అమ్మ చెప్పిన మాటే.. ఇప్పుడీ స్థాయికి!
ప్రీతిక మెహతాను వరల్డ్ ఎకనామిక్ ఫోరం ‘గ్లోబల్ షార్పర్’గా గుర్తించింది. చండీగఢ్‌కు చెందిన ప్రీతిక బహుముఖ ప్రజ్ఞాశాలి. గణిత మేధావి, డేటా సైంటిస్ట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్స్‌పర్ట్‌గా పేరు తెచ్చుకున్న ప్రీతిక ‘బటర్‌నట్ ఏఐ’తో ఎంటర్‌ప్రెన్యూర్‌గా కూడా రాణిస్తోంది. మరోవైపు మోటివేషనల్ స్పీకర్‌గా ఎంతోమందికి ధైర్యాన్ని ఇస్తోంది. మార్గనిర్దేశం చేస్తోంది.
లెక్కలు అంటే చాలామంది పిల్లలకు భయం. అయితే చిన్నప్పటి నుంచి ప్రీతికకు లెక్కలు అంటే చెప్పలేనంత ఇష్టం. బొమ్మలు వేయడం అంటే కూడా ఇష్టం. పద్నాలుగు సంవత్సరాల వయసులో కోడింగ్ నేర్చుకోవడం మొదలుపెట్టింది. ఒక ప్రొడక్ట్ స్టార్టప్‌లో తొలి ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)పై ఆసక్తి పెరిగింది. దాంతో ఉద్యోగాన్ని వదులుకొని న్యూయార్క్‌లోని స్టేట్ యూనివర్శిటీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో మాస్టర్స్ చేసింది.
ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు ఖర్చుల కోసం ఒక రెస్టారెంట్‌లో పనిచేసేది. గ్రాడ్యుయేషన్ సెర్మనీకి ప్రీతిక తల్లి అమెరికాకు వచ్చింది. తల్లిని తన ప్రొఫెసర్‌కు పరిచయం చేసింది. ‘మీ అమ్మాయి బ్రైట్ స్టూడెంట్. క్లాస్‌రూమ్‌లో లోతైన ప్రశ్నలు అడిగేది. మీ కూతురికి మంచి భవిష్యత్ ఉంది’ అంటూ ఆ ప్రొఫెసర్ ప్రీతికపై ప్రశంసల వర్షం కురిపించాడు.
ప్రొఫెసర్ మాటలు విన్న తరువాత ప్రీతికకు తన మీద ఉన్న నమ్మకం రెట్టింపు అయింది. ‘యస్. నేను సాధించగలను’ అనుకుంది. బోస్టన్‌లోని ‘బాంక్ ఆఫ్ అమెరికా’లో పనిచేసే అవకాశం ప్రీతికకు వచ్చింది. అయితే సొంతంగా ఏదైనా సాధించాలనే లక్ష్యంతో అధిక వేతనంతో కూడిన ఉద్యోగానికి రాజీనామా చేసింది. ప్రీతిక నిర్ణయం కుటుంబ సభ్యులతో సహా చాలామందికి నచ్చలేదు.
‘బ్యాంక్ ఆఫ్ అమెరికాలో ఉద్యోగ జీవితం బాగున్నప్పటికీ నాలో ఉన్న అన్ని టాలెంట్స్‌ను ఉపయోగించుకునే అవకాశం దొరకలేదు’ అంటూ గతాన్ని గుర్తు చేసుకుంటుంది ప్రీతిక. అమెరికా నుంచి వచ్చిన తరువాత పిల్లలకు కోడింగ్ నేర్పించడానికి ‘కిడ్డీకోడర్స్’ను స్టార్ట్ చేసి పన్నెండు దేశాలకు వెళ్లింది. ఆ తరువాత సాక్‌సోహో.కామ్‌తో మెన్స్ ఫ్యాషన్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.
‘మెన్స్ ఫ్యాషన్ ఇండస్ట్రీలో మంచి అవకాశాలు ఉన్నాయని రిసెర్చ్ ద్వారా తెలుసుకున్నాను. ఈ స్పేస్‌లో గ్లోబల్ స్టార్టప్ నిర్మించవచ్చు. దీన్ని దృష్టిలో పెట్టుకొని సాక్‌సోహో మొదలు పెట్టాను’ అంటుంది ప్రీతిక.
తనకు పట్టు ఉన్న డేటా, ఏఐ సబ్జెక్ట్‌లతో కస్టమర్‌ల వ్యక్తిగత అనుభవాలతో కంపెనీని బిల్డ్ చేసింది. యూఎస్‌లో చదువుకునే రోజుల్లోపార్ట్‌టైమ్ ఉద్యోగిగా ఒక ఇటాలియన్ రెస్టారెంట్‌లో పనిచేసింది. అది కస్టమర్–ఫేసింగ్ జాబ్ కావడం వల్ల ఎన్నో విషయాలపై అవగాహన వచ్చింది. ఆ జ్ఞానం ‘సాక్‌సోహో’కు ఉపయోగపడింది. డైరెక్ట్–టు–కన్జ్యూమర్ ఫ్యాషన్ బ్రాండ్ ‘సాక్‌సోహో’ తో ఎంటర్‌ప్రెన్యూర్‌గా విజయకేతనం ఎగరేసింది ప్రీతిక. ‘మనపై మనకు ఉన్న నమ్మకమే శక్తి. దానితో ఎన్ని విజయాలైనా సాధించవచ్చు’ అంటుంది ప్రీతిక మెహతా.
మార్గనిర్దేశం..
‘ఉన్నత స్థానానికి చేరుకున్న మహిళలకు తమ స్థాయిని కా΄ాడుకోవడానికి రెట్టింపు కష్టపడాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో లక్ష్యసాధనకు సంబంధించి అమ్మాయిలకు మార్గనిర్దేశం చేయడానికి వారికి సమయం దొరకదు’ అంటున్న ప్రీతిక ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎంత బిజీగా ఉన్నప్పటికి లక్ష్యసాధన విషయంలో అమ్మాయిలకు మార్గనిర్దేశం చేయడానికి ఎన్నో సమావేశాల్లోపాల్గొంది. ఎంటర్‌ప్రెన్యూర్‌గానే కాదు మోటివేషనల్ స్పీకర్‌గా కూడా మంచి పేరు తెచ్చుకుంది. ‘థింక్. లెర్న్. డిసైడ్ విత్ యువర్ ఓన్ హెడ్ అండ్ హార్ట్’ అనేది ఎన్నో సమావేశాలలో ప్రీతిక నుంచి వినిపించే మాట.
అమ్మ చెప్పిన మాట..
చదువుకునే రోజుల్లో ఎందరో విజేతల కథలు నాకు స్ఫూర్తి ఇచ్చాయి. అదే సమయంలో ‘ప్రతి రంగంలో పురుషులతో పోల్చితే మహిళా విజేతలు ఎందుకు తక్కువగా ఉన్నారు?’ అని ఆలోచించేదాన్ని. ఈ ఆలోచనలతోనే నా వంతుగా ఏదైనా సాధించాలనే పట్టుదల పెరిగింది. చిన్నప్పుడు స్కూల్ మార్చమని ఇంట్లో గొడవ చేశాను. దీనికి కారణం క్లాసులో 80 మంది స్టూడెంట్స్ ఉండడం. ‘ఇంత మంది మధ్య నేను టాపర్‌గా ఎలా ఉండగలను’ అన్నాను.
‘ఇరవైమందిలో ఎలాగైతే టాపర్‌గా నిలిచావో 80 మందిలో కూడా టాపర్‌గా నిలవాలి’ అని అమ్మ చెప్పింది. వందమందిలో రాణించగలిగినప్పుడు వెయ్యిమందిలో కూడా రాణించగలం అనే సత్యం బోధపడింది. మనలో సామర్థ్యం ఉన్నప్పుడు సంఖ్య ముఖ్యం కాదు. ఒకవైపు భవిష్యత్ లక్ష్యాలు. మరోవైపు ఇరుగు పొరుగు వారి సూటిపోటి మాటలు.
‘ఈ డ్రెస్‌తో బయటికి వెళతావా?’ ‘అబ్బాయిలా పొడుగ్గా పెరుగుతున్నావేమిటి?’... ఇలాంటి నాన్‌సెన్స్ మైండ్‌సెట్ కామెంట్స్ చిరాకు కలిగించేవి కానీ నా భవిష్యత్ లక్ష్యాలను నీరుగార్చలేకపోయాయి. మన దేశంలోనే కాదు అమెరికాలోనూ వృత్తిజీవితంలో లింగవివక్షతను ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయి. అయితే అలాంటి వాటికి చిన్నబుచ్చుకోకుండా టాలెంట్‌తోనే సమాధానం చె΄్పాను.
– ప్రీతిక మెహతా
Comments
Please login to add a commentAdd a comment