సాక్షి, హైదరాబాద్: మహిళా సాధికారితలో భాగంగా పంచాయతీ సర్పంచ్‌లుగా మహిళలను నియమిస్తే, వారి భర్తలు అధికారం చెలాయిస్తున్నారంటూ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. స్వచ్ఛ భారత్ కింద పంచాయతీలకు వస్తున్న నిధులను మహిళా సర్పంచ్‌ల భర్తలు తమ జేబుల్లో వేసుకుంటున్నారని ఆక్షేపించింది. భార్యలు సర్పంచ్‌లుగా పని చేస్తుంటే, భర్తలు కాంట్రాక్టర్లుగా, బినామీ పేర్లతో పనులు చేస్తూ నిధులను స్వాహా చేస్తున్నారని పేర్కొంది. ఇటువంటి వాటిని యుద్ధ ప్రాతిపదికన కఠినంగా అణిచివేయాల్సిన అవసరం ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. గ్రామ పంచాయతీల పరిధిలో స్వచ్ఛ భారత్ కింద చేపడుతున్న మరుగుదొడ్ల నిర్మాణాల్లో పెద్ద ఎత్తున నిధుల దుర్వినియోగం జరుగుతోందని తేల్చిన హైకోర్టు, దీనిపై లోతుగా విచారణ జరిపి నివేదిక సమర్పించాలని తెలంగాణ అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్ (ఏసీబీ డీజీ)ని ఆదేశించింది.
ఏవైనా మూడు నాలుగు పంచాయతీలను ఎంపిక చేసుకుని స్వచ్ఛ భారత్ కింద ఎంత మేర నిధులు వచ్చాయి.. ఎంత మేర పనులు జరిగాయి.. ఎంత దుర్వినియోగం జరిగింది తదితర వివరాలను తమ ముందుంచాలని చెప్పింది. అలాగే స్వచ్ఛ భారత్ కింద విడుదల చేసిన నిధులు, వాటి సద్వినియోగం తదితర వివరాలను తమ ముందుంచాలని స్వచ్ఛ భారత్ డైరెక్టర్‌ను ఆదేశించింది. తదుపరి విచారణను జనవరి 3కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృ ష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌ల ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
సొంత ఖాతాల్లోకి నిధులు...
మెదక్ జిల్లా, నార్సింగి గ్రామ పంచాయతీ పరిధిలో స్వచ్ఛ భారత్ కింద చేపట్టిన మరుగుదొడ్ల నిర్మాణంలో రూ.40 లక్షల మేర నిధులు దుర్వినియోగం అయ్యాయని, ఈ నిధులను సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, బిల్ కలెక్టర్లు తమ సొంత ఖాతాలకు మళ్లించుకున్నారని, దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ ఆ గ్రామానికి చెందిన ఎం.శేఖర్‌రెడ్డి హైకోర్టుకు లేఖ రాశారు. ఈ లేఖను హైకోర్టు ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)గా పరిగణించి విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. గత వారం ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన ధర్మాసనం, నిధుల దుర్వినియోగంపై ఏసీబీ విచారణకు ఆదేశించింది. అలాగే జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నుంచి ధర్మాసనం నివేదిక కోరింది. తాజాగా మంగళవారం ఈ వ్యాజ్యం విచారణకు రాగా, ఏసీబీ తరఫు న్యాయవాది తమ నివేదికను కోర్టు ముందుంచారు. అలాగే న్యాయసేవాధికార సంస్థ తరఫు న్యాయవాది జె.అనిల్‌కుమార్ తమ నివేదికను కోర్టుకు సమర్పించారు.
కఠిన చర్యలు తీసుకోవాలి...
‘స్వచ్ఛ భారత్‌లో భాగంగా మరుగుదొడ్ల నిర్మాణానికి పెద్ద ఎత్తున నిధులు ఇస్తోంది. ఇందులో అక్రమాలకు పాల్పడే వారిపై యుద్ధ ప్రతిపాదికన కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏవైనా నాలుగు పంచాయతీలను ఎంపిక చేసుకుని, అందులో నిధుల దుర్వినియోగంపై నివేదిక సమర్పించాలి’అని ఏసీబీ అధికారులను ఆదేశించింది. ఈ వ్యాజ్యంలో స్వచ్ఛ భారత్ డైరెక్టర్‌ను సుమోటోగా ప్రతివాదిగా చేర్చింది. మరుగుదొడ్ల నిర్మాణానికి చేసిన కేటాయింపులపై నివేదిక ఇవ్వాలని ఆ డైరెక్టర్‌ను ఆదేశిస్తూ తదుపరి విచారణను జనవరి 3కి వాయిదా వేసింది.
పోస్టుమార్టం ఎందుకు?
ఈ నివేదికలను పరిశీలించిన ధర్మాసనం, తీవ్రస్థాయిలో స్పందించింది. ఇది కేవలం ఓ గ్రామ పంచాయతీకి సంబంధించిన నిధుల దుర్వి నియోగం మాత్రమేనని, ఇటువంటి ఘటనలు అనేక పంచాయతీల్లో జరిగి ఉంటాయంది. ఈ సమయంలో ప్రభుత్వ న్యాయవాది జ్యోతికిరణ్ స్పందిస్తూ, సర్పంచ్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నామని చెప్పారు. దర్మాసనం స్పందిస్తూ, ఘటన జరిగిన తరువాత పోస్టుమార్టం చేసే కన్నా, ఇటువంటి ఘటనలు జరగడానికి ముందే చర్యలు తీసుకుంటే పరిస్థితి మరోలా ఉంటుందని తెలిపింది. ఏసీబీ, న్యాయసేవాధికార సంస్థల నివేదికలు పెద్ద ఎత్తున నిధుల దుర్వినియోగం, మోసం జరిగిన ట్లు చెబుతున్నాయని ధర్మాసనం పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment