు కావాలంటూ గిరిజన సహకార సంస్థ (జీసీసీ) నుంచి ఆర్డర్ రావడంతో కొంత ఊతం లభించింది.’’ అంటూ దమ్మక్క గ్రూపు జాయింట్ సెక్రటరీ బేబీరాణి అనాటి రోజులను గుర్తు చేసుకున్నారు.ఊపందుకున్న అమ్మకాలు..షాంపూ కొనుగోలుకు జీసీసీ నుంచి మార్కెట్ అందుబాటులో ఉండటంతో పాటు షాంపూ నాణ్యత విద్యార్థులకు నచ్చడంతో క్రమంగా దమ్మక్క యూనిట్ పనితీరు గాడిలో పడింది. 100 మిల్లీలీటర్ల షాంపూ బాటిళ్ల తయారీ 2021లో యాభైవేలు ఉండగా 2022 ముగిసే నాటికి లక్షకు చేరుకుంది. ఆ మరుసటి ఏడాది ఏకంగా రెండు లక్షల బాటిళ్ల షాంపూలు తయారు చేసి విక్రయించారు. షాంపూల తయారీలో వచ్చిన అనుభవంతో ఈ ఏడాది మొదట్లో గ్లిసరిన్ ప్రీమియం సబ్బుల తయారీనిప్రారంభించి జీసీసీ స్టోర్లలో ప్రయోగాత్మకంగా అమ్మకాలుప్రారంభించగా... తొలి దఫాలో ఐదు వేల సబ్బులు అమ్ముడయ్యాయి. ఆ తర్వాత అమ్మకాలు ఊపందుకున్నాయి.బ్యాంక్ రుణం కూడా తీర్చేశారు!యూనిట్ ఆరంభమైన తర్వాత ఏడాదిలో కేవలం మూడు నెలలే గ్రూపు సభ్యులకు పని దొరికేది. షాంపూ, సబ్బులకు డిమాండ్ పెరగడంతో ఈ ఏడాది వరుసగా ఎనిమిది నెలలు అంతా పని చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో బ్యాంకు రుణం కూడా తీర్చేశారు. ప్రతి సభ్యురాలికి ఖర్చులు పోను కనీసం రూ.10 వేల వరకు ఆదాయం వచ్చినట్టు గ్రూప్ ట్రెజరర్ పూనెం విజయలక్ష్మి తెలిపారు.ఈ కామర్స్ దిశగా..రాబోయే రోజుల్లో ఈ కామర్స్ వేదికగా ఈ ఉత్పత్తుల అమ్మకానికి రంగం సిద్ధం చేస్తున్నట్టు గ్రూపు అధ్యక్షురాలు తాటి రాజసులోచన తెలిపారు. ఈ మేరకు బ్రాండ్‌నేమ్ కోసం ప్రయత్నిస్తున్నామన్నారు. అది విజయవంతం అయితే మరెందరో కొత్త వారికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. – జక్కిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సాక్షి, భద్రాచలంఇవి చదవండి: డ్రోన్ దీదీ.. పల్లెటూరి పైలట్! -
2022–23లో ఐటీఆర్ ఫైలింగ్ @ 7.40 కోట్లు: కేంద్రం
ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చతుర్వేది లోక్‌సభలో ఒక కీలక ప్రకటన చేస్తూ, మార్చితో ముగిసిన గడచిన ఆర్థిక సంవత్సరంలో (2022–23) 7.40 కోట్ల మంది ఆదాయపు పన్ను రిటర్నులు ఫైల్ చేశారని, ఇందులో 5.16 కోట్ల మంది ‘జీ ట్యాక్స్ లయబిలిటీ’లో ఉన్నారని పేర్కొన్నారు. గడచిన ఐదేళ్లలో ఐటీఆర్‌లు ఫైల్ చేస్తున్న వ్యక్తుల సంఖ్య పెరుగుతూ వస్తోందని తెలిపారు. 2018–19లో వీరి సంఖ్య 6.28 కోట్లయితే, 2019–20లో 6.47 కోట్లకు చేరిందన్నారు. 2020–21లో ఈ సంఖ్య 6.72 కోట్లకు చేరితే 2021–22లో ఇది 6.94 కోట్లకు పెరిగిందన్నారు. 2022–23లో 7.40 కోట్లకు రిటర్నులు ఫైల్ చేసిన వారి సంఖ్య పెరిగినట్లు వివరించారు. ‘జీరో ట్యాక్స్’ వ్యక్తుల సంఖ్య 2.90 కోట్ల నుంచి 5.16 కోట్లకు అప్ ఇక జీరో ట్యాక్స్ లయబిలిటీలో ఉన్న వారి సంఖ్య 2019–20లో 2.90 కోట్ల మంది ఉంటే, 2022–23లో ఈ సంఖ్య 5.16 కోట్లకు ఎగసినట్లు పేర్కొన్నారు. ‘ప్రత్యక్ష పన్ను వసూళ్లు– దాఖలైన ఆదాయపు పన్ను రిటర్న్‌ల సంఖ్యలో దామాషా పెరుగుదల ఉండకపోవచ్చు. ఎందుకంటే ప్రత్యక్ష పన్ను వసూళ్లు.. సంబంధిత మదింపు సంవత్సరానికి వర్తించే పన్ను రేటు, చట్టం ప్రకారం అనుమతించదగిన తగ్గింపులు/ మినహాయింపులు, ఆర్థిక వ్యవస్థలో వివిధ రంగాలు ఆర్థిక వృద్ధి వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది’’ అని మంత్రి పేర్కొన్నారు. కాగా, 2017–18లో ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.11.38 లక్షల కోట్లయితే, 2022–23లో ఈ పరిమాణం 16.63 లక్షల కోట్లకు ఎగసిందని ఆయన తెలిపారు. -
వీధికుక్కల ఆదరణపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు.. వాస్తవమెంతంటే..
ఢిల్లీ: వీధి కుక్కలను ఆదరించేవాళ్లకు సుప్రీం కోర్టు సీరియస్ వార్నింగ్ ఇచ్చిందంటూ ఓ కథనం జాతీయ మీడియా వెబ్సైట్లలో చక్కర్లు కొడుతోంది. ప్రతీరోజూ వాటికి తిండిపెట్టడమే కాదు.. వ్యాక్సినేషన్ వేయించాల్సిన బాధ్యత కూడా ఉంటుందని గుర్తు చేసిందంటూ, ఒకవేళ అవి గనుక ఎవరినైనా కరిస్తే, ఆ పరిణామాలకూ వాటిని ఆదరించేవాళ్లే బాధ్యత వహించాల్సి ఉంటుందంటూ కీలక వ్యాఖ్యలు చేసిందన్నది ఆ కథనాల సారాంశం. మూగజీవాల పరిరక్షణతో పాటు ప్రజల భద్రత కూడా పరిగణనలోకి తీసుకోవాలంటూ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ జేకే మహేశ్వరిలతో కూడిన ధర్మాసనం తెలిపిందని, వీధికుక్కలను ఆదరించి.. తిండి పెట్టేవాళ్లూ వాటి బాధ్యతలను కూడా తీసుకోవాల్సి ఉంటుందని, ఒకవేళ అవి ఎవరి మీదైనా దాడి చేస్తే గనుక.. ఆ ఘటనలకు వాళ్లే బాధ్యలవుతారు అంటూ బెంచ్ పేర్కొందని కథనం కొన్ని జాతీయ మీడియా ఛానెల్స్ ద్వారా ప్రముఖంగా వైరల్ అయ్యింది. అయితే.. ఈ కథనంలో వాస్తవం లేదన్న విషయం ఇప్పుడు తేలింది. ఎంపీ, జంతు పరిరక్షణ సమితి సభ్యురాలు మేనకా గాంధీ ఓ వీడియో విడుదల చేశారు. న్యాయస్థానంగానీ, ఏ న్యాయమూర్తి అలాంటి వ్యాఖ్యలు చేయలేదని, కేవలం దురుద్దేశంతోనే కొందరు అలా ప్రచారం చేస్తున్నారని ఆమె ఆ వీడియోలో స్పష్టత ఇచ్చారు. కాబట్టి, వీధికుక్కల ఆదరణపై సుప్రీం కోర్టు ప్రతికూల వ్యాఖ్యలు చేసిందన్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని తేలింది. FAKE NEWS : "Those who feed stray dogs will be held liable if dogs attack : supreme court order" Maneka Gandhi, Member of Loksabha, animal rights activist, and environmentalist has given clarification on the same. We request everyone to continue to feed stray animals 🙏. pic.twitter.com/2AWptngja6 — BELAGAVI INFRA.co.in (@Belagavi_infra) September 10, 2022 ఇదిలా ఉంటే.. 2019 నుంచి దేశంలో 1.5 కోట్ల మంది కుక్కకాటుకు గురైనట్లు గణాంకాలు చెప్తున్నాయి. అత్యధికంగా ఉత్తర ప్రదేశ్‌లో కేసులు, ఆపై తమిళనాడు, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్లో కేసులు నమోదు అయ్యాయి. వీటిలో పెంపుడు కుక్కలంటే.. వీధికుక్కల దాడులే ఎక్కువగా ఉన్నాయి. కేరళ, ముంబైలలో పెనుముప్పుగా మారిన వీధికుక్కల దాడులను అరికట్టేందుకు అక్కడి ప్రభుత్వ సంబంధిత పౌర విభాగాలు.. వాటిని చంపించడంపై దృష్టిసారించాయి. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల హైకోర్టుల్లో పలు పిటిషన్లు నమోదుకాగా.. వాటిని కోర్టులు తోసిపుచ్చాయి. దీంతో మూగజీవాల సంరక్షణ సంఘాలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా.. ఒక బ్యాచ్ పిటిషన్లను విచారిస్తోంది అత్యున్నత న్యాయస్థానం. తాజా విచారణ సందర్భంగా.. సెప్టెంబర్ 28కి తదుపరి విచారణ వాయిదా వేసింది. ఇదిలా ఉంటే.. దేశంలో మణిపూర్, లక్షద్వీప్, దాద్రానగర్ హవేలిలో వీధి కుక్కల సంఖ్య సున్నాగా ఉందని అక్కడి అధికార యంత్రాంగాలు ప్రకటించుకున్నాయి. ఇదీ చదవండి: జొమాటో డెలివరీ బాయ్‌పై కుక్క దాడి.. వీడియో వైరల్ -
మాన్యువల్ స్కావెంజర్ల వ్యవస్థ ఇంకెన్నాళ్లు?
సాక్షి, న్యూఢిల్లీ: చేత్తో మలమూత్రాలను ఎత్తిపోసే కార్మికుల(మాన్యువల్ స్కావెంజర్లు) మరణాలపై సంబంధిత అథారిటీలదే బాధ్యత అని జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) పేర్కొంది. దేశంలో ఈ వ్యవస్థను గతంలోనే నిషేధించినా ఇంకా కొనసాగుతుండడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. సదరు కార్మికుల రక్షణ, భద్రతకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, స్థానిక సంస్థలకు ఎన్హెచ్ఆర్సీ పలు సిఫారసులు చేసింది. ఈ సిఫారసుల అమలు విషయంలో తీసుకున్న చర్యలపై మూడు నెలల్లో నివేదిక అందించాలని సూచించింది. ఎన్హెచ్ఆర్సీ సిఫార్సులు ► మాన్యువల్ స్కావెంజర్లకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపాలి. వారి పిల్లలకు ఉపకార వేతనాలతో కూడిన విద్య అందించాలి. ► కార్మికుల డేటాబేస్ ఏర్పాటు చేయాలి. ► సెప్టిక్ ట్యాంకులు, కాలువలను శుభ్రం చేసే వారికి హెల్మెట్లు, రక్షణ జాకెట్లు, గ్లౌజులు, బూట్లు, రక్షణ కళ్లజోళ్లు, ఆక్సిజన్ సిలిండర్లు, టార్చిలైట్లను స్థానిక సంస్థలు లేదా నియమిత సంస్థలు అందజేయాలి. ► ప్రమాదకర రసాయనాల శుద్ధికి నిపుణులైన కార్మికులను వినియోగించాలి. వారికి ‘ఆయుష్మాన్ భారత్’ పథకం వర్తింపజేయాలి. ► యంత్రాలతో శుభ్రం చేసేలా మురుగు కాలువలను నిర్మించాలి. ► నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో బయో టాయిలెట్లు నిర్మించాలి. ► పాతం కాలం మరుగుదొడ్లను ఆధునిక మరుగుదొడ్లుగా మార్చాలి. -
9.5 లక్షల ఆదాయమున్నా పన్ను లేదు
న్యూఢిల్లీ: వార్షికాదాయం రూ.9.5 లక్షల వరకు ఉన్న వారు కూడా పొదుపు పథకాల ద్వారా ఆదాయ పన్ను నుంచి మినహాయింపు పొందవచ్చని తాత్కాలిక ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. అరకొర ఆదాయంతో కాలం వెళ్లదీస్తున్న పేదలు, మధ్యతరగతి ప్రజలకు ప్రయోజనం కలిగించడానికే తాజా బడ్జెట్లో పలు రాయితీలు ప్రకటించినట్లు తెలిపారు. ఆర్థిక బిల్లుపై లోక్‌సభలో జరిగిన చర్చకు గోయల్ మంగళవారం బదులిచ్చారు. సమాజంలోని అన్ని వర్గాలు, పన్ను చెల్లింపుదారుల ప్రయోజనాలు కాపాడేందుకు నాలుగున్నరేళ్లుగా ఎన్డీయే ప్రభుత్వం పాటుపడుతోందని ఆయన అన్నారు. దీని ఫలితంగా దేశంలో పన్ను చెల్లింపుదారుల సంఖ్య, పన్ను వసూళ్లు పెరిగాయని, భారత్ ప్రపంచంలోనే వేగంగా వృద్ధిచెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని పేర్కొన్నారు. పన్ను వసూళ్లు పెరగడంతో సంక్షేమంపై ఖర్చు చేసేందుకు ప్రభుత్వానికి వనరులు అధికంగా సమకూరుతున్నాయని తెలిపారు. (మోదీ సర్కార్ ఎలక్షన్ సినిమా) -
జోసెఫ్ సీనియార్టీపై అసంతృప్తి
న్యూఢిల్లీ: జస్టిస్ కేఎం జోసెఫ్ సీనియారిటీని తగ్గించడంపై సుప్రీంకోర్టు జడ్జీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మిశ్రాను కలిసి తమ నిరసన తెలియజేశారు. మంగళవారం జస్టిస్ జోసెఫ్‌తోపాటు జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ వినీత్ సరన్‌లు బాధ్యతలు తీసుకోనున్న నేపథ్యంలో ఈ నిరసన వ్యక్తమైంది. ప్రమాణ స్వీకార కార్యక్రమం యథావిధిగా జరపాలని, సీనియర్ జడ్జి జస్టిస్ రంజన్ గొగోయ్‌తో మాట్లాడాక నిర్ణయం తీసుకుందామని సీజేఐ హామీ ఇచ్చినట్లు తెలిసింది. సీజేఐని కలిసి నిరసన తెలిపిన వారిలో కొలీజియంలోని ఇద్దరు సీనియర్ జడ్జీలు జస్టిస్ మదన్ బీ లోకుర్, జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ ఏకే సిక్రీ ఉన్నారు. కేంద్ర నోటిఫికేషనే ఫైనల్! కేంద్రం శుక్రవారం ముగ్గురు జడ్జీల పేర్లతో విడుదల చేసిన నియామకపు నోటిఫికేషన్లో జస్టిస్ జోసెఫ్ పేరును ప్రకటించినప్పటికీ ఆయన సీనియారిటీని తగ్గిస్తూ మూడోస్థానంలో పేర్కొన్నారు. మద్రాసు హైకోర్టు సీజేగా ఉన్న జస్టిస్ ఇందిరా బెనర్జీ, ఒరిస్సా హైకోర్టు సీజే జస్టిస్ వినీత్ సరన్‌ల తర్వాత మూడో స్థానంలో ఉత్తరాఖండ్ హైకోర్టు సీజే జస్టిస్ కేఎం జోసెఫ్ పేరును పేర్కొంది. దీనిని రాష్ట్రపతి ఆమోదించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జడ్జీల వరుస క్రమం ఆధారంగానే సీనియారిటీని పరిగణనలోకి తీసుకుంటారు. జనవరి 10న కొలీజియం సీనియర్ న్యాయవాది ఇందు మల్హోత్రాతోపాటుగా జస్టిస్ జోసెఫ్ పేరును సుప్రీంకోర్టు జడ్జీలుగా ప్రతిపాదించింది. అయితే, ఇందు మల్హోత్రా పేరును అంగీకరించిన కేంద్రం.. జోసెఫ్ పేరును తిరస్కరించింది. మే 16న మరోసారి కొలీజియం జస్టిస్ జోసెఫ్ పేరును ప్రతిపాదనల్లో పెట్టింది. జూలైలో దీన్ని కూడా కేంద్రం తిరస్కరించింది. శుక్రవారం విడుదల చేసిన నోటిఫికేషన్లో జోసెఫ్ పేరును పేర్కొనడంతో కొలీజియం, కేంద్ర ప్రభుత్వం మధ్య నెలకొన్న వివాదానికి తెరపడ్డట్లేనని అర్థమవుతోంది. షెడ్యూల్ ప్రకారమే బాధ్యతల స్వీకరణ ముగ్గురు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవీ బాధ్యతల స్వీకరణ మంగళవారం జరగనుంది. కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేయడం, రాష్ట్రపతి ఆమోదం అయిపోయిన తర్వాత ఈ దశలో ఎలాంటి మార్పులకు అవకాశం ఉండదని కోర్టు ఉన్నతస్థాయి వర్గాలు వెల్లడించాయి. ఆలిండియా జాబితాలో జోసెఫ్ః39 ‘హైకోర్టు జడ్జీల ఆలిండియా సీనియారిటీ లెక్కల్లో జస్టిస్ బెనర్జీ 4వ స్థానంలో, జస్టిస్ సరన్ 5వ స్థానంలో, జస్టిస్ జోసెఫ్ 39వ స్థానంలో ఉన్నారు’ అని న్యాయశాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ ముగ్గురు జడ్జీలూ సీజేఐ కాలేరని.. ఎందుకంటే ఇప్పటికే సుప్రీం జడ్జీలుగా ఉన్న వారు వీరికంటే సీనియర్లని తెలిపాయి. ఈ ముగ్గురిలో జస్టిస్ జోసెఫ్ 2023లో రిటైరవుతుండగా.. జస్టిస్ డీవై చంద్రచూడ్ నవంబర్ 2024 వరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉంటారన్నాయి. అప్పటికి ఆయనే సీజేఐగా ఉండొచ్చన్నాయి. కాగా, సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా తలచుకుంటే కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి, జాబితాను మార్చేందుకు వీలుందని మాజీ సీజేఐ జస్టిస్ లోధా పేర్కొన్నారు. అయితే, కేంద్రం నిర్ణయాన్ని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ స్వాగతించారు. హైకోర్టు న్యాయమూర్తులుగా ఉన్న సీనియారిటీ ఆధారంగానే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సీనియారిటీని పొందుతారని ఆయన వ్యాఖ్యానించారు. నిబంధనల ప్రకారమే నోటిఫికేషన్: కేంద్రం జస్టిస్ కేఎం జోసెఫ్ సీనియారిటీని తగ్గించారంటూ నెలకొన్న వివాదంపై కేంద్రం స్పందించింది. నిబంధనల ప్రకారమే నోటిఫికేషన్లో సీనియారిటీ (హైకోర్టు సీనియారిటీ ఆధారంగా) నిర్ణయించినట్లు స్పష్టం చేసింది. జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ సరన్‌లతో పోలిస్తే జస్టిస్ కేఎం జోసెఫ్ రెండేళ్లు జూనియర్ కాబట్టే ఆయన్ను సీనియారిటీలో మూడోస్థానం కల్పించినట్లు పేర్కొంది. జస్టిస్ జోసెఫ్ 2004 అక్టోబర్ 14న హైకోర్టు న్యాయమూర్తిగా.. 2014, జూలై 31న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. సుప్రీంకోర్టు జడ్జిగా ఆయన 2023 జూన్ 16న రిటైరవుతారు. జస్టిస్ ఇందిరా బెనర్జీ 2002, ఫిబ్రవరి 5న హైకోర్టు జడ్జిగా 2017, ఏప్రిల్ 5న హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తిగా పదోన్నతి పొందారు. ఈమె 2022, సెప్టెంబర్ 23న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా రిటైరవుతారు. జస్టిస్ సరన్ 2002, ఫిబ్రవరి 14న హైకోర్టు న్యాయమూర్తిగా, 2016 ఫిబ్రవరి 26న ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2022, మే 10న ఈయన పదవీ విరమణ చేస్తారు. జోసెఫ్‌తో పోలిస్తే మిగిలిన ఇద్దరు రెండేళ్ల ముందుగానే హైకోర్టు న్యాయమూర్తులుగా నియమితులైన అంశాన్ని కేంద్రం ప్రాతిపదికగా తీసుకుంది. -
కాళేశ్వరం ప్రాజెక్టు జీవితాశయం
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టును నిర్ణీత గడువులోగా పూర్తి చేయడమే తన స్వప్నమని కొత్త సీఎస్‌గా బాధ్యతలు స్వీక రించిన శైలేంద్రకుమార్ జోషి పేర్కొన్నారు. ఈ బృహత్తర ప్రాజెక్టును వీలైనంత తొందరగా ప్రజలకు అంకితం చేయాలని ఉందన్నారు. రాష్ట్రంలో పలు ప్రాజెక్టుల ద్వారా, ప్రత్యేకించి పాలమూరు ప్రాజెక్టుల ద్వారా పంట పొలాలకు నీరందడం వృత్తిపరంగా తనకు అత్యంత సంతృప్తినిచ్చిందని చెప్పారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ పకడ్బందీగా అమలు చేయటంతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా పని చేస్తానన్నారు. సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించాక ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. తనకు ఈ అవకాశమిచ్చిన సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. శక్తి సామర్థ్యాల మేరకు రాష్ట్ర ప్రజలకు సేవ చేసేందుకు పునరంకితమవుతానని చెప్పారు. ‘తెలంగాణ కొత్త రాష్ట్రం. రాష్ట్రానికి మంచి పేరుంది. అధికారులు, ఉద్యోగులందరం కలిసికట్టుగా, ఒక జట్టుగా పని చేస్తాం. ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలన్నీ కాలవ్యవధి నిర్ణయించుకొని పూర్తి చేస్తాం. జూలై నాటికి కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేయాలనే లక్ష్యానికి అనుగుణంగా శరవేగంగా పనులు చేపట్టేందుకు ప్రాధాన్యమిస్తాం. గత మూడేళ్లలో పలు రంగాల్లో తెలంగాణ శరవేగంగా ప్రగతి సాధించింది. రాష్ట్రం ఏర్పడ్డ కొత్త నుంచి ఇప్పటిదాకా పని చేసిన అధికారులంతా అద్భుతమైన సేవలందించారు. ఆ వారసత్వాన్ని కొనసాగిస్తాను’’అని చెప్పారు. తనకు రెండేళ్ల పదవీకాలం ఉందని, అందరినీ కలుపుకొని ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వామిగా పని చేస్తానన్నారు. సంతృప్తిగా పని చేశా: ఎస్పీ సింగ్ కొత్త సీఎస్ బాధ్యతల స్వీకరణ అనంతరం పాత సీఎస్ ఎస్పీ సింగ్‌కు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు వీడ్కోలు పలికారు, 13 నెలల పాటు చేసిన ఆయన సేవలను, ఆయనతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ‘‘తెలంగాణ ప్రజలు చాలా గొప్ప వాళ్లు. ఎవరినైనా అక్కున చేర్చుకుంటారు. దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ ప్రజల ఆతిథ్యం మరిచిపోలేనిది. తెలంగాణ దేశంలోనే నంబర్‌వన్‌గా ఉంది. బంగారు తెలంగాణ సాధనకు సీఎం కేసీఆర్ కష్టపడుతున్నారు’’అని అన్నారు. తనకు ఏ వర్గాలూ లేవని, అందరితో టీం వర్క్ చేశానన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు, మెట్రో రైలు పనులు తన నేతృ త్వంలో పూర్తవడం, మిషన్ భగీరథ పనులు 95%పూర్తవడం అత్యంత సంతోషాన్నిచ్చాయని చెప్పారు. తనకు గ్రూపులు, శత్రువులు లేరన్నారు. అధర్‌సిన్హా, అజయ్ మిశ్రా, కె.రామకృష్ణారావు, జయేశ్ రంజన్, రాజీవ్ త్రివేది, సురేష్ చందా, పీకే ఝా, హర్‌ప్రీత్ సింగ్, కళ్యాణ్ చక్రవర్తి, సీవీ ఆనంద్, బి.జనార్దన్‌రెడ్డి, అనితా రాజేంద్ర, శ్రీ లక్ష్మి, నవీన్ మిట్టల్ తదితర ఐఏఎస్, ఐపీఎస్‌లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
రైల్వే టెండర్ల ప్రక్రియలో సంస్కరణలు
న్యూఢిల్లీ: రైల్వేలో పారదర్శకతను పెంచేందుకు, టెండర్ల ప్రక్రియ వేగవంతమయ్యేందుకు ఆ శాఖ మంత్రి సురేశ్ ప్రభు కీలక నిర్ణయం తీసుకున్నారు. టెండర్ల ప్రక్రియలో తన జోక్యం లేకుండా తప్పుకొన్నారు. వాటి ఖరారు బాధ్యతను రైల్వే జోన్లకు, ఉత్పత్తి విభాగాల అధిపతులకే అప్పగించారు. ప్రస్తుతం రైల్వే టెండర్ల ఖరారులో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో రైల్వేల్లో సంస్కరణలకు శ్రీకారం చుడుతూ టెండర్ల ప్రక్రియను మంత్రి సులభతరం చేశారు. ప్రతి దాన్ని రైల్వే బోర్డు ఆమోదానికి పంపకుండా, సోర్స్ అండ్ వర్క్స్ విభాగ పనులకు టెండర్లను ఆమోదించే బాధ్యతను జోనల్ రైల్వేలకు, ఉత్పత్తి విభాగాలకు కట్టబెట్టారు. ఆయా విభాగాల జనరల్ మేనేజర్, డెరైక్టర్ జనరల్‌కే పూర్తి అధికారాలు ఉంటాయని శుక్రవారం రైల్వే శాఖ ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇకపై రూ. 500 కోట్లకంటే ఎక్కువ విలువ గల పనులకు సంబంధించిన టెండర్లను మాత్రమే బోర్డు స్థాయిలో ఆమోదిస్తారు. -
కూతురి పెళ్లినే అప్పుగా పేర్కొన్న అభ్యర్థి!
కూతురు అంటే గుండెల మీద కుంపటి అనుకునే కాలం పోయినా.. ఇప్పటికీ కొంతమంది అలాగే భావిస్తున్నారు. జమ్ము కాశ్మీర్లో ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. అక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న మహ్మద్ యూసుఫ్ భట్ అనే అభ్యర్థి తన ఎన్నికల అఫిడవిట్లో కూతురి పెళ్లినే తనకున్న 'అప్పు'గా పేర్కొన్నారు. ఈయన గండేర్బల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ఈయన అఫిడవిట్ విషయం ఒక్కసారిగా బయట గుప్పుమనడంతో తప్పు సరిదిద్దుకునే ప్రయత్నాల్లో పడ్డారు. తాను నిరక్షరాస్యుడినని, తన సహచరులు ఎవరో ఈ నామినేషన్ పత్రాలను దాఖలుచేశారని, అప్పుడే ఈ పొరపాటు దొర్లి ఉండొచ్చని చెబుతున్నారు. తన ఆలోచనలను సరిగా అర్థం చేసుకోలేక ఇలా చేసి ఉంటారన్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడానికి కొన్ని రోజుల ముందే ఎన్సీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి దూకిన భట్‌కు.. ఈ సంఘటన నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్ఠానం కూడా గట్టిగానే తలంటినట్లు తెలిసింది. -
కౌలు రైతుకు అప్పు తిప్పలు
పర్చూరు, న్యూస్‌లైన్: పంటలు వేసుకునే సమయంలో కౌలు రైతులు పెట్టుబడుల కోసం నానా అగచాట్లు పడుతున్నారు. జిల్లాలోని రైతుల్లో 70 శాతం మంది కౌలుకు చేసేవారే. అటువంటి వారికి ప్రోత్సాహకాలు అందించడంలో అధికార యంత్రాంగం మీనమేషాలు లెక్కిస్తోంది. కౌలు రైతులను ఆదుకునేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ హయాంలో జాయింట్ లయబిలిటీ గ్రూపులను ఏర్పాటు చేశారు. ఆ గ్రూపులకు రుణాలిచ్చేలా బ్యాంకర్లకు ఆదేశాలు జారీ చేశారు. గ్రూపులకు రుణాలు సక్రమంగా అందాయి. అయితే కౌలు రైతులను మరింతగా ఆదుకుంటామని మూడేళ్ల క్రితం కౌలు రైతుల భూ అధీకృత ఆర్డినెన్స్ ప్రవేశపెట్టారు. దీని ద్వారా కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు, విత్తనాలు, పురుగుమందులు, వ్యవసాయ పరికరాలను రాయితీపై అందించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. అయితే చట్టం పెట్టిన దగ్గర నుంచి సక్రమంగా అమలైన దాఖలాలు లేవు. రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసి రుణ అర్హత కార్డుల కోసం కౌలు రైతుల నుంచి అర్జీలు తీసుకున్నారు. జిల్లాలో 2 లక్షల మంది కౌలు రైతులున్నా...రెవెన్యూ సదస్సుల్లో కేవలం 7 వేల మందిని మాత్రమే కౌలు రైతులుగా గుర్తించి రుణ అర్హత కార్డులు జారీ చేశారు. కార్డులు ఇచ్చిన వారికి కూడా సక్రమంగా రుణాలు ఇవ్వలేదు. గతేడాది జిల్లాలో * 240 కోట్ల వ్యవసాయ రుణాలివ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా..* 33 కోట్లు మాత్రమే ఇచ్చారు. బ్యాంకుల వద్ద రైతు సంఘాలు ధర్నాలు చేసి రుణాలిప్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది. లక్ష్యాలు పూర్తిచేసేలా అప్పు తిప్పలు బ్యాంకర్లపై ఒత్తిడి తేవాల్సిన ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నించలేదు. జిల్లాలో మూడు నెలలుగా సమైక్య ఉద్యమాలు జరిగాయి. రెవెన్యూ ఉద్యోగులు సమ్మెలో ఉన్నారు. ఈ నేపథ్యంలో కొత్తగా కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు జారీకాలేదు. పాత కార్డుల ప్రకారం రుణాలివ్వాలని బ్యాంకర్లకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలూ జారీ కాలేదు. మౌఖిక ఆదేశాలు మాత్రమే వచ్చినట్లు బ్యాంకర్లు చెబుతున్నారు. ప్రస్తుతం కొన్ని బ్యాంకుల్లో మాత్రం రైతు సంఘాల ఒత్తిడి మేరకు రుణాలిస్తున్నారు. ఇప్పటికే ఖరీఫ్ పూర్తయింది. రబీ సాగుకన్నా రుణాలిస్తే కౌలు ైరె తులకు ఊరట కలుగుతుంది. రుణపరిమితి పెంపులోనూ అన్యాయమే... గతేడాది వ్యవసాయ రుణం తీసుకున్న కౌలు రైతులు సక్రమంగా రుణాలు చెల్లిస్తే రుణపరిమితి పెంచాల్సి ఉంది. అయితే ఇందుకు బ్యాంకర్లు ససేమిరా అంటున్నారు. గతేడాది *15 వేలు తీసుకొని చెల్లించిన రైతులకు *25 వేలు, *20 వేలు చెల్లించిన రైతులకు * 30 వేల వరకు రుణాలివ్వాల్సి ఉంది. అయితే రుణఅర్హత పెంచి రుణాలిచ్చే విషయంలో బ్యాంకర్లు రిక్తహస్తం చూపుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యుద్ధప్రాతిపదికన గుర్తింపు కార్డులివ్వాలి.. కౌలు రైతుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. వసంతరావు కౌలు రైతులకు యుద్ధప్రాతిపదికన రుణ అర్హత కార్డులు అందజేసి వెంటనే రుణాలిప్పించాలి. ఇప్పటికే రుణాలందక ఖరీఫ్ సీజన్ నష్టపోయారు. రబీ ప్రవేశిస్తున్న నేపథ్యంలో వెంటనే రుణాలిచ్చి కౌలు రైతాంగాన్ని ఆదుకోవాలి. కౌలురైతులకు నిర్దేశించిన చట్టం ప్రకారం రుణపరిమితి పెంచాలి. ఇప్పటికీ రుణాలివ్వని బ్యాంకులను ముట్టడించి కౌలు రైతులకు న్యాయం జరిగేలా పోరాటాలు చేస్తున్నాం.