Woman Sarpanch
-
మహిళా ప్రజాప్రతినిధులంటే అలుసా?
న్యూఢిల్లీ: ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన ప్రజాప్రతినిధిని పదవి నుంచి తొలగించడాన్ని సాధారణ విషయంగా తీసుకోవద్దని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజాప్రతినిధిగా గెలిచిన మహిళలను ఇష్టారాజ్యంగా పదవుల నుంచి తొలగించడం సరైంది కాదని పేర్కొంది. మహారాష్ట్రలో ఓ గ్రామ మహిళా సర్పంచిని పదవి నుంచి తప్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వును న్యాయస్థానం కొట్టివేసింది. మహిళలు గ్రామ సర్పంచి కావడాన్ని చాలామంది తట్టుకోలేకపోతున్నారని సుప్రీంకోర్టు ఆక్షేపించింది. దేశమంతటా ఇలాంటి పరిస్థితి ఉందని పేర్కొంది. నిర్ణయాలు తీసుకొనే సామర్థ్యం మహిళల్లో ఉండదన్న అభిప్రాయం ప్రజల్లో ఉందని వెల్లడించింది. నిజానికి మహిళల్లో చక్కటి పరిపాలనా సామర్థ్యాలు ఉంటాయని, వారిని తక్కువ అంచనా వేయొద్దని సూచించింది. మనీశ్ రవీంద్రపన్ పాటిల్ అనే మహిళ మహారాష్ట్రలో జలగావ్ జిల్లా విచ్ఖేడ్ గ్రామ సర్పంచిగా ఎన్నికయ్యారు. ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మించిన భవనంలో ఆమె తన అత్తతో కలిసి నివసిస్తున్నారని గ్రామస్థులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఒక ప్రజాప్రతినిధి కబ్జా చేసిన స్థలంలో కట్టిన ఇంట్లో నివసించడం చట్టవిరుద్ధమని ఆమెపై అనర్హత వేటు వేయాలని కోరారు. ఈ ఆరోపణలను మనీశ్ రవీంద్రపన్ పాటిల్ ఖండించారు. తాను భర్త, పిల్లలతో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్నానని స్పష్టంచేశారు. కలెక్టర్ సరైన విచారణ చేయకుండా తెలుసుకోకుండా పాటిల్‌ను సర్పంచి పదవి నుంచి తొలగించారు. దీన్ని ఆమె బాంబే హైకోర్టులో సవాలు చేశారు. హైకోర్టు కూడా కలెక్టర్ నిర్ణయాన్ని సమర్థించడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. బాంబే హైకోర్టు ఉత్తర్వును తోసిపుచ్చింది. పాటిల్ సర్పంచిగా విధులు నిర్వర్తించవచ్చంటూ తీర్పు వెలువరించింది. దేశంలో లింగ సమానత్వం కోసం, మహిళా సాధికారత కోసం ఒకవైపు కృషి కొనసాగుతుండగా, మరోవైపు వారిని నిరుత్సాహపర్చే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని ఆవేదన వెలిబుచ్చింది. ప్రజల ఆలోచనా ధోరణిలో మార్పు రావాలని, మహిళలను ప్రోత్సహించాలని స్పష్టం చేసింది. వారిని కింపచర్చడం, అలుసుగా తీసుకోవడం తగదని హితవు పలికింది. పేర్కొంది. -
ప్రతిభకు మారు పేరు ఆ ఊరు
అది ఆదివాసీ గ్రామం. ఆ ఊరికి సర్పంచ్ ఓ మహిళ. అక్కడ రాజకీయాల్లేవు. ఉన్నదంతా జనంలో ఐకమత్యమే. ఊరిలో అవినీతికి తావు లేదు. అభివృద్ధికి చిరునామాగా మారింది. ఊరంతా సస్యశ్యామలంగా ఉంది. జీవవైవిధ్యతకు ప్రతీకగా నిలిచింది. సర్పంచ్ ప్రతిభకు మారుపేరయింది. తెలంగాణ, కుమ్రుం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా, మార్లవాయి గ్రామం. ఆ గ్రామ సర్పంచ్ ప్రతిభ మంగళవారం నాడు (మే, 23వ తేదీ) ఇంటర్నేషనల్ బయో డైవర్సిటీ డే సందర్భంగా ‘తెలంగాణ స్టేట్ బయోడైవర్సిటీ’ అవార్డు అందుకున్నారు కనక ప్రతిభ. తన ప్రతిభతో గ్రామాన్ని నందనవనంగా మార్చిన ఆమె సాక్షితో పంచుకున్న విశేషాలివి. ‘‘మహిళా రిజర్వేషన్లో భాగంగా మా పంచాయితీని మహిళలకు కేటాయించారు. చదువుకున్న వాళ్లయితే బాగుంటుందని మా ఊరి వాళ్లందరూ 2019లో నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగని నేను ఎక్కువేమీ చదువుకోలేదు. డిగ్రీ మొదటి సంవత్సరంలో ఉండగా పెళ్లయింది. ఊరిని బాగు చేయాలనే సంకల్పం ఉంటే ఈ చదువైనా చాలు. మా ఊరి జనాభా 708, మొత్తం కుటుంబాలు 130. ప్రాథమిక పాఠశాల, ఆశ్రమ పాఠశాల కూడా ఉంది. ఇక అంగన్వాడీ కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కమ్యూనిటీ భవనం ఉన్నాయి. నేను వచ్చిన తర్వాత 26 మంది మహిళలకు చేతన ఫౌండేషన్ ద్వారా టైలరింగ్‌లో శిక్షణ ఇప్పించి, ఎస్బీఐ– ఆర్‌ఎస్‌ఈటీ సహకారంతో కుట్టు మిషన్లు ఇప్పించాను. వాళ్లకు చేతిలో పని ఉండడానికి ఆశ్రమ పాఠశాల విద్యార్థుల యూనిఫామ్ కుట్టే ఏర్పాటు చేశాం. డ్వాక్రా గ్రూపులు పదకొండున్నాయి. డ్వాక్రా డబ్బుతో కొంతమంది కిరాణా దుకాణాలు పెట్టుకున్నారు. వీథి వీథీ తెలుసు! మా ఊరిలో ప్రతి వీథీ, ప్రతి కుటుంబమూ తెలుసు. బడి వయసు పిల్లలందరినీ బడికి పంపించాలని ఇంటింటికీ వెళ్లి చెబుతుంటాను. అలాగే పదేళ్లలోపు ఆడపిల్లలందరికీ ‘సుకన్య సమృద్ధి యోజన’ పథకం కింద బ్యాంకు ఖాతాలు తెరిపించాను. పంచాయితీలకు కేంద్ర ప్రభుత్వ సహకారం బాగుంది. వీథులన్నీ సిమెంట్ రోడ్లు వచ్చాయి. అన్ని ఇళ్లకూ టాయిలెట్లున్నాయి. కిరోసిన్ దీపం వెలిగించాల్సిన అవసరం లేదు, అన్ని ఇళ్లకూ కరెంట్ ఉంది. వందకు పైగా ఇళ్లలో దీపం పథకం గ్యాస్ సిలిండర్లున్నాయి. చదువుకున్న వాళ్ల కోసం చిన్నపాటి వీథి గ్రంథాలయం కూడా పెట్టాం. అలాగే హరితహారంలో భాగంగా మొక్కలు నాటాం. గ్రామంలో ఏ మూలకెళ్లినా పచ్చదనం పరిఢవిల్లుతోంది. మంచినీటి సౌకర్యం, పరిశుభ్రతలో భాగంగా ఎప్పటికప్పుడు డ్రైనేజీ శుభ్రం చేయించడం, ప్లాస్టిక్ వాడకంలో విచక్షణ, తడిచెత్త– పొడి చెత్త పట్ల అవగాహన వంటివన్నీ జీవవైవిధ్య పురస్కారం ఎంపికకు ప్రమాణాలయ్యాయి. అందరూ ఇంటిపన్ను కడతారు మా ఊరిలో అంతా క్రమశిక్షణతో నడుచుకుంటారు. అందరూ ఇంటి పన్ను కడతారు. అంతకుముందెప్పుడో ఇందిరమ్మ ఇళ్లు వచ్చాయి. ఎక్కువమందికి మంచి ఇళ్లున్నాయి. కొంతమంది పెంకుటిళ్లలో ఉంటే, ఇప్పటికీ కొంతమంది మట్టికప్పు ఇళ్లలోనే ఉన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మాత్రం రాలేదు. మా ఊరి వాళ్ల గొప్పమనసు ఏమిటంటే... ఊరి బాగు కోసం ఏ పని చేపట్టినా అంతా కలసి వస్తారు. అందరూ ఇంకుడు గుంతలు తవ్వుకున్నారు. జీవవైవిధ్యత నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ వంటి కార్యక్రమాల్లో మొక్కలు నాటడం, వాటిని పరిరక్షించడంలో సంతోషంగా ముందుకు వస్తారు. వీథులకు రెండువైపులా రకరకాల మొక్కలు నాటాం. గిరి వికాస్ పథకం ద్వారా వ్యవసాయానికి 30 బావులు తవ్వించాం. అంతకు ముందు ఇరవై బావులుండేవి. ఊరిలో ఎక్కువమంది వ్యవసాయం చేస్తారు. ఒక్కొక్కరికి పదెకరాలకు తక్కువ లేకుండా భూమి ఉంది. అసలే భూమి లేని వాళ్లు కూడా ఉన్నారు. వాళ్లకు ఉపాధి హామీ పనుల కార్డు ఉంది. పొలాలకు గట్లు, చెరువు పూడిక తీయడం, పొలాల్లోకి వెళ్లడానికి మట్టిరోడ్లు వేయడం వంటి పనులు ఉపాధి హామీలో చేయిస్తాం. ఆకలి, పేదరికం మా ఊరి పొలిమేరలకు కూడా రావు. వ్యవసాయంతోపాటు ఆవులు, గేదెలు, మేకలు, కోళ్లు పెంచుకుంటారు. ప్రతి ఒక్కరూ పని చేస్తారు. సంతోషంగా జీవిస్తారు. ► ఉత్తమ గ్రామ పంచాయితీ 2021 అక్టోబర్ ► ఉత్తమ మహిళా సర్పంచ్ 2021 మార్చి 8 ► జాతీయ స్థాయిలో సంసద్ ఆదర్శ గ్రామీణ యోజనలో ఉత్తమ గ్రామ పంచాయితీ ► పేదరికరహిత, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనలో మొదటి స్థానం ► బెస్ట్ బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ అవార్డు 2023 మా ఊరికి సర్పంచ్‌గా నేను తొలి మహిళను. మహిళ అయిన కారణంగా నన్ను తక్కువ చేసి చూడడం మా దగ్గర ఉండదు. అంతా అభిమానంగా ఉంటారు. ఊరందరూ ఒక మాట మీద ఉంటారు కాబట్టి నేను ఇన్ని పనులు చేయగలుగుతున్నాను’’ అని గ్రామ తొలి మహిళగా తన అనుభవాలను వివరించారు ప్రతిభ. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై మహిళా సర్పంచ్ సంచలన ఆరోపణలు
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి వరంగల్ బీఆర్ఎస్ పార్టీలో పెను ప్రకంటపనలు మొదలయ్యాయి. మాజీ డిప్యూటీ సీఎం, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మరోసారి వివాదాల్లో చిక్కుకున్నారు. రాజయ్యపై జానకీపురం మహిళ సర్పంచ్ నవ్య తీవ్ర ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే తనకు ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడుతున్నారని.. లైంగికంగా వేధిస్తున్నారని మండిపడ్డారు. తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని తెలిపారు. ఎమ్మెల్యే కాల్ చేసి బయటకు రమ్మంటున్నారని నవ్య ఆరోపణలు చేస్తున్నారు. రాజయ్య మాట్లాడిన కాల్ రికార్డ్స్ ఉన్నాయని పేర్కొన్నారు. సమయం చూసి అవన్నీ భయటపెడతానని అన్నారు. తన వెనక ఎవరూ లేరని స్పష్టం చేశారు. ఎవరో చెప్పిన మాటలు వినాల్సిన అవసరం తనకు లేదన్నారు. ఇటువంటి వేధింపులు ఎదుర్కొంటూ రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ‘నీ మీద కోరికతోనే పార్టీ టికెట్ ఇచ్చానని అన్నారు. పక్కన నిలబడితే ఎక్కడెక్కడో చేయి వేస్తారు. హగ్ చేసుకోవడానికి వస్తారు. బిడ్డలాంటి దాన్ని అని చెప్పినా మారరా. మీకు సహకరించకుంటే నా బతుకు నాశనం చేస్తారా. రావాల్సిన నిధులు రాకుండా అడ్డుకుంటారా. దయచేసి ఇప్పటికైనా ఈ అరాచకాలు మానండి. ఇలాంటి వారితో పార్టీకి చెడ్డ పేరు వస్తోంది. ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకోవాలి’ అని తెలిపారు. మరోవైపు తనపై చేస్తున ఆరోపణలపై ఎమ్మెల్యే రాజయ్య స్పందించారు. ఎన్నికలు దగ్గరపడుతున్నాయని, గతంలో జరిగినట్లు రాజకీయ కుట్రలు జరుగుతున్నాయని అన్నారు.ప్రజల్లో లభిస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ఇంటి దొంగలే శిఖండి పాత్ర పోషించి తనను అప్రతిష్టపాలు చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్‌ను కలిసి అన్ని విషయాలు వివరిస్తానని తెలిపారు. త్వరలోనే నిజాలు బయటకు వస్తాయని పేర్కొన్నారు. -
మహిళా సర్పంచ్‌కు వరకట్న వేధింపులు
సాక్షి, జగిత్యాల: భర్తతోపాటు అత్త, మామ, మరిది, ఆడబిడ్డలు, వారి భర్తలు అదనపు కట్నం తేవాలని మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారంటూ రాజారం సర్పంచ్ మమత పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు, బాధితురాలి కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా మల్లాపూర్‌కు చెందిన దుర్శెట్టి శ్రీనివాస్, భారతి దంపతుల రెండో కుమార్తె మమతను ధర్మపురి మండలం రాజారం గ్రామానికి చెందిన అశోక్‌కు ఇచ్చి ఆరేళ్ల క్రితం వివాహం జరిపించారు. వీరికి రజనీకాంత్ (5), హిమశ్రీ (3), దాక్షాయని (10 నెలలు) సంతానం. గత ఎన్నికల్లో మమత సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. భర్తతోపాటు అత్త గంగ, మామ శంకర్, మరిది పూర్ణచందర్, ఆడబిడ్డలు ఎదులాపురం వనిత, తునికి అనిత, వీరి భర్తలు ప్రశాంత్, అనిల్ కలిసి అదనంగా రూ.20 లక్షలు కట్నం కావాలని వేధించడంతోపాటు పలుమార్లు మమతపై దాడులు చేశారు. వేధింపులు భరించలేని మమత శనివారం మల్లాపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిందితులపై చర్యలు తీసుకోవడంతోపాటు తన వద్దనుంచి భర్త అశోక్ తీసుకెళ్లిన పెద్ద కుమారుడిని ఇప్పించాలని కోరారు. దీంతో ఎస్ఐ నవీన్‌కుమార్ నిందితులపై కేసు నమోదు చేశారు. రైల్వే కాంట్రాక్టర్ -
వెక్కిరించిన వారే గెలిపించారు
ఆమెను చూసి నేషనల్ మీడియా కూడా మెచ్చుకుంటోంది. ‘నిన్ను నువ్వు సరిగ్గా చూసుకోలేవు... ఊరినెలా చూసుకుంటావు’ అన్నారు ఆమె మొదటిసారి సర్పంచ్‌గా పోటీ చేసినప్పుడు ఊరి వాళ్లు. అయినా ప్రజా సేవకు తన శారీరక పరిమితులు అడ్డం కావు అనుకుంది నాసిక్‌కు చెందిన కవితా భోండ్వే. ఆమె పని చేయడం మొదలెట్టింది. మార్పును చూపించింది. వెక్కిరించిన నోళ్లు మెచ్చుకోళ్లు మెదలెట్టాయి. అంతేనా? రెండోసారి ఆమెను సర్పంచ్‌గా గెలిపించాయి. గత తొమ్మిదేళ్లుగా సర్పంచ్‌గా ఉన్న కవితా భోండ్వే స్ఫూర్తిగాధ ఇది. తండ్రి 15 ఏళ్ల పాటు పంచాయతీ మెంబర్‌గా ఉన్నాడు. ఉన్నాడు కాని మెల్లమెల్లగా తనకు చదువు రాకపోవడం పంచాయతీ వ్యవహారాల్లో అవరోధంగా మారుతోందని గ్రహించాడు. 2011 సంవత్సరం అది. మహారాష్ట్ర నాసిక్ జిల్లాలోని దిందోరి తాలుకాలో రెండు గ్రామాలకు (దెహెగావ్, వాల్గాగ్) సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి. తన కుమార్తె చదువుకుంది. ఆమెను సర్పంచ్‌గా నిలబెడితే? అనుకున్నాడు. కాని ఆ అమ్మాయికి కుడి కాలికి పోలియో ఉంది. ‘ఏమ్మా పోటీ చేస్తావా?’ అని అడిగాడు ఆ తండ్రి పుండలిక్ భోండ్వే. ‘పోటీ చేస్తాను నాన్నా’ అంది కూతురు కవితా భోండ్వే. ఆ సమయానికి కవిత వయసు 25. అంత చిన్న వయసులో ఆ ప్రాంతంలో ఎవరూ సర్పంచ్ కాలేదు. అందునా స్త్రీ కాలేదు. పైగా శారీరక పరిమితులు ఉన్నవారు అసలే కాలేదు. రెండు ఊళ్లలోనూ ఈ విషయం పెద్ద వేళాకోళంగా మారింది. మగవారు దీనిని సహించలేకపోయారు. ‘నిన్ను నువ్వు సరిగ్గా చూసుకోలేవు. ఊళ్లను ఏం చూస్తావు?’ అని ప్రశ్నించారు. కవిత గంభీరంగా ఆ హేళనను భరించింది. తన ప్రచారం కొనసాగించింది. మెల్లమెల్లగా చాలామంది స్త్రీలు ఆమె పట్టుదలను గమనించారు. ఊరి మగవారు కూడా కొందరు మద్దతుగా నిలిచారు. సర్పంచ్‌గా ఆమె గెలిచింది. ‘వెక్కిరింతలను ఏమాత్రం మనసులోకి తీసుకోకపోవడం వల్లే నేను ముందుకు వెళ్లగలిగాను’ అని కవిత అంటోంది. కవిత పదవిలోకి వచ్చే సరికి ఊళ్లో ఆకతాయిల ఆట సాగుతోంది. కొన్ని సంఘ వ్యతిరేకమైన పనులు సాగుతున్నాయి. వాటిని మొదట నిలువరించింది ఆమె. ఆ తర్వాత రెండు ఊళ్లలోనూ బాలికల చదువు గురించి, రోడ్ల గురించి, మరుగుదొడ్ల గురించి, కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా మంజూరయ్యే ఇళ్ల గురించి పని చేసింది. అవినీతి ఊసు లేకుండా సర్పంచ్ అనే దాష్టీకం లేకుండా హుందాగా పని చేస్తున్న కవితా అతి త్వరగా జనానికి దగ్గరయ్యింది. ‘చిన్న వయసులో సర్పంచ్ అయ్యానని అక్కసు పడ్డవాళ్లు కూడా మెల్లగా నన్ను గుర్తించడం మొదలెట్టారు’ అని కవితా అంది. పదవిలో ఉన్న ఐదేళ్లు కవితకు ఒకటే పని. ఉదయాన్నే సోదరుడు ఆమెను బైక్ మీద దింపితే పంచాయతీ ఆఫీస్‌కు వస్తుంది. పనులు చూసుకుంటుంది. వచ్చినవారి ఇబ్బందులు వింటుంది. జరిగే పనుల అజమాయిషీకి బయలుదేరుతుంది. ఐదేళ్లు గడిచిపోయాయి. మళ్లీ ఎలక్షన్లు వచ్చాయి. ఈసారి ఎలక్షన్లు జరగలేదు. ఎందుకంటే కవితనే ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 34 ఏళ్ల కవిత 9 ఏళ్లుగా సర్పంచ్‌గా పని చేస్తూ మంచి పేరు తెచ్చుకుంది. ఆమె నడక మెల్లగా ఉండవచ్చు. కాని ఆమె సంకల్పం, చిత్తశుద్ధి, అంకితభావం, నిజాయితీ అత్యంత వేగవంతమైనవి. తన రెండు ఊళ్లలో ఆమె స్వయం ఉపాధి గ్రూపులను స్థాపించి స్త్రీల స్వావలంబన కోసం ప్రయత్నిస్తోంది. కవితకు చెట్లు నాటించడం ఇష్టం. గ్రామాల్లో పచ్చదనం కోసం కృషి చేస్తోంది. బహుశా మరికొన్నేళ్లు ఆమె సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికవుతూ రావొచ్చు. ఎందుకంటే ఆ పాలనలో నీడ ప్రజలకు అంత చల్లగా ఉంది. -
‘ఆమె బీజేపీ సర్పంచ్.. అందుకే కింద కూర్చోమన్నా’
జైపూర్ : మహిళా సర్పంచ్‌ను కింద కూర్చోమని అవమానించిన ఓ కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యే తీరు పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వివరాలు.. కాంగ్రెస్ పార్టీ తరఫున తనను గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు చెప్పేందుకు గాను జోధ్‌పూర్ ఎమ్మెల్యే దివ్య మదేర్న ఖేటసార్ గ్రామంలో ఓ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ చందు దేవి కూడా హాజరయ్యారు. ఈ క్రమంలో సదరు సర్పంచ్ వేదిక మీదకు వెళ్లి ఎమ్మెల్యే పక్కన కూర్చోవాలని భావించారు. కానీ దివ్య మదేర్న సర్పంచ్‌ను కింద కూర్చోమని ఆదేశించారు. దాంతో వివాదం రాజుకుంది. ఓ మహిళా ఎమ్మెల్యే అయ్యి ఉండి.. మరో మహిళా సర్పంచ్‌ను ఇలా అవమానించడం మంచి పద్దతి కాదంటూ రాజస్తాన్ సర్పంచ్ సంఘ్ నిరసన వ్యక్తం చేస్తోంది. అంతేకాక సదరు ఎమ్మెల్యే చందూ దేవికి క్షమాపణలు చెప్పాలని.. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరిస్తోంది. ఈ విషయం గురించి ఎమ్మెల్యే దివ్య మదేర్న మాట్లాడుతూ.. ‘సదరు సర్పంచ్ బీజేపీకి చెందిన మహిళ. కాంగ్రెస్ పార్టీ నిర్వహించే కార్యక్రమంలో ఆమెను వేదిక మీదకు ఎలా ఆహ్వానిస్తాం’ అని ప్రశ్నించారు. ఆ తర్వాత మాట మారుస్తూ.. ‘చందు దేవి ముఖంపై ముసుగు వేసుకుని ఉన్నారు. ఆమెను నేను గుర్తు పట్టలేదు. చందు దేవి కూడా అదే గ్రామానికి చెందిన సాధరణ మహిళ అనుకున్నాను. ఆమె వేదిక మీదకు వచ్చి నా పక్కన కూర్చోబోతుండటం చూసి నాకు ఏదైనా హానీ చేస్తుందేమోనని భావించి కింద కూర్చోమని చెప్పాను’ అని తెలిపారు. ఏది ఏమైనా మహిళా ఎమ్మెల్యే అయ్యి ఉండి సాటి మహిళను గౌరవించకపోవడం దారుణమంటూ విమర్శిస్తున్నారు నెటిజన్లు. -
జన్మభూమిలో భర్తల పెత్తనం
తుమ్మపాల (అనకాపల్లి): ప్రజాప్రతినిధులైన తమ భార్యల తరఫున అధికార పార్టీ నేతలు జన్మభూమి–మా ఊరు కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా పెత్తనం చెలాయిస్తున్నారు. అనకాపల్లి మండలంలో జరుగుతున్న సభలకు ఎంపీపీ కొణతాల వెంకటసావిత్రి తరఫున ఆమె భర్త శ్రీను హాజరై ప్రసంగాలు చేస్తున్నారు. అదే కోవలో గ్రామాలలో జరుగుతున్న సభలకు మహిళా సర్పంచ్‌లు, ఎంపీటీసీల తరఫున వారి భర్తలు పాల్గొంటూ హంగామా చేస్తున్నారు. అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ప్రొటోకాల్ పాటించాల్సిన అధికారులు కూడా ఈ విషయంలో మిన్నకుండిపోతున్నారు. జన్మభూమి సభలకు ప్రత్యేకంగా నియమించిన సీనియర్ అధికారుల పక్కనే సూపర్ సర్పంచ్‌లు, సూపర్ ఎంపీటీసీలు కూర్చుని అజమాయిషీ చేస్తున్నారు. రేబాకలో మంగళవారం జరిగిన జన్మభూమి–మా ఊరు సభలో కొందరు మరుగుదొడ్ల బిల్లుల గురించి ప్రశ్నించగా.. సర్పంచ్ భర్త సత్తిబాబు కలుగజేసుకొని మరీ పాత వాటికి బిల్లులు చెల్లించరని చెప్పేశారు. కాపుశెట్టివానిపాలెం గ్రామానికి ఒక వ్యక్తి ఇదే సమస్యపై ప్రశ్నించగా ఎంపీటీసీ భర్త చిన్నారావు అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
వికృత చేష్టలు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు : జిల్లాలో ఒక ఎస్సై వికృత చేష్టలకు దిగారు. వివాహిత.. అందులోనూ సర్పంచ్‌తో అసభ్యంగా మాట్లాడారు. లైంగిక వేధింపులకు గురిచేస్తూ సెల్ఫోన్లో సంభాషించాడు. చివరకు బాధితు రాలు ఎస్సై మాటలను వాయిస్ రికార్డ్ చేసి ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణకు అందజేయడంతో సదరు ఎస్సైను తొలుత వీఆర్‌కు పంపారు. వెనువెంటనే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ వ్యవహారం జిల్లా పోలీసు శాఖలో తీవ్ర కలకలం రేపింది. గతంలోనూ ఈ తరహా ఘటనలు అనేకం చోటుచేసుకోగా.. కొన్ని కేసుల్లో పోలీసులపై చర్యలు తీసుకున్నారు. మరికొన్ని కేసులను పట్టించుకోకపోవడం గమనార్హం. తాజా ఘటనలో సైదాపురం ఎస్సై కె.ఏడుకొండలు సస్పెండయ్యారు. దీనివెనుక వెనుక పాత వ్యవహారాలు, కుట్రకోణం దాగి ఉన్నాయని ఓ వర్గం చెబుతోంది. కానిస్టేబుల్ స్థాయి నుంచి ఎస్సైగా.. 2015 నుంచి సైదాపురం ఎస్సైగా పనిచేస్తున్న ఏడుకొండలు 2003లో కానిస్టేబుల్‌గా విధుల్లో చేరారు. ఆ తర్వాత రిజర్వ్ ఎస్సైగా ఎంపికయ్యారు. 2010లో సివిల్ ఎస్సైగా కన్వర్షన్ అయి నల్గొం డ రైల్వే, తెనాలి, వింజమూరులో ఎస్సైగా పనిచేశారు. సైదాపురం మండలం ఊటుకూరుకు చెందిన సర్పంచ్ మంచు పద్మజతో ఎస్సై అసభ్యకరంగా మాట్లాడారు. కొద్దిరోజుల నుంచి లైంగికంగా వేధించేలా మాట్లాడుతూ పరోక్షంగా కోరిక తీర్చమని ఒత్తిడి చేస్తూ సంభాషణలు జరిపినట్టు ఆరోపణలొచ్చాయి. ఈ క్రమంలో సర్పంచ్ పద్మజ గురువారం ఎస్పీ కార్యాలయానికి వచ్చి జరిగిన ఘటనపై రాతపూర్వక ఫిర్యాదు చేశారు. ఎస్సై ఆమెతో మాట్లాడిన సంభాషణరికార్డులను అధికారులకు అందజేశారు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం ఎస్సైను వీఆర్‌కు పంపగా శుక్రవారం దీనిపై ప్రాథమిక విచారణ నిర్వహించి ఎస్సైను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ వ్యవహారం వెనుక పొలం వివాదం ఉందని ఆరోపణలున్నాయి. పద్మజ కుటుంబసభ్యులకు, స్థానికంగా ఉన్న మోడుబోయిన సుబ్బారావుకు 1.5 ఎకరాల భూమికి సంబంధించిన వివాదం కొంతకాలంగా ఉంది. ఈ క్రమంలో సుబ్బారావుకు, పద్మజ కుటుంబసభ్యుల మధ్య తరచూ గొడవలు జరగడం, సుబ్బారావు ప్రైవేటు కేసు దాఖలు చేయడంతో పద్మజ కుటుంబ సభ్యులపై పోలీసులు మూడు పర్యాయాలు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రెండు కేసుల్లో స్టేషన్ బెయిల్ వెంటనే ఇచ్చారు. ఈ క్రమంలో బుధవారం పద్మజ కుటుంబ సభ్యులను ఎస్సై ఏడుకొండలు ఒక కేసులో అరెస్ట్ చేశారు. ఆ కేసుకు సంబంధించి స్టేషన్ బెయిల్ ఇవ్వలేదు. దీంతో పద్మజ, ఎస్సై మధ్య వివాదం రావడంతో ఆమె ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అయితే పోలీసులు ఈ ఘటనపై సమగ్రంగా విచారణ నిర్వహిస్తున్నారు. జిల్లాలో ఇదే తరహా ఘటనలు గతంలోనూ చోటుచేసుకున్నాయి. ఆరేళ్ల క్రితం బాలాజీనగర్ స్టేషన్లో సీఐగా పనిచేసిన రామరాజు ఓ వివాహితను లైంగికంగా వేధించాడు. దీంతో ఆమె హైదరాబాద్‌లో మీడియాను ఆశ్రయించి రామరాజుపై ఫిర్యాదు చేయడంతో అతడ్ని సస్పెండ్ చేశారు. ఇదే తరహాలో కలిగిరిలో ఓ సీఐ కూడా వివాహితను వేధించారు. అప్పుడూ వాయిస్ సంభాషణలతో సహా సదరు వివాహిత ఫిర్యాదు చేసింది. సదరు సీఐకి రాజకీయ పరపతి ఉండటంతో ప్రాథమికంగా విచారించి చర్యలు తీసుకోకుండా వదిలేశారు. ఐదేళ్లలో జిల్లాలో ఈ తరహాఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. కొన్ని కేసుల్లో చర్యలు ఉంటున్నప్పటికీ కొందరి పోలీసుల తీరులో మార్పు రాకపోవడం గమనార్హం. -
మహిళ సర్పంచ్‌కు మోహన్ బాబు ప్రశంసలు
చంద్రగిరి: ప్రముఖ సినీ హీరో మంచు మోహన్ బాబు ఓ మహిళను ప్రత్యేకంగా అభినందించారు. తెలంగాణ ఆడబిడ్డ ఆంధ్రప్రదేశ్‌కు కోడలుగా వచ్చి, సర్పంచ్‌గా ఎన్నికై ప్రజలకు సేవ చేస్తున్నారంటూ.. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం రామిరెడ్డిపల్లి సర్పంచ్ కొటాల పద్మజను మోహన్ బాబు ప్రశంసించారు. సోమవారం రామిరెడ్డిపల్లిలో నిర్వహించిన జల్లికట్టు ప్రదర్శనకు మోహన్ బాబు, ఆయన కుమారుడు యువ హీరో మంచు మనోజ్, స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరెడ్డి హాజరయ్యారు. గ్రామస్తులతో కలసి జల్లికట్టు ప్రదర్శనను తిలకించారు. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ.. తనకు కొన్ని సిద్ధాంతాలున్నాయని, ఆవులను, జంతువులను హింసించరాదని అన్నారు. పశువులను హింసించకుండా తరతరాలుగా వస్తున్న జల్లికట్టు ఆట నిర్వహించడాన్ని తప్పుపట్టరాదని చెప్పారు. సర్పంచ్ పద్మజను అభినందించారు. పశువులను హింసించకుండా సాంప్రదాయబద్ధంగా జల్లికట్టు నిర్వహించుకోవచ్చని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. తమ ఆహ్వానం మేరకు గ్రామానికి వచ్చిన మోహన్ బాబు, మనోజ్ కుమార్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలకు సర్పంచ్ పద్మజ కృతజ్ఞతలు తెలిపారు. -
సర్పంచ్ దాడి కేసులో ఆరుగురు అరెస్ట్
-
మహిళా సర్పంచ్ ఆత్మహత్య
స్టేషన్‌ఘన్‌పూర్ : వరంగల్ జిల్లాలోని స్టేషన్‌ఘన్‌పూర్ మండలంలోని నష్కల్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ మహిళా సర్పంచ్ నంగులూరి మాధవి(42) ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే... శనివారం మాధవి తన ఇంట్లో ఉన్న కుక్కల మందు తాగి ఆత్మహత్యకు యత్నించగా... గమనించిన కుటుంబసభ్యులు హుటాహుటిన ఎంజీఎం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ఆమె మరణించారు. కాగా ఈ మధ్య భర్త చంద్రమౌళి మాధవిపై అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయమై తరచూ వేధింపులకు గురిచేస్తుండటంతో మాధవి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. భర్త చంద్రమౌళి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
సర్పంచ్ అయినా..చిన్నచూపే
ఇసుక మేటల మధ్య ఓ చిన్న పూరిగుడిసెలో ఉన్న ఆ కుటుంబానికి కూలిపనులే ఆధారం. కూలిపనులు లేని రోజు పస్తులే. ఇంతటి దీనస్థితిలో ఉన్న ఆ కుటుంబంఓ సర్పంచ్దంటే నమ్ముతారా. రిజర్వేషన్ పుణ్యమా అని ఆ ఇంట ఉన్న మహిళకు సర్పంచ్‌గిరీ దక్కినా..ఒక్కరోజు కూడా పంచాయతీ గడప తొక్కింది లేదు. ఒక్క సంతకమూ చేసింది లేదు. అంతా తానై నడిపే ఉప సర్పంచ్ హవా ముందు ఆమె చిన్నబోయింది. వేటపాలెం, న్యూస్‌లైన్ : పంచాయతీ వార్డుమెంబర్ అయితే చాలు రెండుచేతులా సంపాదిస్తున్న రోజులివి. కానీ తుపాకుల నాగమ్మ పరిస్థితి ఇందుకు పూర్తిభిన్నం. ఒక పంచాయతీకి సర్పంచ్ అయినా ఆమె జీవితంలో వెలుగు నిండలేదు. చల్లారెడ్డిపాలెం పంచాయతీ సర్పంచ్ ఎస్టీలకు రిజర్వ్ అయింది. ఆ పంచాయతీ పరిధిలోని కఠారివారిపాలెంలో ఊరికి దూరంగా ఇసుక భూముల్లో గుడిసెలు వేసుకుని నివసిస్తున్న 15 యానాది కుటుంబాల్లో నాగమ్మ కుటుంబం ఒకటి. ఇక్కడివారంతా సరుగుడు తోటల్లో కర్రకొట్టే పనిచేసుకుంటుంటారు. పనుల్లేకపోతే పస్తులుంటారు. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న నాగమ్మకు అనుకోకుండా ఓ అవకాశం దక్కింది. ఊరిపెద్దలంతా కలిసి సర్పంచ్ చేస్తామన్నారు. సర్పంచ్ అయితే తమ జీవితాలు బాగుపడతాయని ఆశించిన నాగమ్మ అందుకు సరేనంది. సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైంది. సర్పంచ్ విధులేమిటి..అధికారాలేమిటో కూడా తెలియని నాగమ్మను నామమాత్రం చేసి..ఉపసర్పంచ్ అంతా తానై నడిపిస్తున్నాడు. సర్పంచ్ అయి ఆరు నెలలు కావస్తున్నా..ఇంత వరకు అసలామె పంచాయతీ కార్యాలయం గడప తొక్కలేదు. పంచాయతీ సమావేశాల్లో పాల్గొనలేదు. అభివృద్ధికి సంబంధించిన ఫైళ్లలో ఒక్క సంతకమూ చేయలేదు. సర్పంచ్‌గా పంచాయతీ అభివృద్ధి చేయడం సంగతి దేవుడెరుగు..కనీసం తానుండే యానాది సంఘంలోనూ కనీస వసతులు సమకూర్చుకోలేని నిస్సహాయ స్థితిలో ఉందామె. యానాది సంఘంలో విద్యుత్ వసతి లేదు. అక్కడున్న 15 కుటుంబాల వారూ కటిక చీకట్లో..కిరోసిన్ దీపాల వెలుతురుతో కాలం నెట్టుకొస్తున్నారు. సంఘానికి వెళ్లేందుకు దారిలేదు. తాగేందుకు, ఇతర అవసరాలకు సంఘం మొత్తానికి ఒకటే చేతిపంపు. సగం మందికి రేషన్కార్డుల్లేవు. నాగమ్మ కుటుంబానికీ రేషన్‌కార్డు లేదు. నిధుల్లేక పనులు చేయలేదు.. ఎస్.కేశవరావు, చల్లారెడ్డిపాలెం పంచాయతీ కార్యదర్శి పంచాయతీ ఎన్నికల తరువాత నిధులు లేకపోవడంతో ఎటువంటి అభివృద్ధి పనులు చేయలేదు. సర్పంచ్ అనుమతితో లక్ష రూపాయల విలువైన వీధి దీపాలు కొనుగోలు చేశాం. ఇప్పటి వరకు పంచాయతీ కార్యాలయంలో మూడుసార్లు సాధారణ సమావేశాలు జరిగాయి. మూడు సమావేశాలూ సర్పంచ్ నాగమ్మ అధ్యక్షతనే నిర్వహించాం. సర్పంచ్‌కు సంతకం రాకపోవడంతో తీర్మానం పుస్తకంలో వేలిముద్ర వేశారు. పదవున్నా..లేకున్నా ఒకటే.. తుపాకుల నాగమ్మ, చల్లారెడ్డిపాలెం సర్పంచ్ అసలు సర్పంచ్ పదవి ఎవరిమ్మన్నారు. వాళ్లు వచ్చి నిన్ను సర్పంచ్‌ని చేస్తామన్నారు. పదవొస్తే..మా బతుకులు బాగుపడతాయనుకున్నాం. ఎన్నికలప్పుడు హడావిడి చేశారు. తరువాత మా గురించి పట్టించుకున్నోళ్లే లేరు. పంచాయతీలో జరిగే ఏ మీటింగు గురించీ ఇంత వరకు నాకు కబురు చేయలేదు. అన్నీ ఉపసర్పంచ్ చూసుకుంటారు. నాకు సర్పంచ్ పదవి ఉన్నా ఒకటే..లేకున్నా ఒకటే. కనీసం మాకు రేషన్‌కార్డు కూడా లేదు. ఉండేందుకు సరైన ఇల్లు లేదు. నాకు సంతకం చేయడం వచ్చు. కానీ పంచాయతీ రికార్డుల్లో ఎక్కడా ఒక్క సంతకం కూడా చేయలేదు. వేలిముద్రలూ వేయలేదు. అన్నీ అధికారులే చూసుకుంటారు. పంచాయతీ గురించి ఏ సమాచారమూ చెప్పరు. -
అమెరికా సదస్సుకు ఒడిశా మహిళా సర్పంచ్
భువనేశ్వర్: ఆరతీ దేవి (28) అనే ఒడిషాకు చెందిన మహిళా సర్పంచికి ఫిబ్రవరిలో అమెరికాలో జరిగే ఓ ప్రతిష్టాత్మక అంతర్జాతీయ నాయకత్వ సదస్సులో దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కింది. ఇంటర్నేషనల్ విజిటర్స్ లీడర్షిప్ ప్రోగాం (ఐవీఎల్పీ)గా పిలిచే ఈ మూడు వారాల కార్యక్రమానికి భారత్ నుంచి ఆమె ఒక్కరే ఎంపికవడం విశేషం. గంజాం జిల్లాలోని ధుంకపరా అనే మారుమూల గ్రామ సర్పంచి అయిన ఆరతి, హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్ జనరల్ ఫోన్ చేసి విషయం చెప్పగానే ఒక్కసారిగా ఆశ్చర్యానందాలకు లోనయ్యానన్నారు. ఇల్లినాయీ రాష్ట్రంలోని స్ప్రింగ్ఫీల్డ్లో జరిగే ఈ సదస్సులో రాష్ట్ర ప్రభుత్వ పనితీరు, పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం తదితరాలపై ఆమె మాట్లాడతారు. పర్యటన ఖర్చులన్నీ అమెరికానే భరిస్తుంది. ఎంబీఏ పట్టభద్రురాలైన ఆరతి, సర్పంచ్ గా ఎన్నికవడం కోసం ఐడీబీఐలో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ ఉద్యోగాన్ని కూడా వదులుకోవడం విశేషం. వయోజన విద్యా కార్యక్రమం, తదితరాలతో కొద్దికాలంలోనే ఊరి రూపురేఖలే మార్చేసి జేజేలందుకున్నారు. మన దేశం నుంచి మాజీ ప్రధానులు ఇందిరాగాంధీ, అటల్ బిహారీ వాజ్‌పేయి, మాజీ రాష్ట్రపతులు కేఆర్ నారాయణన్, ప్రతిభా పాటిల్ ఐవీఎల్పీలో గతంలో పాల్గొన్నారు. -
మహిళా సర్పంచ్ సజీవదహనం
మహబూబ్‌నగర్: జిల్లాలో ఓ మహిళా సర్పంచ్‌పై కొందరు దుండగులు కిరోసిన్ పోసి నిప్పంటించి సజీవదహనం చేశారు. మద్దూరు మండలం మన్నాపూర్‌లో ఈ దారుణం జరిగింది. మన్నాపూర్ సర్పంచ్ మాణిక్యమ్మ పొలం నుంచి వస్తుందడగా కొందరు దుండగులు ఆమెపై దాడి చేశారు. ఆమె శరీరంపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. దాంతో ఆమె సజీవదహనం అయ్యారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో యువతిపై ఓ యువకుడు ఈరోజే పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆ యువతికి మూడు రోజుల్లో పెళ్లి. నవీన్ అనే పెయింటర్ ప్రేమిస్తున్నానని రేవతి అనే యువతి వెంటపడుతున్నాడు. ప్రేమ తిరస్కరించడంతో ఆ యువతి శరీరంపై పెట్రోల్ పోసి నిప్పంటించి పారిపోయాడు. ఆ యువతి 60 శాతం కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.