సర్పంచ్ అయినా..చిన్నచూపే | a women sarpanch lives in hut | Sakshi
Sakshi News home page

సర్పంచ్ అయినా..చిన్నచూపే

Published Sat, May 24 2014 3:43 AM | Last Updated on Sat, Sep 2 2017 7:45 AM

సర్పంచ్ అయినా..చిన్నచూపే

సర్పంచ్ అయినా..చిన్నచూపే

 ఇసుక మేటల మధ్య ఓ చిన్న పూరిగుడిసెలో ఉన్న ఆ కుటుంబానికి కూలిపనులే ఆధారం. కూలిపనులు లేని రోజు పస్తులే. ఇంతటి దీనస్థితిలో ఉన్న ఆ కుటుంబంఓ సర్పంచ్‌దంటే నమ్ముతారా. రిజర్వేషన్ పుణ్యమా అని ఆ ఇంట ఉన్న మహిళకు సర్పంచ్‌గిరీ దక్కినా..ఒక్కరోజు కూడా పంచాయతీ గడప తొక్కింది లేదు. ఒక్క సంతకమూ చేసింది లేదు. అంతా తానై నడిపే ఉప సర్పంచ్ హవా ముందు ఆమె చిన్నబోయింది.
 

వేటపాలెం, న్యూస్‌లైన్ : పంచాయతీ వార్డుమెంబర్ అయితే చాలు రెండుచేతులా సంపాదిస్తున్న రోజులివి. కానీ తుపాకుల నాగమ్మ పరిస్థితి ఇందుకు పూర్తిభిన్నం. ఒక పంచాయతీకి సర్పంచ్ అయినా ఆమె జీవితంలో వెలుగు నిండలేదు. చల్లారెడ్డిపాలెం పంచాయతీ సర్పంచ్ ఎస్టీలకు రిజర్వ్ అయింది. ఆ పంచాయతీ పరిధిలోని కఠారివారిపాలెంలో ఊరికి దూరంగా ఇసుక భూముల్లో గుడిసెలు వేసుకుని నివసిస్తున్న 15 యానాది కుటుంబాల్లో నాగమ్మ కుటుంబం ఒకటి. ఇక్కడివారంతా సరుగుడు తోటల్లో కర్రకొట్టే పనిచేసుకుంటుంటారు. పనుల్లేకపోతే  పస్తులుంటారు.

ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న నాగమ్మకు అనుకోకుండా ఓ అవకాశం దక్కింది. ఊరిపెద్దలంతా కలిసి సర్పంచ్ చేస్తామన్నారు. సర్పంచ్ అయితే తమ జీవితాలు బాగుపడతాయని ఆశించిన నాగమ్మ అందుకు సరేనంది. సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైంది. సర్పంచ్ విధులేమిటి..అధికారాలేమిటో కూడా తెలియని నాగమ్మను నామమాత్రం చేసి..ఉపసర్పంచ్ అంతా తానై నడిపిస్తున్నాడు. సర్పంచ్ అయి ఆరు నెలలు కావస్తున్నా..ఇంత వరకు అసలామె పంచాయతీ కార్యాలయం గడప తొక్కలేదు. పంచాయతీ సమావేశాల్లో పాల్గొనలేదు.

అభివృద్ధికి సంబంధించిన ఫైళ్లలో ఒక్క సంతకమూ చేయలేదు. సర్పంచ్‌గా పంచాయతీ అభివృద్ధి చేయడం సంగతి దేవుడెరుగు..కనీసం తానుండే యానాది సంఘంలోనూ కనీస వసతులు సమకూర్చుకోలేని నిస్సహాయ స్థితిలో ఉందామె. యానాది సంఘంలో విద్యుత్ వసతి లేదు. అక్కడున్న 15 కుటుంబాల వారూ కటిక చీకట్లో..కిరోసిన్ దీపాల వెలుతురుతో కాలం నెట్టుకొస్తున్నారు. సంఘానికి వెళ్లేందుకు దారిలేదు. తాగేందుకు, ఇతర అవసరాలకు సంఘం మొత్తానికి ఒకటే చేతిపంపు. సగం మందికి రేషన్‌కార్డుల్లేవు. నాగమ్మ కుటుంబానికీ రేషన్‌కార్డు లేదు.

నిధుల్లేక పనులు చేయలేదు..
ఎస్.కేశవరావు, చల్లారెడ్డిపాలెం పంచాయతీ కార్యదర్శి పంచాయతీ ఎన్నికల తరువాత నిధులు లేకపోవడంతో ఎటువంటి అభివృద్ధి పనులు చేయలేదు. సర్పంచ్ అనుమతితో లక్ష రూపాయల విలువైన వీధి దీపాలు కొనుగోలు చేశాం. ఇప్పటి వరకు పంచాయతీ కార్యాలయంలో మూడుసార్లు సాధారణ సమావేశాలు జరిగాయి. మూడు సమావేశాలూ సర్పంచ్ నాగమ్మ అధ్యక్షతనే నిర్వహించాం. సర్పంచ్‌కు సంతకం రాకపోవడంతో  తీర్మానం పుస్తకంలో వేలిముద్ర వేశారు.  

పదవున్నా..లేకున్నా ఒకటే.. తుపాకుల నాగమ్మ, చల్లారెడ్డిపాలెం సర్పంచ్
అసలు సర్పంచ్ పదవి ఎవరిమ్మన్నారు. వాళ్లు వచ్చి నిన్ను సర్పంచ్‌ని చేస్తామన్నారు. పదవొస్తే..మా బతుకులు బాగుపడతాయనుకున్నాం. ఎన్నికలప్పుడు హడావిడి చేశారు. తరువాత మా గురించి పట్టించుకున్నోళ్లే లేరు. పంచాయతీలో జరిగే ఏ మీటింగు గురించీ ఇంత వరకు నాకు కబురు చేయలేదు.

 

అన్నీ ఉపసర్పంచ్ చూసుకుంటారు. నాకు సర్పంచ్ పదవి ఉన్నా ఒకటే..లేకున్నా ఒకటే. కనీసం మాకు రేషన్‌కార్డు కూడా  లేదు. ఉండేందుకు సరైన ఇల్లు లేదు. నాకు సంతకం చేయడం వచ్చు. కానీ పంచాయతీ రికార్డుల్లో ఎక్కడా ఒక్క సంతకం కూడా చేయలేదు. వేలిముద్రలూ వేయలేదు. అన్నీ అధికారులే చూసుకుంటారు. పంచాయతీ గురించి ఏ సమాచారమూ చెప్పరు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement