స్క్రాప్ వ్యాపారం చేసుకునే నేను కప్పం కట్టాలట
నెలకు రూ.కోటి ఇవ్వాలని బొజ్జల బెదిరిస్తున్నారు
ఆయన అనుచరుడు నన్ను కొట్టి ఫోన్ లాక్కున్నాడు
ఫిర్యాదు చేసినా పట్టించుకోని రేణిగుంట పోలీసులు
తన కష్టాన్ని మీడియాకు వివరించిన బాధితుడు
సాక్షి టాస్క్‌ఫోర్స్: శ్రీకాళహస్తి నియోజకవర్గంలో వ్యాపారం చేయాలంటే ఎమ్మెల్యే బొజ్జలకు కప్పం కట్టాలి. లేదంటే ఊరు విడిచి అయినా పోవాలి. ఈ రెండింట్లో దేనికో ఒక దానికి సిద్ధపడకపోతే మాత్రం ఎమ్మెల్యే అనుచరుల చేతిలో చావు దెబ్బలు తప్పవు. ఇప్పటికే అన్ని రకాలుగా వసూళ్ల పర్వానికి తెరలేపిన ఆ ఎమ్మెల్యే దాదాగిరి గురించి వేధింపులకు గురైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం రాజీపూర్ జిల్లాకు చెందిన సుశీల్ చౌదరి అనే స్క్రాప్ వ్యాపారి బయట పెట్టారు. ఈ మేరకు బాధితుడు తిరుపతిలోని ఓ ప్రైవేటు నివాసంలో శుక్రవారం మీడియాతో మాట్లాడారు.
ఆ వివరాలు అతని మాటల్లోనే..‘ఎనిమిదేళ్లుగా నేను తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం రేణిగుంట, ఏర్పేడు మండలాల్లోని వివిధ కర్మాగారాల్లో స్క్రాప్‌ను సేకరించి ఇతర ప్రాంతాల్లో విక్రయించి వ్యాపారం చేస్తున్నా. జూన్‌లో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి నాకు ఫోన్ చేసి, నియోజకవర్గంలో తన అనుమతి లేకుండా ఎలాంటి వ్యాపారం చేయకూడదని ఆదేశించారు. వ్యాపారం చేసుకోవాలంటే తనకు ప్రతి నెలా కొంత మొత్తం చెల్లించాలని బెదిరించాడు. కొద్ది రోజుల తర్వాత నన్ను హైదరాబాద్‌కు పిలిపించి మాట్లాడారు. ప్రతి నెలా రూ.50 లక్షల నుంచి రూ.కోటి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అయితే నా వ్యాపారం అంతంత మాత్రమేనని, అంత పెద్ద మొత్తం ఇచ్చుకోలేనని ప్రాధేయపడ్డాను. దీంతో నియోజకవర్గంలో ఎక్కడా స్క్రాప్ తీసుకోవద్దని హెచ్చరించారు. నాకు స్క్రాప్ అమ్మకూడదని ఫ్యాక్టరీల యజమానులను కూడా బెదిరించారు. అప్పటి నుంచి నేను వ్యాపారం మానేసి ఖాళీగా ఉన్నాను. అయితే ఎమ్మెల్యే అనుచరుడు వికృతమాలకు చెందిన పూల హేమాక్షి తరచూ నాను ఫోన్ చేసి, ఎమ్మెల్యేకు డబ్బులు కట్టాలని డిమాండ్ చేసేవాడు. తిరుపతి వదిలిపెట్టి వెళ్లిపోవాలని.. లేదంటే చంపేస్తామని బెదిరించాడు.
రెండు రోజుల కిందట హేమాక్షి నా వద్దకు వచ్చి డబ్బులు ఇవ్వాలని దారుణంగా కొట్టాడు. నా సెల్ ఫోను లాక్కుని, ఈ విషయం ఎక్కడైనా చెబితే చంపేస్తామని బెదిరించి వెళ్లిపోయాడు. ఈ విషయమై నేను రేణిగుంట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాను. అయితే వారు పట్టించుకోలేదు. ఎమ్మెల్యే వల్ల నాకు ప్రాణహాని ఉంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత, జిల్లా ఎస్పీ స్పందించి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సు«దీర్‌రెడ్డి చెర నుంచి నన్ను రక్షించాలి’ అని వేడుకున్నారు.
ఇది కూడా చదవండి: మాతో పెట్టుకుంటే కాల్చిపారేస్తాం!.. అనంతలో మళ్లీ రక్త చరిత్ర
Comments
Please login to add a commentAdd a comment