Panchayat Sarpanch
-
పూడురు సర్పంచ్.. ఒకరోజు ఆమె, మరొకరోజు ఆయన.. ఏంటీ మాకీ కన్ఫ్యూజన్!
మండలంలోని మేజర్ పంచాయతీలలో పూడూర్ గ్రామ పంచాయతీ ఒకటి. పూడూర్ గోసాయిగూడ గ్రామాలు కలిపి పూడూర్ గ్రామ పంచాయతీగా ఉంది. అలాంటి పూడూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ సీట్లో సస్పెన్షకు గురైన వ్యక్తి ఒకరోజు, ఉపసర్పంచ్‌గా అవిశ్వాసంతో ఉపసర్పంచ్ పదవి కోల్పోయిన వ్యక్తి మరొక రోజు సర్పంచ్ సీట్లో కూర్చుంటూ గ్రామస్తులను అయోమయంలో పడేస్తున్నారు. అధికారులు ఏ విషయం ఖచ్చితంగా తేల్చకపోవడంతో ఎవరికి వారే సర్పంచ్‌గా కొనసాగుతుండటం గమనార్హం. సాక్షి,మేడ్చల్: పూడూర్ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికల్లో సర్పంచ్‌గా బాబుయాదవ్‌ను ప్రజలు ఎన్నుకున్నారు. అదే సమయంలో 7వ వార్డు నుంచి వార్డు సభ్యురాలిగా ఎన్నికైన జ్యోతిరెడ్డిని వార్డుసభ్యులు ఉపసర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇద్దరు కాంగ్రెస్ పార్టీలో ఉండటంతో అంతా సాఫీగా సాగింది. తదనంతరం మారిన రాజకీయ సమీకరణాలతో బాబుయాదవ్ టీఆర్ఎస్లో చేరారు. గత ఫిబ్రవరిలో బాబుయాదవ్ ఓ రియల్ ఎస్టెట్ వెంచర్ ఏర్పాటు వ్యవహారంలో లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. దీంతో జిల్లా అధికారులు బాబుయాదవ్‌ను సర్పంచ్ పదవి నుంచి తొలగించి ఉపసర్పంచ్ జ్యోతికి సర్పంచ్ బాధ్యతలు అప్పగించారు. అదే సమయంలో జ్యోతిరెడ్డి కాంగ్రెస్ నుంచి మంత్రి మల్లారెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. అవిశ్వాసంలో పదవి కోల్పోయి.. తిరిగి ఇన్చార్జ్ సర్పంచ్‌గా బాధ్యతులు ఈ క్రమంలో వార్డు సభ్యులు ఉపసర్పంచ్ జ్యోతిపై అవిశ్వాస తీర్మానం పెట్టారు. అది నెగ్గడంతో ఉపసర్పంచ్ పదవి కోల్పోయింది. దీంతో సర్పంచ్, ఉపసర్పంచ్ స్థానాలు రెండు ఖాళీ కావడంతో ఒక వార్డుమెంబర్‌కు ఇన్చార్జ్ సర్పంచ్ బాధ్యతుల అప్పగించాల్సి ఉండగా.. తిరిగి 7వ వార్డు సభ్యురాలైన జ్యోతిరెడ్డి ఇన్చార్జ్ సర్పంచ్‌గా అధికారులు నియమించారు. కోర్టు ఆర్డర్‌తో సర్పంచ్‌గా బాబుయాదవ్.. రెండు నెలలు తర్వాత బెయిల్‌పై వచ్చిన బాబుయాదవ్ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. దీంతో బాబుయాదవ్ తిరిగి బాధ్యతలు తీసుకుని సర్పంచ్‌గా కొనసాగుతున్నారు. బాబుయాదవ్ కేవలం తప్పుడు పత్రాలతో ఎలాంటి అధికారిక పత్రాలు చూపెట్టకుండా సర్పంచ్ కుర్చీలో కూర్చుంటున్నాడని.. ఆయన సర్పంచ్‌గా ఉండటానికి అధికారుల నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని జ్యోతి తిరిగి గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ కుర్చీలో కూర్చుంటున్నారు. దీంతో పూడూర్ సర్పంచ్ ఎవరో తెలియక గ్రామస్తులు అయోమయంలో ఉన్నారు. జాతరకు ముందే సర్పంచ్ ఎవరో తేల్చాలి.. గ్రామంలో ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి పోచమ్మ, మైసమ్మ జాతరను వారం రోజుల పాటు నిర్వహిస్తారు. ఆ జాతర మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. జాతర సాఫీగా జరగాలంటే గ్రామంలో సర్పంచ్ ఎవరో ముందుగా అధికారులు తేల్చాలి. లేకుంటే రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనే అవకాశం ఉంటుందని స్థానిక నాయకులు అంటున్నారు. ఒత్తిళ్లతోనే ఆర్డర్‌ను ఆమోదించడం లేదా? దీనికి పుల్‌స్టాప్ పెట్టాలంటే కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం పూడూర్ సర్పంచ్‌గా బాబుయాదవ్ పేరును జిల్లా అధికారులు అధికారికంగా ప్రకటించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. కోర్టు ఉత్తర్వులను జిల్లా ఉన్నతాధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదనేది అందరిలో నెలకొన్న ప్రశ్న. ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లతోనే కోర్టు ఆర్డర్‌ను ఆమోదించడం లేదని అందరూ బాహాటంగానే అనుకుంటున్నారు. మరి దీనిపై జిల్లా ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకుంటారో లేదో వేచి చూడాలి. నాకు ఎలాంటి ఉత్తర్వులు అందలేదు బాబుయాదవ్ సస్పెన్షకు గురికావడంతో జిల్లా కలెక్టర్ నన్ను పూడూర్ ఇన్చార్జ్ సర్పంచ్‌గా నియమించారు. అధికారులు పదవి అప్పగిస్తే సర్పంచ్ సీట్లో కూర్చున్నాను. çబాబుయాదవ్‌ను తిరిగి సర్పంచ్‌గా నియమించినట్లు నాకు ఎలాంటి ఉత్తర్వులు అందలేదు. ఆయన తానే సర్పంచ్‌ను అంటూ గ్రామస్తులు, అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో కూర్చుంటూ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారు – జ్యోతిరెడ్డి న్యాయస్థానం ఉత్తర్వుల అనుగుణంగానే.. జిల్లా కలెక్టర్ సర్పంచ్ పదవి నుంచి నన్ను తొలగించడంతో హైకోర్టును ఆశ్రయించాను. సర్పంచ్‌గా నన్నే కొనసాగించాలంటూ న్యాయస్థానాన్ని కోరాను. ఏప్రిల్ 11న ఇన్చార్జ్ సర్పంచ్ జ్యోతిని పదవి నుంచి తొలగిస్తూ నన్ను సర్పంచ్‌గా కొనసాగించాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో న్యాయస్థానం ఆర్డర్ కాపీలను జిల్లా కలెక్టర్, డీపీఓ, గ్రామస్థాయి అధికారులకు అందజేశాను. పిటిషన్లో జ్యోతిని సైతం పార్ట్ చేశాను. న్యాయస్థానం ఉత్తర్వుల అనుగుణంగానే.. అధికారుల ఆదేశానుసారమే నేను తిరిగి సర్పంచ్ బాధ్యతలు చేపట్టాను. స్వార్థ రాజకీయాలతో జ్యోతి వర్గీయులు గ్రామస్తులను తప్పుదోవ పట్టిస్తున్నారు. శుక్రవారం జ్యోతి సర్పంచ్ సీట్లో కూర్చోవంపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశాను. – బాబుయాదవ్ ప్రస్తుతానికి బాబుయాదవే సర్పంచ్ కోర్టు ఎవరిని ఉండమంటే వారే సర్పంచ్. పూడూర్ విషయంపై జిల్లా పంచాయతీ అధికారి రమణమూర్తి వివరణ కోరితే ఆయన నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. కొత్తగా అడుగుతారేంటి అక్కడ మొన్నటి వరకు ఎవరు ఉంటే వారే సర్పంచ్‌గా ఉంటారు. కోర్టు బాబుయాదవ్‌ను సర్పంచ్‌గా నియమించింది. ఆయనే సర్పంచ్‌గా కొనసాగుతారు. శుక్రవారం జ్యోతి సీట్లో కూర్చుంది కదా అని అడగగా తనకు తెలియదని... ఉదయం కూర్చుంటే కూర్చుండొచ్చు కాని ప్రస్తుతానికి బాబుయాదవే సర్పంచ్. – డీపీఓ రమణమూర్తి చదవండి: అయ్యో మౌనిక.. ప్రమాదం అని తెలియక మృత్యువు పక్కనే కూర్చున్నావా! -
భార్యలు సర్పంచ్‌లు.. భర్తలు కాంట్రాక్టర్లు!
సాక్షి, హైదరాబాద్: మహిళా సాధికారితలో భాగంగా పంచాయతీ సర్పంచ్‌లుగా మహిళలను నియమిస్తే, వారి భర్తలు అధికారం చెలాయిస్తున్నారంటూ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. స్వచ్ఛ భారత్ కింద పంచాయతీలకు వస్తున్న నిధులను మహిళా సర్పంచ్ల భర్తలు తమ జేబుల్లో వేసుకుంటున్నారని ఆక్షేపించింది. భార్యలు సర్పంచ్‌లుగా పని చేస్తుంటే, భర్తలు కాంట్రాక్టర్లుగా, బినామీ పేర్లతో పనులు చేస్తూ నిధులను స్వాహా చేస్తున్నారని పేర్కొంది. ఇటువంటి వాటిని యుద్ధ ప్రాతిపదికన కఠినంగా అణిచివేయాల్సిన అవసరం ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. గ్రామ పంచాయతీల పరిధిలో స్వచ్ఛ భారత్ కింద చేపడుతున్న మరుగుదొడ్ల నిర్మాణాల్లో పెద్ద ఎత్తున నిధుల దుర్వినియోగం జరుగుతోందని తేల్చిన హైకోర్టు, దీనిపై లోతుగా విచారణ జరిపి నివేదిక సమర్పించాలని తెలంగాణ అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్ (ఏసీబీ డీజీ)ని ఆదేశించింది. ఏవైనా మూడు నాలుగు పంచాయతీలను ఎంపిక చేసుకుని స్వచ్ఛ భారత్ కింద ఎంత మేర నిధులు వచ్చాయి.. ఎంత మేర పనులు జరిగాయి.. ఎంత దుర్వినియోగం జరిగింది తదితర వివరాలను తమ ముందుంచాలని చెప్పింది. అలాగే స్వచ్ఛ భారత్ కింద విడుదల చేసిన నిధులు, వాటి సద్వినియోగం తదితర వివరాలను తమ ముందుంచాలని స్వచ్ఛ భారత్ డైరెక్టర్‌ను ఆదేశించింది. తదుపరి విచారణను జనవరి 3కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృ ష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్ల ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. సొంత ఖాతాల్లోకి నిధులు... మెదక్ జిల్లా, నార్సింగి గ్రామ పంచాయతీ పరిధిలో స్వచ్ఛ భారత్ కింద చేపట్టిన మరుగుదొడ్ల నిర్మాణంలో రూ.40 లక్షల మేర నిధులు దుర్వినియోగం అయ్యాయని, ఈ నిధులను సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, బిల్ కలెక్టర్లు తమ సొంత ఖాతాలకు మళ్లించుకున్నారని, దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ ఆ గ్రామానికి చెందిన ఎం.శేఖర్‌రెడ్డి హైకోర్టుకు లేఖ రాశారు. ఈ లేఖను హైకోర్టు ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)గా పరిగణించి విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. గత వారం ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన ధర్మాసనం, నిధుల దుర్వినియోగంపై ఏసీబీ విచారణకు ఆదేశించింది. అలాగే జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నుంచి ధర్మాసనం నివేదిక కోరింది. తాజాగా మంగళవారం ఈ వ్యాజ్యం విచారణకు రాగా, ఏసీబీ తరఫు న్యాయవాది తమ నివేదికను కోర్టు ముందుంచారు. అలాగే న్యాయసేవాధికార సంస్థ తరఫు న్యాయవాది జె.అనిల్‌కుమార్ తమ నివేదికను కోర్టుకు సమర్పించారు. కఠిన చర్యలు తీసుకోవాలి... ‘స్వచ్ఛ భారత్‌లో భాగంగా మరుగుదొడ్ల నిర్మాణానికి పెద్ద ఎత్తున నిధులు ఇస్తోంది. ఇందులో అక్రమాలకు పాల్పడే వారిపై యుద్ధ ప్రతిపాదికన కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏవైనా నాలుగు పంచాయతీలను ఎంపిక చేసుకుని, అందులో నిధుల దుర్వినియోగంపై నివేదిక సమర్పించాలి’అని ఏసీబీ అధికారులను ఆదేశించింది. ఈ వ్యాజ్యంలో స్వచ్ఛ భారత్ డైరెక్టర్‌ను సుమోటోగా ప్రతివాదిగా చేర్చింది. మరుగుదొడ్ల నిర్మాణానికి చేసిన కేటాయింపులపై నివేదిక ఇవ్వాలని ఆ డైరెక్టర్‌ను ఆదేశిస్తూ తదుపరి విచారణను జనవరి 3కి వాయిదా వేసింది. పోస్టుమార్టం ఎందుకు? ఈ నివేదికలను పరిశీలించిన ధర్మాసనం, తీవ్రస్థాయిలో స్పందించింది. ఇది కేవలం ఓ గ్రామ పంచాయతీకి సంబంధించిన నిధుల దుర్వి నియోగం మాత్రమేనని, ఇటువంటి ఘటనలు అనేక పంచాయతీల్లో జరిగి ఉంటాయంది. ఈ సమయంలో ప్రభుత్వ న్యాయవాది జ్యోతికిరణ్ స్పందిస్తూ, సర్పంచ్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నామని చెప్పారు. దర్మాసనం స్పందిస్తూ, ఘటన జరిగిన తరువాత పోస్టుమార్టం చేసే కన్నా, ఇటువంటి ఘటనలు జరగడానికి ముందే చర్యలు తీసుకుంటే పరిస్థితి మరోలా ఉంటుందని తెలిపింది. ఏసీబీ, న్యాయసేవాధికార సంస్థల నివేదికలు పెద్ద ఎత్తున నిధుల దుర్వినియోగం, మోసం జరిగిన ట్లు చెబుతున్నాయని ధర్మాసనం పేర్కొంది. -
ధనాధన్!
సాక్షిప్రతినిధి, నల్లగొండ : పంచాయతీల ఎన్నికలు సమీపిస్తున్నాయి. జూలైతో సర్పంచ్ల పదవీకాలం ముగియనుంది. గడువు దగ్గరపడుతుండడంతో చేపట్టిన నిర్మాణ పనులు సర్పంచ్‌లు చకచకా పూర్తి చేయిస్తున్నారు. పెండింగ్ పనులన్నీ ఒక్కొక్కటి పూర్తి చేయించుకుంటూ బిల్లులు చేయించుకునే పనిలో పడ్డారు. వచ్చే ఎన్నికల్లో అదృష్టం కలిసివస్తే మళ్లీ పదవి వస్తుందని, లేకపోతే పనులన్నీ పూర్తిచేయించాలని సర్పంచ్‌లు సమాయత్తమయ్యారు. ఉమ్మడి జిల్లా విభజన తర్వాత జిల్లాలోని 31 మండలాల్లో 563 గ్రామ పంచాయతీలున్నాయి. గ్రామ పంచాయతీల జనాభా ఆధారంగా వాటికి నిధులు విడుదలవుతాయి. పంచాయతీలో ప్రజలకు మౌలిక వసతుల కల్పనకు ఈ నిధులను ప్రభుత్వం మంజూరు చేస్తుంది. జిల్లాల విభజన తర్వాత పంచాయతీల్లో నిధుల ఖర్చుపై అధికార యంత్రాం గం పర్యవేక్షణ పెరిగింది. ఈ పరిస్థితితో నిధులను సర్పంచ్‌లు నీళ్లలా కాకుండా ప్రజా అవసరాల కోసం ఖర్చు చేస్తున్నారు. జిల్లాల విభజన అనంతరం జిల్లాలోని పంచాయతీలకు 2016–17 ఆర్థిక సంవత్సరంలో 60.01 కోట్లు మంజూరైతే ఇందులో ఇప్పటివరకు సుమారు రూ.45 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు తెలిసింది. అలాగే 2017–18 ఆర్థిక సంవత్సరంలో రూ.29.71 కోట్లు వస్తే సుమారుగా రూ.20కోట్లు ఖర్చు అయ్యాయి. ప్రణాళికతో ఖర్చు .. నిధుల మంజూరుకు ప్రభుత్వం.. పంచాయతీల స్థాయిలో పక్కా ప్రణాళికతో మందుకెళ్తోంది. నిధులపై సర్పంచ్‌లకు మండల స్థాయిలో పలుమార్లు అవగాహన కల్పించారు. ప్రభుత్వంనుంచి విడుదలైన నిధులను ప్రజల అవసరాలకు అనుగుణంగా ఖర్చుచేసేలా పంచాయతీ అధికారులు.. గ్రామ సర్పంచ్‌లకు ఆదేశాలు జారీ చేశారు. ప్రధానంగా తాగునీరు, పారిశుద్ధ్యం, ప్రజారోగ్యం, షోషకాహారం, విద్య, సాంఘిక భద్రత, పేదరిక నిర్మూలన, సామాజిక వనరుల అభివృద్ధి, వ్యవసాయం, మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ప్రతి గ్రామంలో ఏడు కమిటీల ఆధ్వర్యంలో గ్రామసభలు నిర్వహించి ప్రణాళిక ప్రకారం ఖర్చు చేశారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఎల్ఈడీ బల్బుల కోసం నిధులు కేటాయించారు. లైట్లు బిగిస్తే గ్రామాలకు మంజూరైన నిధులు దాదాపుగా ఖర్చు చేసినట్లే అవుతుందని జిల్లా పంచాయతీ అధికారుల అంచనా. సీజన్లో నిధులు .. రెండేళ్లుగా పంచాయతీలకు సీజన్ వారీగా నిధులు విడుదలవుతున్నాయి. వర్షాకాలంలో అంతర్గత రోడ్లు బురదమయం కావడం, దోమల స్వైరవిహా రం, రోగాలు, చెత్తాచెదారంతో దుర్వాసన తదితర సమస్యలు ఉత్పన్నమవుతాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వర్షాకాలం ముందే నిధులను విడుదల చేసింది. ఈ నిధులతో పారిశుద్ధ్య పనులు, రోడ్ల మరమ్మతులు, మురుగు నీరు నిల్వలేకుండా చర్యలు తీసుకున్నారు. అలాగే పాలనాపరమైన అవసరాలకు, చెత్త సేకరణ, కొత్తరోడ్లు, పాత రోడ్ల మరమ్మతు, ఇతర సేవలకు వినియోగించారు. లెక్క చూపాల్సిందే.. పంచాయతీ ఒక కేంద్రం.. దీని పరిధిలోని ఆవాస ప్రాంతాల్లో మొత్తం ఎంత ఖర్చు చేశారో ప్రస్తుతమున్న సర్పంచ్‌లు లెక్కచూపాల్సిందే. నిధులు దుర్వినియోగం చేసిన విషయంలో జిల్లాలోని సర్పంచ్‌లపై గతంలో ప్రభుత్వం వేటు వేసిన సంఘటనలున్నాయి. అయితే ప్రతి రూపాయి ఖర్చును సర్పంచ్‌లు తమ పదవి కాలం ముగిసేనాటికి పంచాయతీ అధికారులకు అందజేయాలి. నిధులు దుర్వినియోగం చేసినట్లు రుజువైతే ఆయా సర్పంచ్‌లు మళ్లీ పోటీచేసే అవకాశాలు లేవు. ఈ విషయమై కూడా నూతన పంచాయతీరాజ్ చట్టం రూపకల్పనలో ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రిజర్వేషన్ కలిసి వస్తే మళ్లీ తమ అదృష్టాన్ని పరీక్షించుకుందామనుకుంటున్న సర్పంచ్‌లు ఈ పరిస్థితుల నేపథ్యంలో నిధులను ఆచితూచి ఖర్చు చేస్తున్నారు. -
‘స్థానిక’ ఉప నగారా
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): జిల్లాలో ఉప ఎన్నికల నగారా మోగింది. వివిధ కారణాలతో ఖాళీ అయిన సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాల్లో ఉప ఎన్నిక నిర్వహణకు శుక్రవారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. తాజాగా ఉమ్మడి జిల్లాలో మూడు ఎంపీటీసీ స్థానాలకు ఉప ఎన్నిక జరగగా, శనివారం ఫలితాలు వెలువడన్నాయి. ఇంతలోనే సర్పంచ్, ఉప సర్పంచ్ స్థానాలకు ఉప ఎన్నిక నోటిఫికేషన్ జారీ కావడం విశేషం. మృతి, రాజీనామా 2014 జూలైలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత వివిధ కారణాలతో కొన్ని స్థానాల్లో సర్పంచ్‌లు, వార్డుసభ్యులు రాజీనామా చేయగా.. మరికొందరు సభ్యులు మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. జడ్చర్ల మండలంలోని బూర్గుపల్లి, దేవరకద్ర మండలంలోని బస్వాపూర్ సర్పంచ్ స్థానాలకు తాజాగా ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదలైంది. అలాగే, బాలానగర్ మండలంలోని బోడజానంపేటలో 10వ వార్డు, గౌతాపూర్‌లో 4వ వార్డు, పెద్దరేవల్లి లో 6 వార్డు, చిన్నచింతకుంట మండలం చిన్నచింతకుంటలోని 2వ వార్డు, హన్వాడ మండలం వేపూర్‌లో 7వ వార్డు, జడ్చర్ల మండలం బూర్గుపల్లిలో 4వ వార్డు, మద్దూర్ మండలం భూనీడులో 4వ వార్డు, నర్వ మండలంలో పెద్దకడ్మూర్‌లోని 10వ వార్డులకు ఉప ఎన్నికలు జరుగనున్నట్లు నోటిఫికేషన్ పేర్కొన్నారు. 17 నుంచి నామినేషన్ల స్వీకరణ... జిల్లాలోని రెండు సర్పంచ్, 8 వార్డు సభ్యుల స్థానాలకు ఉప ఎన్నికలు జరునున్నాయి. ఈనెల 17వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ప్రతీరోజూ ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటలలోపు నామినేషన్లు స్వీకరిస్తారు. 21న నామినేషన్ల పరిశీలన, 24వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. అదేరోజు పోటీలో ఉన్న అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తారు. ఈనెల 29న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహిం చి, మధ్యాహ్నం 2 నుంచి ఓట్లు లెక్కిస్తారు. ఆ తర్వాత గెలుపొందిన అభ్యర్థుల పేర్లను అధికారులు ప్రకటిస్తారు. గ్రామాల్లో కోలాహలం సర్పంచ్, ఉప ఎన్నికల స్థానాలకు ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో గ్రామాల్లో కోలాహలం నెలకొంది. ప్రధాన పార్టీలు నేతలు తమ అనుయాయుల గెలుపునకు వ్యూహాలు రచించడంతో పాటు సరైన అభ్యర్థులను గుర్తించే పనిలో పడ్డాయి. ఇదే అదునుగా బలం ఉన్న నాయకులు ప్రధాన నాయకుల చుట్టూ తిరుగుతున్నారు. -
ఎంపీటీసీ, జెడ్పీటీసీ వ్యవస్థ రద్దు!
-
ఎంపీటీసీ, జెడ్పీటీసీ వ్యవస్థ రద్దు!
కేంద్రాన్ని కోరిన రాష్ట్ర ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ వ్యవస్థలను రద్దు చేయాలని కేంద్రాన్ని రాష్ట్రం కోరింది. ప్రస్తుతం స్థానిక సంస్థల్లో ఉన్న మూడంచెల వ్యవస్థను కొనసాగించాలని పేర్కొంది. పంచాయతీ సర్పంచ్‌లు మండల పరిషత్ చైర్మన్‌ను, మండల పరిషత్ చైర్మన్లు జిల్లా పరిషత్ చైర్మన్‌ను ఎన్నుకుంటారని తెలిపింది. నగర పంచాయతీ, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ వ్యవస్థలను యథాతథంగా కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. స్థానిక సంస్థల పరిపాలన వికేంద్రీకరణకు సంబంధించి పూంచీ కమిటీ చేసిన సిఫార్సులపై రాష్ట్రం ఈ మేరకు తన అభిప్రాయాలను కేంద్రానికి లిఖిత పూర్వకంగా తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం సూచన మేరకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ వ్యవస్థలను రద్దు చేసిన పక్షంలో రాష్ట్రంలో 10,148 ఎంపీటీసీ, 660 జెడ్పీటీసీ పదవులు రద్దు కానున్నాయి. ఇక స్థానిక సంస్థలకు అధికారాల బదిలీకి చట్టబద్ధత కల్పించాలని పూంచీ కమిటీ సిఫార్సు చేసింది. దీనిపై చట్టబద్ధత వద్దని, ఒక నమూనాను రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. పంచాయతీరాజ్ చైర్పర్సన్ పదవులకు ఎస్సీ, ఎస్టీ, మహిళా రిజర్వేషన్లను రొటేషన్ విధానంపై కొనసాగించాలని, అయితే ఒకే టర్మ్‌లో కాకుండా 2 టర్మ్‌ల తరువాత రొటేషన్ రిజర్వేషన్లను అమలు చేయాలని పూంచీ కమిటీ సిఫార్సు చేసింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం సమ్మతిస్తూనే రిజర్వేషన్లను నోటిఫై చేసే అధికారాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘానికి అప్పగించాలని కోరింది. -
ఏకగ్రీవ పంచాయతీలకు నిధులు
తిరుచానూరు : జిల్లాలోని 293 మైనర్ గ్రామ పంచాయతీల్లో ఏకగ్రీవంగా సర్పంచ్‌లను ఎన్నుకున్నారని, ఒక్కో పంచాయతీకి రూ.7లక్షలు చొప్పున మొత్తం రూ.20.51కోట్లు నిధులను 13వ ఆర్థిక సంఘం ద్వారా మంజూరు చేసినట్లు రాష్ట్ర మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తెలిపారు. తిరుచానూరులోని ఓ కల్యాణమండపంలో శుక్రవారం జిల్లా ప్రజాపరిషత్ ఆధ్వర్యంలో 23వ జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మంత్రులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, కామినేని శ్రీనివాస్ పాల్గొన్నారు. గాంధీ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బొజ్జల మాట్లాడుతూ ఏపీ పంచాయతీరాజ్ చట్టాన్ని 1994నుంచి అమలులోకి తీసుకొచ్చారన్నారు. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా మూడంచెల పంచాయతీరాజ్ సంస్థల ద్వారా ఏర్పాటై 23 ఏళ్లు పూర్తి చేసుకున్నట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో కంప్యూటరీకరణ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయాల్లో అన్ని మండల ప్రజాపరిషత్‌లను ఆన్లైన్ ద్వారా అనుసంధానం చేశారన్నారు. జిల్లాలోని 2,100పంచాయతీల్లో ఈ-పంచాయతీ కార్యక్రమం అమలుచేయనున్నట్లు తెలిపారు. స్మార్ట్ గ్రామం కార్యక్రమం కింద బహిరంగ మలవిసర్జన లేని గ్రామాలుగా తయారుచేయడం, పరిశుభ్రమైన గ్రామాలుగా తీర్చిదిద్దడం, రక్షిత తాగునీరు అందజేయడం తదితర కీలక అంశాలను స్థానిక ప్రభుత్వాలే నిర్వహించనున్నట్లు తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ పంచాయతీ రాజ్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. అనంతరం పలువురు ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ క్లస్టర్ విధానాన్ని తొలగించి ప్రతి గ్రామ పంచాయతీకి రెగ్యులర్ కార్యదర్శిని నియమించాలని మంత్రుల దృష్టికి తెచ్చారు. అలాగే 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం 29శాఖలకు సంబంధించి నిధులు, విధులు, సిబ్బంది పంచాయతీ ఆధీనంలోనే ఉండాలని కోరారు. ఈ విధానాన్ని అమలు చేస్తున్న కేరళ, కర్ణాటక, మధ్యప్రదేశ్, గుజరాత్ వంటి రాష్ట్రాలు అభివృద్ధి చెందాయని తెలిపారు. కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ, ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులు రెడ్డి, జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు చంద్రశేఖర్, రాష్ట్ర ఎంపీటీసీల సంఘం ఉపాధ్యక్షుడు సుబ్బరామయ్య, జెడ్పీ సీఈవో వేణుగోపాల్‌రెడ్డి, డెప్యూటీ సీఈవో మాలతికుమారి, జిల్లా పంచాయతీ అధికారి కేఎల్.ప్రభాకర్‌రావు, డీఆర్డీఏ పీడీ రవిప్రకాష్‌రెడ్డి, జెడ్పీ ఏవో వెంకటరత్నం, డీఎల్పీవో సురేష్‌నాయుడు, ఈవోపీఆర్డీ నీలకంఠేశ్వరరెడ్డి, తిరుచానూరు ఈవో జనార్దన్‌రెడ్డి, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
స్థానిక ‘ఉప’ సమరం
విశాఖపట్నం/నక్కపల్లి: జిల్లాలో నాలుగు పంచాయతీ సర్పంచ్‌లు, 124 వార్డు సభ్యులు, 21 ఎంపీటీసీ సభ్యుల ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఇందుకు ఏర్పాట్లు, బడ్జెట్ కేటాయింపులు చేసుకోవాలని ఎన్నికల సంఘ కార్యదర్శి నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రక్రియలో భాగంగా మొదటి దశలో పోలింగ్స్టేషన్ల ముసాయిదా ప్రకటన, అభ్యంతరాల స్వీకరణ, పరిశీలన, తుదిజాబితా ప్రకటనవంటి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గతంలో ఎన్నికలప్పుడు నామినేషన్ దాఖలుకాని పంచాయతీల్లోను, ఎన్నికల అనంతరం వివిధ కారణాల వల్ల ఖాళీఅయిన సర్పంచ్, వార్డు సభ్యులు, ఎంపీటీసీ సభ్యుల పదవుల ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి చేయాలని పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఈనెల 15న పోలింగ్స్టేషన్ల ముసాయిదా ప్రకటిస్తారు. వీటిపై అభ్యంతరాలను 17న స్వీకరిస్తారు. 18న పరిశీలన,19న తుదిజాబితా ప్రకటిస్తారు. ఈమేరకు ఏఏ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాలన్నదానిపై జిల్లాపరిషత్ అధికారులు దృష్టి సారించారు. షెడ్యూల్ వెలువడిన వెంటనే ఎన్నికలకు సమాయత్తమవుతున్నారు. ఈ ఏడాది మార్చి పదో తేదీన ప్రకటించిన ఓటర్ల జాబితా ఆధారంగానే ఎన్నికలు నిర్వహిస్తారు. 2013లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఉపయోగించిన గుర్తులనే ఇప్పుడూ వాడాలని ఎన్నికలసంఘం నిర్ణయించింది. ఏజెన్సీ పరిధి జీకేవీధి మండలం గాలికొండ, చింతపల్లి మండలం బలపం పంచాయతీలకు అప్పట్లో నామినేషన్లు దాఖలుకాలేదు. ఈ రెండు పంచాయతీల్లో సర్పంచ్‌తోపాటు అన్ని వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తారు. నాతవరం మండలం విబి అగ్రహారం సర్పంచ్ చనిపోయారు. నర్సీపట్నం మండలం ధర్మసాగరం సర్పంచ్ రాజీనామా చేశారు. ఈ రెండు చోట్ల సర్పంచ్ పదవులకు మాత్రమే ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నారు. వార్డుల విషయానికొస్తే దేవరాపల్లిమండలం కొత్తపల్లి,కాశీపురం, పరవాడమండలం కన్నూరు,రావాడ, పెందుర్తిమండలం ఎస్ఆర్పురం, సబ్బవరం మండలం పైడివాడఆగ్రహారం, అమృతపురం,అచ్చుతాపురం మండలం దోసూరు, పెదపాడు,మాడుగుల మండలం ఎం.కోడూరు, ముకుందపురం, మాకవారిపాలెం మండలం కోడూరు, కే. అగ్రహారం, నక్కపల్లిమండలం గొడిచర్ల, ముకుందరాజుపేట, నర్సీపట్నంమండలం వేములపూడి,పాయకరావుపేటమండలం పి.లక్ష్మీపురం, సీతారాంపురం, యలమంచిలి మండలం లక్కవరం, రాంబిల్లి మండలం కుమార పల్లి, జీకేవీధి మండలం మొండిగెడ్డ,జర్రెల, చింతపల్లిమండంలో తమ్మంగుల, కుడుమసారె, ముంచంగిపుట్టు మండలం రంగబయలు, బుంగాపుట్టు,బోసిపుట్టు,అనంతగిరి మండలం ఎన్ఆర్పురం, లుంగపర్తి, గుమ్మకోట, పెదబయలుమండలం జమ్మిగుడ, కుంతర్ల,బొంగరం, లింగేటి,గుల్లెలు, గొమ్మంగి, కొయ్యూరు మండలం బూదరాళ్ల, మంప, రేవళ్లు గ్రామాల్లో వివిధ కారణాలతో ఖాళీ అయిన వార్డులకు ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ ఎంపీటీసీ సెగ్మెంట్లకు.. జిల్లాలోని 8 మండలాల్లో 21 ఎంపీటీసీ స్థానాలకు వివిధ కారణాల వల్ల ఎన్నిక నిర్వహించలేదు. చింతపల్లి మండలం చింతపల్లి-1, చింతపల్లి-2, గొందిపాకలు, కుడుంసారె, తమ్మంగుల సెగ్మెట్లు, పాడేరు మండలం వంట్లమామిడి, వి. మాడుగుల మండలం మాడుగుల-2, మాడుగుల-3, కె.జె.పురం-2, పెదబయలు మండలం జామిగూడ, ఇంజరి , జి.మాడుగుల మండలం గడుతూరు, గెమ్మిలి, కోరాపల్లి , కోటవురట్ల మండలం కోటవుట్ల-2 , పాయకరావు పేట మండలం పాయకరావుపేట-7, కుమరాపురం , ముంచంగిపుట్టు మండలం మాకవరం, పెదగూడ, బరడ ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. -
సర్పంచ్ అయినా..చిన్నచూపే
ఇసుక మేటల మధ్య ఓ చిన్న పూరిగుడిసెలో ఉన్న ఆ కుటుంబానికి కూలిపనులే ఆధారం. కూలిపనులు లేని రోజు పస్తులే. ఇంతటి దీనస్థితిలో ఉన్న ఆ కుటుంబంఓ సర్పంచ్దంటే నమ్ముతారా. రిజర్వేషన్ పుణ్యమా అని ఆ ఇంట ఉన్న మహిళకు సర్పంచ్‌గిరీ దక్కినా..ఒక్కరోజు కూడా పంచాయతీ గడప తొక్కింది లేదు. ఒక్క సంతకమూ చేసింది లేదు. అంతా తానై నడిపే ఉప సర్పంచ్ హవా ముందు ఆమె చిన్నబోయింది. వేటపాలెం, న్యూస్‌లైన్ : పంచాయతీ వార్డుమెంబర్ అయితే చాలు రెండుచేతులా సంపాదిస్తున్న రోజులివి. కానీ తుపాకుల నాగమ్మ పరిస్థితి ఇందుకు పూర్తిభిన్నం. ఒక పంచాయతీకి సర్పంచ్ అయినా ఆమె జీవితంలో వెలుగు నిండలేదు. చల్లారెడ్డిపాలెం పంచాయతీ సర్పంచ్ ఎస్టీలకు రిజర్వ్ అయింది. ఆ పంచాయతీ పరిధిలోని కఠారివారిపాలెంలో ఊరికి దూరంగా ఇసుక భూముల్లో గుడిసెలు వేసుకుని నివసిస్తున్న 15 యానాది కుటుంబాల్లో నాగమ్మ కుటుంబం ఒకటి. ఇక్కడివారంతా సరుగుడు తోటల్లో కర్రకొట్టే పనిచేసుకుంటుంటారు. పనుల్లేకపోతే పస్తులుంటారు. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న నాగమ్మకు అనుకోకుండా ఓ అవకాశం దక్కింది. ఊరిపెద్దలంతా కలిసి సర్పంచ్ చేస్తామన్నారు. సర్పంచ్ అయితే తమ జీవితాలు బాగుపడతాయని ఆశించిన నాగమ్మ అందుకు సరేనంది. సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైంది. సర్పంచ్ విధులేమిటి..అధికారాలేమిటో కూడా తెలియని నాగమ్మను నామమాత్రం చేసి..ఉపసర్పంచ్ అంతా తానై నడిపిస్తున్నాడు. సర్పంచ్ అయి ఆరు నెలలు కావస్తున్నా..ఇంత వరకు అసలామె పంచాయతీ కార్యాలయం గడప తొక్కలేదు. పంచాయతీ సమావేశాల్లో పాల్గొనలేదు. అభివృద్ధికి సంబంధించిన ఫైళ్లలో ఒక్క సంతకమూ చేయలేదు. సర్పంచ్‌గా పంచాయతీ అభివృద్ధి చేయడం సంగతి దేవుడెరుగు..కనీసం తానుండే యానాది సంఘంలోనూ కనీస వసతులు సమకూర్చుకోలేని నిస్సహాయ స్థితిలో ఉందామె. యానాది సంఘంలో విద్యుత్ వసతి లేదు. అక్కడున్న 15 కుటుంబాల వారూ కటిక చీకట్లో..కిరోసిన్ దీపాల వెలుతురుతో కాలం నెట్టుకొస్తున్నారు. సంఘానికి వెళ్లేందుకు దారిలేదు. తాగేందుకు, ఇతర అవసరాలకు సంఘం మొత్తానికి ఒకటే చేతిపంపు. సగం మందికి రేషన్కార్డుల్లేవు. నాగమ్మ కుటుంబానికీ రేషన్‌కార్డు లేదు. నిధుల్లేక పనులు చేయలేదు.. ఎస్.కేశవరావు, చల్లారెడ్డిపాలెం పంచాయతీ కార్యదర్శి పంచాయతీ ఎన్నికల తరువాత నిధులు లేకపోవడంతో ఎటువంటి అభివృద్ధి పనులు చేయలేదు. సర్పంచ్ అనుమతితో లక్ష రూపాయల విలువైన వీధి దీపాలు కొనుగోలు చేశాం. ఇప్పటి వరకు పంచాయతీ కార్యాలయంలో మూడుసార్లు సాధారణ సమావేశాలు జరిగాయి. మూడు సమావేశాలూ సర్పంచ్ నాగమ్మ అధ్యక్షతనే నిర్వహించాం. సర్పంచ్‌కు సంతకం రాకపోవడంతో తీర్మానం పుస్తకంలో వేలిముద్ర వేశారు. పదవున్నా..లేకున్నా ఒకటే.. తుపాకుల నాగమ్మ, చల్లారెడ్డిపాలెం సర్పంచ్ అసలు సర్పంచ్ పదవి ఎవరిమ్మన్నారు. వాళ్లు వచ్చి నిన్ను సర్పంచ్‌ని చేస్తామన్నారు. పదవొస్తే..మా బతుకులు బాగుపడతాయనుకున్నాం. ఎన్నికలప్పుడు హడావిడి చేశారు. తరువాత మా గురించి పట్టించుకున్నోళ్లే లేరు. పంచాయతీలో జరిగే ఏ మీటింగు గురించీ ఇంత వరకు నాకు కబురు చేయలేదు. అన్నీ ఉపసర్పంచ్ చూసుకుంటారు. నాకు సర్పంచ్ పదవి ఉన్నా ఒకటే..లేకున్నా ఒకటే. కనీసం మాకు రేషన్‌కార్డు కూడా లేదు. ఉండేందుకు సరైన ఇల్లు లేదు. నాకు సంతకం చేయడం వచ్చు. కానీ పంచాయతీ రికార్డుల్లో ఎక్కడా ఒక్క సంతకం కూడా చేయలేదు. వేలిముద్రలూ వేయలేదు. అన్నీ అధికారులే చూసుకుంటారు. పంచాయతీ గురించి ఏ సమాచారమూ చెప్పరు. -
వైఎస్ఆర్సీపీలో పలువురి చేరిక
ఎం.ఆర్.అగ్రహారం(తెర్లాం రూరల్), న్యూస్‌లైన్: త్వర లో జరగనున్న అన్ని ఎన్నికల్లో ఎన్ని పార్టీలు కుమ్మక్కై నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనాన్ని ఎవరూ ఆపలేరని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయనగరం పార్లమెంటు నియోజకవర్గం సమన్వయ కర్త ఆర్వీఎస్కెకె రంగారావు(బేబీనాయన) అన్నారు. తెర్లాం మండలంలోని ఎంఆర్ అగ్రహారం పంచాయతీ సర్పంచ్ దాలి లక్ష్మి ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన 200 కుటుంబాల వారు కాంగ్రెస్ పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మంగళవారం రాత్రి చేరారు. అలాగే ఇదే పంచాయతీ కుమ్మరిపేట గ్రామానికి చెందిన పలువురు మాజీ సర్పంచ్ ముచ్చి సత్యనారాయణ ఆధ్వర్యంలో బేబీనాయన సమక్షంలో పార్టీలో చేరా రు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో బేబీనాయన మాట్లాడుతూ తమ పార్టీ పట్ల ప్రజల్లో రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంద న్నారు. ైవె ఎస్ఆర్సీపీకి వస్తున్న ఆదరణ చూసి ఇతర పార్టీలకు ముచ్చెమటలు పడుతున్నాయన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అమలు చేసి న పథకాలన్నీ మళ్లీ వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్ర మే కొనసాగించగలరన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో వై ఎస్ఆర్ సీపీ అన్నిజిల్లాల్లో అఖండ విజయం సాధించి జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్, స్థానిక సంస్థలు, సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులను అత్యధికమెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో గ్రామస్తులు, మండల పార్టీ నాయకులు నర్సుపల్లి వెంకటేశ్వరరావు, కూనాయవలస సర్పంచ్ బొమ్మి శ్రీనివాసరావు, డి.గదబవలస మాజీ సర్పంచ్ వావిల పల్లి ఆదినారాయణ, కార్యకర్తలు పాల్గొన్నారు. -
పంచాయతీ తాజా ఎన్నికల్లో వైఎస్సార్సీపీ హవా
సాక్షి, నెట్వర్క్: పంచాయతీ తాజా ఎన్నికల్లోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగింది. గతేడాది జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అధిక స్థానాలు గెల్చుకుని మొదటి స్థానంలో నిలిచిన పార్టీ.. శనివారం జరిగిన ఎన్నికల్లో కూడా ఎక్కువ పంచాయతీలను కైవసం చేసుకుంది. సీమాంధ్రలో 36స్థానాలకు ఎన్నికలు జరగ్గా వైఎస్సార్సీపీ మద్దతుదారులు 15చోట్ల విజయం సాధించారు. రెండవ స్థానంలో స్వతంత్రులు నిలవగా.. కాంగ్రెస్, టీడీపీలు మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. మంత్రి బాలరాజుకు శృంగభంగం! మంత్రిబాలరాజు సొంత నియోజకవర్గం విశాఖ జిల్లా పాడేరు పరిధిలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌కు చావుదెబ్బ తగిలింది. నియోజకవర్గం పరిధిలోని 9 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా జీకే వీధి మండలంలోని మొండిగెడ్డ మినహా మిగిలిన ఎనిమిది స్థానాల నూ వైఎస్సార్సీపీ మద్దతుదారులే దక్కించుకున్నారు. ప్రకాశం జిల్లాలో ఐదుచోట్ల ఎన్నికలు జరగ్గా వైఎస్సార్సీపీ రెండు మేజర్ పంచాయతీలను స్వాధీనం చేసుకుంది. కొత్తపట్నం మండలంలోని కొత్తపట్నం, అల్లూరు పంచాయతీలను వైఎస్సార్సీపీ గెలుచుకోగా, కొత్తపట్నం పల్లెపాలెం, గవండ్లపాలెంలలో టీడీపీ, కాంగ్రెస్ సంయుక్త మద్దతుదారులు గెలుపొందారు. ఒంగోలు మండలంలోని మండువవారి పాలెం పంచాయతీ సర్పంచ్ స్థానంతోపాటు వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. శ్రీకాకుళం జిల్లాలో మూడు పంచాయతీల్లో పోలాకి మండలం చెల్లాయివలస సర్పంచ్‌ను వైఎస్సార్సీపీ స్వాధీనం చేసుకుంది. గుంటూరు జిల్లాలో నాలుగుచోట్ల ఎన్నికలు జరగ్గా వైఎస్సార్సీపీ ఒకస్థానాన్ని గెలుపొందింది. పశ్చిమగోదావరి జిల్లా కొత్తపల్లి మండలం నాగులాపల్లి పంచాయతీని వైఎస్సార్సీపీ బలపర్చిన అభ్యర్థి 1029 ఓట్ల ఆధిక్యతతో కైవసం చేసుకున్నారు. ఖమ్మం నుంచి మరొకటి.. దమ్మపేట: ఖమ్మం జిల్లాలోని పంచాయతీల్లో వైఎస్సార్‌కాంగ్రెస్ ఖాతాలో మరొకటి చేరింది. దమ్మపేట మండల పరిధిలోని జమేదార్ బంజర్ పంచాయతీలో వైఎస్సార్సీపీ మద్దతుదారు దండి దుర్గ టీడీపీ మద్దతుదారుపై గెలుపొందారు. మరో పంచాయతీని సీపీఐ(ఎంఎల్) గెలుచుకుంది. -
సర్పంచులకు ‘చెక్’... పవర్ ఎప్పటికో !
మచిలీపట్నం/కైకలూరు, న్యూస్‌లైన్ :పంచాయతీ సర్పంచ్‌లకు చెక్ పవర్ ఇప్పట్లో వచ్చే సూచనలు కానరావడం లేదు. నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లను ప్రతిచోటా నిధులు లేమి వెక్కిరిస్తూనే ఉంది. దీంతో వర్షాకాలంలో గ్రామాల్లో కనీస పారిశుధ్య పనులు, తాగునీటి పంపిణీ తదితర పనులకు ఒక్క రూపాయి కూడా ఖర్చుపెట్టలేని దుస్థితిలో ఉన్నారు. ప్రభుత్వం సర్పంచ్‌లకు, పంచాయతీ కార్యదర్శికి జాయింట్ చెక్‌పవర్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేయటంతో ఈ అంశంపైనా సర్పంచులు గుర్రుగానే ఉన్నారు. అయితే ఈ ఉత్తర్వులు ఇంకా పంచాయతీలకు అందలేదు. ప్రభుత్వం నుంచి జారీ అయిన ఉత్తర్వులు కలెక్టర్‌కు, అక్కడి నుంచి డీపీవో, డీపీవో నుంచి ట్రెజరీ కార్యాలయానికి వెళ్లాల్సి ఉంది. సమైక్యాంధ్ర సమ్మెలో అన్ని విభాగాల ఉద్యోగులు పాల్గొంటుండటంతో ఈ ఉత్తర్వులు ఇప్పట్లో అమలయ్యే అవకాశాలు లేవని ఉద్యోగులు చెబుతున్నారు. సమైక్యాంధ్ర సమ్మె ముగిసిన అనంతరమే ఈ ఉత్తర్వులు పంచాయతీలకు చేరే అవకాశం ఉంది. పాత బకాయిలు విడుదలయ్యేనా... రెండేళ్ల విరామం అనంతరం పంచాయతీలకు నూతన పాలకవర్గాలు ఏర్పాటయ్యాయి. రెండేళ్లపాటు ప్రత్యేకాధికారుల పాలనలోనే పంచాయతీలు కొనసాగాయి. ప్రత్యేక అధికారుల పాలనలో ప్రత్యేకాధికారి, సంబంధిత పంచాయతీ కార్యదర్శికి సంయుక్తంగా చెక్ పవర్ ఉండేది. పంచాయతీలకు పాలకవర్గాలు లేకపోవటంతో కేంద్ర ప్రభుత్వం నుంచి 13వ ఆర్థిక సంఘం నిధులు విడుదల కాలేదు. జిల్లాలోని 969 పంచాయతీలకు దాదాపు రూ. 100 కోట్లకు పైగా నిధులు నిలిచిపోయాయి. ఈ నిధుల విడుదలపై స్పష్టమైన హామీ ఇచ్చేవారే కరువయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, రూపాయి మారక విలువ పడిపోవటం తదితర అంశాలన్నీ పంచాయతీలకు పాత బకాయిలు విడుదలపై ప్రభావం చూపే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. జాయింట్ చెక్‌పవర్‌పై ఆగ్రహం ... నూతనంగా ఎన్నికైన సర్పంచులకు, పంచాయతీ కార్యదర్శులకు జాయింట్ చెక్‌పవర్ ఇవ్వనున్నట్లు ప్రభుత్వం సోమవారం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులపై సర్పంచులు ఆగ్రహంగా ఉన్నారు. తమ అధికారాలకు ప్రభుత్వ వైఖరి కత్తెర పెట్టేలా ఉందని వారు వాపోతున్నారు. పంచాయతీలు ఏర్పడిన కొత్తలో సర్పంచులకు కాకుండా పంచాయతీల్లోని ఎగ్జిక్యూటివ్ అధికారులకు చెక్ పవర్ ఉండేది. పంచాయతీల్లో కావాల్సిన పనులను పాలకవర్గం తీర్మానం చేసి అందుకయ్యే ఖర్చును అంచనా రూపొందిస్తే ఈవో సంతకం చేసేవారు. నిధుల దుర్వినియోగమైతే చెక్‌పై సంతకం చేసిన ఈవో నుంచే రికవరీ చేసే వెసులుబాటు అప్పట్లో ఉండేది. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సర్పంచులకు చెక్ పవర్ అధికారం ఇచ్చారు. ఇదే అదనుగా భావించిన కొంత మంది సర్పంచులు నిధులను ఇష్టారాజ్యంగా వాడుకున్న దాఖలాలున్నాయి. దుర్వినియోగమైన నిధుల రికవరీకి ఆస్కారం లేకుండా పోయింది. కరెంటు బిల్లులు కట్టేదెలా... వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మైనర్, మేజర్ పంచాయతీల్లో కరెంటు బిల్లులను ప్రభుత్వమే చెల్లించేది. ఆయన మరణానంతరం కరెంటు బిల్లులను పంచాయతీలే చెల్లించాల్సి వస్తోంది. కరెంటు బిల్లులు కట్టకుంటే వీధిలైట్లకు విద్యుత్ సర ఫరా నిలిపివేస్తామని విద్యుత్ శాఖాధికారులు హుకుం జారీ చేస్తున్నారు. ఒక్కొక్క మేజర్ పంచాయతీలో నెలకు లక్ష నుంచి రూ. 1.50 లక్షల వరకు బిల్లులు చెల్లించాల్సి వస్తుంది. పంచాయతీలకు నూతన పాలకవర్గాలు ఏర్పడడంతో కరెంటు బిల్లులు చెల్లించాల్సిన బాధ్యత వారిపైనే ఉంది. చెక్‌పవర్ లేకుండా కరెంటు బిల్లులు ఎలా చెల్లిస్తారనే అంశంపై సందిగ్ధత నెలకొంది. ఈ పరిణామాల మధ్య పంచాయతీల్లో పాలనా ఎలా సాగుతుందనే అంశంపై అనేక అనుమానాలు నెలకొన్నాయి.