‘కాళేశ్వరం’లో 50 మందికిపైగా సబ్‌ కాంట్రాక్టర్లు | More than 50 people are subcontractors in Kaleshwaram | Sakshi
Sakshi News home page

‘కాళేశ్వరం’లో 50 మందికిపైగా సబ్‌ కాంట్రాక్టర్లు

Published Fri, Jul 12 2024 5:04 AM | Last Updated on Fri, Jul 12 2024 5:04 AM

More than 50 people are subcontractors in Kaleshwaram

గుర్తించిన జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ 

కమిషన్‌కు పీపీ ప్రజెంటేషన్‌ ఇవ్వనున్న కె.రఘు, వెదిరె శ్రీరాం 

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల నిర్మాణంలో 50 మందికి పైగా సబ్‌కాంట్రాక్టర్లు పాలుపంచుకున్నారని జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ కమిషన్‌ గుర్తించింది. బరాజ్‌ల నిర్మాణంలో సాంకేతి క లోపాలపై విచారణ తుది అంకానికి చేరుకుంది. దీంతో ఆర్థికపరమైన అవకతవకలపై కమిషన్‌ దృష్టి సారించింది. బ రాజ్‌ల నిర్మాణంలో అవకతవకలపై విచారణకు జస్టిస్‌ పినా కి చంద్రఘోష్‌ కమిషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. బరాజ్‌ల పనులు దక్కించుకున్న నిర్మా ణ సంస్థలు చాలా పనులను నిబంధనలకు విరుద్ధంగా సబ్‌ కాంట్రాక్టర్లకు అప్పగించినట్టు కమిషన్‌ నిర్థారణకు వచ్చింది. 

గత ప్రభుత్వంలోని ఓ ముఖ్యనేత సమీప బంధువులకు చెందిన కంపెనీలు సైతం సబ్‌ కాంట్రాక్టులు పొందాయని గుర్తించినట్టు తెలిసింది. తొలుత జారీచేసిన పరిపాలనాపర అను మతుల ప్రకారం బరాజ్‌ల నిర్మాణానికి అంచనా వ్యయం ఎంత? ఆ తర్వాత ఎన్నిసార్లు పెంచారు? ఎంత పెంచారు?  గడువులోగానే పనులు పూర్తి చేసినప్పుడు అంచనా వ్యయం పెంచాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? సబ్‌ కాంట్రాక్టర్లకు ఏ పనులు కట్టబెట్టారు? వారికి ఎంత చెల్లించారు? ఈ వ్యవహారంలో అవకతవకలు ఏమైన జరిగాయా? వంటి అంశాలపై ఆరా తీస్తోంది. బరాజ్‌ల ఆర్థిక వ్యవహారాలపై మరింత లోతుగా విచారణ నిర్వహించడానికి ఒక చార్టర్డ్‌ అకౌంటెంట్‌ను కమిషన్‌ కార్యాలయంలో నియమించాలని ప్రభుత్వా న్ని కోరింది. 

సాక్షుల క్రాస్‌ ఎగ్జామినేషన్‌లో కమిషన్‌కు సహకరించడానికి తెలంగాణ(కాళేశ్వరం ప్రాజెక్టు), పశ్చిమబెంగాల్‌(జస్టిస్‌ ఘోష్‌ సొంత రాష్ట్రం)తో సంబంధం లేని సీనియర్‌ న్యాయవాదిని సైతం నియమించాలని కోరింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని 3 పంప్‌హౌజ్‌ల పనులను నిర్వహించిన ఓ నిర్మాణ సంస్థకు సంబంధించిన వైస్‌ప్రెసిడెంట్‌తో సహా మరో ఇద్దరు ఉన్నత అధికారులను జస్టిస్‌ చంద్రఘోష్‌ కమిషన్‌ గురువారం తన కార్యాలయంలో విచారించింది.

పంప్‌హౌజ్‌ల నిర్మాణ స్థలం ఎంపిక, డిజైన్లు తదితర అంశాలపై కమిషన్‌ వారిని ప్రశ్నించగా, ప్రభుత్వం ఎంపిక చేసిన స్థలం, అందించిన డిజైన్ల ప్రకారమే వాటిని నిర్మించినట్టు ఆ కంపె నీ ప్రతినిధులు బదులిచ్చినట్టు తెలిసింది.  ప్రాజెక్టుకు సంబంధించిన బిల్లుల జారీతో సంబంధం ఉన్న వర్క్‌ అండ్‌ అకౌంట్స్‌ విభాగం డైరెక్టర్‌ ఫణిభూషణ్‌ శర్మను సైతం కమిషన్‌ విచారించింది.  

విద్యుత్‌రంగ నిపుణుడు కె.రఘు ఈ నెల 15న, కేంద్ర జలశక్తిశాఖ మంత్రి మాజీ సలహాదారుడు వెదిరె శ్రీరాం ఈ నెల 16న కమిషన్‌ ముందు హాజరై కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి తమ వద్ద ఉన్న సమాచారాన్ని అందించనున్నారు. పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇవ్వడానికి వీరు అనుమతి కోరగా, కమిషన్‌ అందుకు ఏర్పాట్లు చేస్తోంది.  

నేడు కమిషన్‌ ఎదుట రహస్య సాక్షి 
బరాజ్‌ల నిర్మాణంలో లోపాలను వ్యతిరేకిస్తూ తన ఉద్యోగాన్ని వదులుకున్న ఓ నిర్మాణ సంస్థలోని కీలక ఉద్యోగి శుక్రవారం కమిషన్‌ ముందు హాజరై తన వాదనలు వినిపించనున్నారు. తన వద్ద ఉన్న సమాచారాన్ని కమిషన్‌కు అందించనున్నారు. ఆయన వివరాలను కమిషన్‌వర్గాలు గోప్యంగా ఉంచాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement