కూతురి పెళ్లినే అప్పుగా పేర్కొన్న అభ్యర్థి!
కూతురు అంటే గుండెల మీద కుంపటి అనుకునే కాలం పోయినా.. ఇప్పటికీ కొంతమంది అలాగే భావిస్తున్నారు. జమ్ము కాశ్మీర్లో ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. అక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న మహ్మద్ యూసుఫ్ భట్ అనే అభ్యర్థి తన ఎన్నికల అఫిడవిట్లో కూతురి పెళ్లినే తనకున్న 'అప్పు'గా పేర్కొన్నారు. ఈయన గండేర్బల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ఈయన అఫిడవిట్ విషయం ఒక్కసారిగా బయట గుప్పుమనడంతో తప్పు సరిదిద్దుకునే ప్రయత్నాల్లో పడ్డారు.
తాను నిరక్షరాస్యుడినని, తన సహచరులు ఎవరో ఈ నామినేషన్ పత్రాలను దాఖలుచేశారని, అప్పుడే ఈ పొరపాటు దొర్లి ఉండొచ్చని చెబుతున్నారు. తన ఆలోచనలను సరిగా అర్థం చేసుకోలేక ఇలా చేసి ఉంటారన్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడానికి కొన్ని రోజుల ముందే ఎన్సీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి దూకిన భట్కు.. ఈ సంఘటన నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్ఠానం కూడా గట్టిగానే తలంటినట్లు తెలిసింది.