కాంట్రాక్టర్ల కొత్త ఆలోచనలు
35 శాతం లెస్‌తోనూ పనులు
నాణ్యత ఉండేనా మరి!
ఒక్క దేవరకొండలోనే రూ.450 కోట్ల పనులు
దేవరకొండ : సాధారణంగా ఏదైనా అభివృద్ధి పని చేయాలంటే అధికారులు క్షేత్ర పర్యటన చేసి.. నాణ్యత పక్కాగా చూసుకుని.. ఆ పనికి అయ్యే ఖర్చు అంచనా వేసి.. ప్రతిపాదనలు తయారు చేస్తారు. దానికి కాంట్రాక్టర్ లాభాన్ని కలిపి ఆ పనికి విలువ తయారు చేసి టెండర్లు పిలుస్తారు. మరి టెండర్లలో కాంట్రాక్టర్లు 35 శాతం లెస్‌కు కూడా కోట్ చేసి ఆ పనిని దక్కించుకుంటున్నారు. అంటే కోటి రూపాయల విలువతో ఒక పనిని చేయొచ్చని అధికారులు అంచనా వేస్తే కాంట్రాక్టర్లు మాత్రం కేవలం ఆ పనిని రూ.60 నుంచి రూ.70 లక్షలలోపే పని చేస్తామని లెస్ కోట్ చేసి పనిని దక్కించుకుంటున్నారు. అయితే ఇందులో కాంట్రాక్టర్ నష్టపోతాడా..? లేక ఆ పనిలో నాణ్యత ప్రశ్నార్థకంగా మారుతుందా..? అనేది అంతుచిక్కని ప్రశ్నే.. నల్లగొండ జిల్లాలో ప్రస్తుతం కోట్ల రూపాయల విలువైన మిషన్ కాకతీయ పనులు, ఇతర అభివృద్ధి పనులు, కృష్ణా పుష్కరాల పనులు జరుగుతుండగా ఒక్క దేవరకొండ నియోజకవర్గంలోనే ప్రస్తుతం రూ. 450 కోట్ల పనులు జరుగుతున్నాయి.
తెలంగాణ ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఇదే సమయంలో కృష్ణా పుష్కరాలు రానున్న ఆగస్టు నెలలో జరుగుతుండగా మరో 4 నెలల్లో చేయాల్సిన ఈ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. పుష్కర పనులు, అభివృద్ధి పనులు కోట్ల రూపాయల్లో జరుగుతుండగా రూ.10 లక్షలు విలువ చేసే పనులను ఆన్‌లైన్‌లో టెండర్లు పిలుస్తున్నారు. అయితే దేవరకొండలో ఫస్ట్ ఫేజ్ మిషన్ కాకతీయ పనులు రూ. 9 కోట్ల విలువ కాగా సెకండ్ ఫేజ్ మిషన్ కాకతీయ పనులను రూ.35.33 కోట్లతో చేపడుతున్నారు. అంతేకాక దేవరకొండ నియోజకవర్గంలోని చందంపేట, పీఏపల్లి మండలాల పరిధిలో పుష్కర ఘాట్లను ఏర్పాటు చేస్తుండగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు రావడానికి అణువుగా పలు చోట్ల రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్నారు. అంతేకాక దేవరకొండలోనూ పట్టణాభివృద్ధి కోసం రూ.కోటి 40 లక్షల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.
చాలా పనులు లెస్‌లోనే...
చేపడుతున్న అభివృద్ధి పనుల్లో చాలా వరకు కాంట్రాక్టర్లు అంచనాల విలువ కంటే లెస్‌లోనే కోట్ చేసి ఆ పనులు దక్కించుకుంటున్నారు. దేవరకొండలోని ఒక పనిలో ఏకంగా ఓ కాంట్రాక్టర్ 35 శాతం లెస్‌కు కోట్ చేసి దక్కించుకున్నారు. ఇదొక్క పనే కాదు మిషన్ కాకతీయలో చాలా పనులు 14 నుంచి 35 శాతం వరకు లెస్‌కే కోట్ చేసి దక్కించుకున్నారు. వాస్తవంగా అధికారులు ఒక పని విలువ నిర్ణయించడానికి క్షేత్ర పర్యటన చేసి ప్రతిపాదన తయారు చేసి కాంట్రాక్టర్ లాభాన్ని జత చేసి ఆ పని విలువతో టెండర్లు పిలుస్తారు. అయితే కాంట్రాక్టర్లు మాత్రం ఎక్సెస్ వేయాల్సిన ధరను లెస్‌కు కూడా చేయడానికి ముందుకొస్తున్నారు.
నాణ్యత ప్రశ్నార్థకమే...?
అధికారులు చేయాల్సిన పనికి ఒక ధరను నిర్ణయించినప్పుడు ఆ ధర కంటే లోపే ఆ పని చేయాలంటే ఒకటి కాంట్రాక్టరైనా నష్టపోవాలి. లేదంటే ఆ పనిలో నాణ్యతైనా తగ్గాలి. వాస్తవంగా ప్రభుత్వ టెండర్లలో ఆ పని విలువలో మొదటగా పనిని తగ్గించుకోవాలంటే 2.5 శాతాన్ని ఈఎండీగా ముందే ధరావత్‌గా చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఒక శాతాన్ని అగ్రిమెంట్ కోసం చెల్లించాలి. దీనికి తోడు కొన్ని చోట్ల అధికారులకు ఇవ్వాల్సిన ఆమ్యామ్యాలు కూడా అందరికీ తెలిసినవే. అయితే టెండర్లలో లెస్ కోట్‌లతో జరిగే పనుల వల్ల నాణ్యతపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లెస్ కోట్‌లతో చేసే పనులు పెద్దపెద్ద కాంట్రాక్టర్లకు మినహా సాధారణ కాంట్రాక్టర్లకు సాధ్యమయ్యే పని కాదు. కానీ ఇలాంటి పనులు దేవరకొండలోనూ చాలా వరకు జరుగుతున్నాయి.
పనుల ఎగవేతే...
చాలా పనులు నిర్వహిస్తున్న కాంట్రాక్టర్ల పరిస్థితి దయనీయంగా మారుతోంది. పనులు దక్కించుకునే క్రమంలో లెస్‌లకు కోట్ చేయడం, పని దక్కించుకోవడం కంటే ముందుగానే మూడున్నర శాతం ఈఎండీ, అగ్రిమెంట్ల రూపంలో ప్రభుత్వం దగ్గర ఉంచి అప్పులు తెచ్చి పనులు ప్రారంభిస్తున్నారు. చివరకు పనులు పూర్తి కాక తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక నానా తంటాలు పడుతున్నారు. దీని వల్ల అటు అనుకున్న సమయానికి పనులు పూర్తి కాకపోవడం, కాంట్రాక్టర్ నష్టపోతున్న క్రమంలో కొంత మంది అధికారులతో లాలూచీ పడటం వల్ల పనులు లోపభూయిష్టంగా జరుగుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
లెస్ కోట్.. ఇదో వ్యాపారం
Published Mon, May 23 2016 1:46 PM | Last Updated on Mon, Sep 4 2017 12:46 AM
Advertisement