ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చతుర్వేది లోక్‌సభలో ఒక కీలక ప్రకటన చేస్తూ, మార్చితో ముగిసిన గడచిన ఆర్థిక సంవత్సరంలో (2022–23) 7.40 కోట్ల మంది ఆదాయపు పన్ను రిటర్నులు ఫైల్ చేశారని, ఇందులో 5.16 కోట్ల మంది ‘జీ ట్యాక్స్ లయబిలిటీ’లో ఉన్నారని పేర్కొన్నారు.
గడచిన ఐదేళ్లలో ఐటీఆర్‌లు ఫైల్ చేస్తున్న వ్యక్తుల సంఖ్య పెరుగుతూ వస్తోందని తెలిపారు. 2018–19లో వీరి సంఖ్య 6.28 కోట్లయితే, 2019–20లో 6.47 కోట్లకు చేరిందన్నారు. 2020–21లో ఈ సంఖ్య 6.72 కోట్లకు చేరితే 2021–22లో ఇది 6.94 కోట్లకు పెరిగిందన్నారు. 2022–23లో 7.40 కోట్లకు రిటర్నులు ఫైల్ చేసిన వారి సంఖ్య పెరిగినట్లు వివరించారు.
‘జీరో ట్యాక్స్’ వ్యక్తుల సంఖ్య 2.90 కోట్ల నుంచి 5.16 కోట్లకు అప్
ఇక జీరో ట్యాక్స్ లయబిలిటీలో ఉన్న వారి సంఖ్య 2019–20లో 2.90 కోట్ల మంది ఉంటే, 2022–23లో ఈ సంఖ్య 5.16 కోట్లకు ఎగసినట్లు పేర్కొన్నారు. ‘ప్రత్యక్ష పన్ను వసూళ్లు– దాఖలైన ఆదాయపు పన్ను రిటర్న్‌ల సంఖ్యలో దామాషా పెరుగుదల ఉండకపోవచ్చు. ఎందుకంటే ప్రత్యక్ష పన్ను వసూళ్లు.. సంబంధిత మదింపు సంవత్సరానికి వర్తించే పన్ను రేటు, చట్టం ప్రకారం అనుమతించదగిన తగ్గింపులు/ మినహాయింపులు, ఆర్థిక వ్యవస్థలో వివిధ రంగాలు ఆర్థిక వృద్ధి వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది’’ అని మంత్రి పేర్కొన్నారు. కాగా, 2017–18లో ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.11.38 లక్షల కోట్లయితే, 2022–23లో ఈ పరిమాణం 16.63 లక్షల కోట్లకు ఎగసిందని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment