
వార్షికాదాయం రూ.9.5 లక్షల వరకు ఉన్న వారు కూడా పొదుపు పథకాల ద్వారా ఆదాయ పన్ను నుంచి మినహాయింపు పొందవచ్చని..
న్యూఢిల్లీ: వార్షికాదాయం రూ.9.5 లక్షల వరకు ఉన్న వారు కూడా పొదుపు పథకాల ద్వారా ఆదాయ పన్ను నుంచి మినహాయింపు పొందవచ్చని తాత్కాలిక ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. అరకొర ఆదాయంతో కాలం వెళ్లదీస్తున్న పేదలు, మధ్యతరగతి ప్రజలకు ప్రయోజనం కలిగించడానికే తాజా బడ్జెట్‌లో పలు రాయితీలు ప్రకటించినట్లు తెలిపారు. ఆర్థిక బిల్లుపై లోక్‌సభలో జరిగిన చర్చకు గోయల్ మంగళవారం బదులిచ్చారు.
సమాజంలోని అన్ని వర్గాలు, పన్ను చెల్లింపుదారుల ప్రయోజనాలు కాపాడేందుకు నాలుగున్నరేళ్లుగా ఎన్డీయే ప్రభుత్వం పాటుపడుతోందని ఆయన అన్నారు. దీని ఫలితంగా దేశంలో పన్ను చెల్లింపుదారుల సంఖ్య, పన్ను వసూళ్లు పెరిగాయని, భారత్ ప్రపంచంలోనే వేగంగా వృద్ధిచెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని పేర్కొన్నారు. పన్ను వసూళ్లు పెరగడంతో సంక్షేమంపై ఖర్చు చేసేందుకు ప్రభుత్వానికి వనరులు అధికంగా సమకూరుతున్నాయని తెలిపారు. (మోదీ సర్కార్ ఎలక్షన్ సినిమా)