సమష్టి కృషి
తాము తయారు చేసిన ఉత్పత్తులతో దమ్మక్క గ్రూప్ సభ్యులు
అడవుల జిల్లాగా పేరొందిన భద్రాద్రి కొత్తగూడెం నుంచి ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలుగా గిరిజన మహిళలు ఎదుగుతున్నారు. ఐదేళ్ల కిందట శిక్షణతో మొదలైన వారి ప్రయాణం నేడు ఈ కామర్స్ వాకిలి వరకు చేరుకుంది. వీరి విజయ గాథ...
నైపుణ్య శిక్షణలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన మహిళలు 2018లో హైదరాబాద్‌కు ఐటీడీఏ తరఫున వెళ్లారు. అక్కడ సబ్బులు, షాంపులు తయారు చేసే ఓ సంస్థలో మూడు నెలలు శిక్షణ తీసుకున్నారు. ఆ శిక్షణతోనే సరిపెట్టుకోకుండా అదే కంపెనీ లో మరో తొమ్మిది నెలల పాటు పనిచేసి తమ నైపుణ్యానికి మరిన్ని మెరుగులు అద్దుకున్నారు. ఇందులో పదిహేను మంది సభ్యులు కలిసి దమ్మక్క జాయింట్ లయబిలిటీ గ్రూప్‌గా ఏర్పడ్డారు. రూ. 25 లక్షలతో షాంపూ, సబ్బుల తయారీ పరిశ్రమ స్థాపించాలని నిర్ణయించుకున్నారు.
అవరోధాలన్నింటినీ అధిగమిస్తూ..
దమ్మక్క గ్రూప్ సభ్యుల ఉత్సాహం చూసి అప్పటి ఐటీడీఏ పీవో గౌతమ్ పోట్రు బ్యాంకు అధికారులతో మాట్లాడి లోను ఇప్పించడంతో భద్రాచలంలో 2019 నవంబరులో షాంపూ తయారీ యూనిట్‌నుప్రారంభించారు. పనిలో చేయి తిరగడం అలవాటైన కొద్ది రోజులకే 2020 మార్చిలో కరోనా విపత్తు వచ్చి పడింది. లాక్‌డౌన్ లు, కరోనా భయాల వల్ల బయటకు వెళ్లి పని చేసేందుకు ఇంట్లో కుటుంబ సభ్యులు అభ్యంతరం చెప్పడం ఒక ఇబ్బందైతే, మరోవైపు తయారీ యూనిట్‌లో షాంపూ బాటిళ్లు పేరుకుపోయాయి. ఇంతలోనే ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు షాంపూ బాటిళ్లు కావాలంటూ గిరిజన సహకార సంస్థ (జీసీసీ) నుంచి ఆర్డర్ రావడంతో కొంత ఊతం లభించింది.’’ అంటూ దమ్మక్క గ్రూపు జాయింట్ సెక్రటరీ బేబీరాణి అనాటి రోజులను గుర్తు చేసుకున్నారు.
ఊపందుకున్న అమ్మకాలు..
షాంపూ కొనుగోలుకు జీసీసీ నుంచి మార్కెట్ అందుబాటులో ఉండటంతో పాటు షాంపూ నాణ్యత విద్యార్థులకు నచ్చడంతో క్రమంగా దమ్మక్క యూనిట్ పనితీరు గాడిలో పడింది. 100 మిల్లీలీటర్ల షాంపూ బాటిళ్ల తయారీ 2021లో యాభైవేలు ఉండగా 2022 ముగిసే నాటికి లక్షకు చేరుకుంది. ఆ మరుసటి ఏడాది ఏకంగా రెండు లక్షల బాటిళ్ల షాంపూలు తయారు చేసి విక్రయించారు. షాంపూల తయారీలో వచ్చిన అనుభవంతో ఈ ఏడాది మొదట్లో గ్లిసరిన్ ప్రీమియం సబ్బుల తయారీనిప్రారంభించి జీసీసీ స్టోర్లలో ప్రయోగాత్మకంగా అమ్మకాలుప్రారంభించగా... తొలి దఫాలో ఐదు వేల సబ్బులు అమ్ముడయ్యాయి. ఆ తర్వాత అమ్మకాలు ఊపందుకున్నాయి.
బ్యాంక్ రుణం కూడా తీర్చేశారు!
యూనిట్ ఆరంభమైన తర్వాత ఏడాదిలో కేవలం మూడు నెలలే గ్రూపు సభ్యులకు పని దొరికేది. షాంపూ, సబ్బులకు డిమాండ్ పెరగడంతో ఈ ఏడాది వరుసగా ఎనిమిది నెలలు అంతా పని చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో బ్యాంకు రుణం కూడా తీర్చేశారు. ప్రతి సభ్యురాలికి ఖర్చులు పోను కనీసం రూ.10 వేల వరకు ఆదాయం వచ్చినట్టు గ్రూప్ ట్రెజరర్ పూనెం విజయలక్ష్మి తెలిపారు.
ఈ కామర్స్ దిశగా..
రాబోయే రోజుల్లో ఈ కామర్స్ వేదికగా ఈ ఉత్పత్తుల అమ్మకానికి రంగం సిద్ధం చేస్తున్నట్టు గ్రూపు అధ్యక్షురాలు తాటి రాజసులోచన తెలిపారు. ఈ మేరకు బ్రాండ్‌నేమ్ కోసం ప్రయత్నిస్తున్నామన్నారు. అది విజయవంతం అయితే మరెందరో కొత్త వారికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. – జక్కిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సాక్షి, భద్రాచలం
ఇవి చదవండి: డ్రోన్ దీదీ.. పల్లెటూరి పైలట్!
Comments
Please login to add a commentAdd a comment