తిరుచానూరు : జిల్లాలోని 293 మైనర్ గ్రామ పంచాయతీల్లో ఏకగ్రీవంగా సర్పంచ్‌లను ఎన్నుకున్నారని, ఒక్కో పంచాయతీకి రూ.7లక్షలు చొప్పున మొత్తం రూ.20.51కోట్లు నిధులను 13వ ఆర్థిక సంఘం ద్వారా మంజూరు చేసినట్లు రాష్ట్ర మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తెలిపారు. తిరుచానూరులోని ఓ కల్యాణమండపంలో శుక్రవారం జిల్లా ప్రజాపరిషత్ ఆధ్వర్యంలో 23వ జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మంత్రులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, కామినేని శ్రీనివాస్ పాల్గొన్నారు.
గాంధీ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బొజ్జల మాట్లాడుతూ ఏపీ పంచాయతీరాజ్ చట్టాన్ని 1994నుంచి అమలులోకి తీసుకొచ్చారన్నారు. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా మూడంచెల పంచాయతీరాజ్ సంస్థల ద్వారా ఏర్పాటై 23 ఏళ్లు పూర్తి చేసుకున్నట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో కంప్యూటరీకరణ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయాల్లో అన్ని మండల ప్రజాపరిషత్‌లను ఆన్‌లైన్ ద్వారా అనుసంధానం చేశారన్నారు. జిల్లాలోని 2,100పంచాయతీల్లో ఈ-పంచాయతీ కార్యక్రమం అమలుచేయనున్నట్లు తెలిపారు.
స్మార్ట్ గ్రామం కార్యక్రమం కింద బహిరంగ మలవిసర్జన లేని గ్రామాలుగా తయారుచేయడం, పరిశుభ్రమైన గ్రామాలుగా తీర్చిదిద్దడం, రక్షిత తాగునీరు అందజేయడం తదితర కీలక అంశాలను స్థానిక ప్రభుత్వాలే నిర్వహించనున్నట్లు తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ పంచాయతీ రాజ్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. అనంతరం పలువురు ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ క్లస్టర్ విధానాన్ని తొలగించి ప్రతి గ్రామ పంచాయతీకి రెగ్యులర్ కార్యదర్శిని నియమించాలని మంత్రుల దృష్టికి తెచ్చారు.
అలాగే 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం 29శాఖలకు సంబంధించి నిధులు, విధులు, సిబ్బంది పంచాయతీ ఆధీనంలోనే ఉండాలని కోరారు. ఈ విధానాన్ని అమలు చేస్తున్న కేరళ, కర్ణాటక, మధ్యప్రదేశ్, గుజరాత్ వంటి రాష్ట్రాలు అభివృద్ధి చెందాయని తెలిపారు. కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ, ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులు రెడ్డి, జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు చంద్రశేఖర్, రాష్ట్ర ఎంపీటీసీల సంఘం ఉపాధ్యక్షుడు సుబ్బరామయ్య, జెడ్పీ సీఈవో వేణుగోపాల్‌రెడ్డి, డెప్యూటీ సీఈవో మాలతికుమారి, జిల్లా పంచాయతీ అధికారి కేఎల్.ప్రభాకర్‌రావు, డీఆర్‌డీఏ పీడీ రవిప్రకాష్‌రెడ్డి, జెడ్పీ ఏవో వెంకటరత్నం, డీఎల్‌పీవో సురేష్‌నాయుడు, ఈవోపీఆర్డీ నీలకంఠేశ్వరరెడ్డి, తిరుచానూరు ఈవో జనార్దన్‌రెడ్డి, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఏకగ్రీవ పంచాయతీలకు నిధులు
Published Sat, Apr 25 2015 3:46 AM | Last Updated on Wed, Apr 3 2019 5:55 PM
Advertisement
Advertisement