జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): జిల్లాలో ఉప ఎన్నికల నగారా మోగింది. వివిధ కారణాలతో ఖాళీ అయిన సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాల్లో ఉప ఎన్నిక నిర్వహణకు శుక్రవారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. తాజాగా ఉమ్మడి జిల్లాలో మూడు ఎంపీటీసీ స్థానాలకు ఉప ఎన్నిక జరగగా, శనివారం ఫలితాలు వెలువడన్నాయి. ఇంతలోనే సర్పంచ్, ఉప సర్పంచ్ స్థానాలకు ఉప ఎన్నిక నోటిఫికేషన్ జారీ కావడం విశేషం.
మృతి, రాజీనామా
2014 జూలైలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత వివిధ కారణాలతో కొన్ని స్థానాల్లో సర్పంచ్‌లు, వార్డుసభ్యులు రాజీనామా చేయగా.. మరికొందరు సభ్యులు మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. జడ్చర్ల మండలంలోని బూర్గుపల్లి, దేవరకద్ర మండలంలోని బస్వాపూర్ సర్పంచ్ స్థానాలకు తాజాగా ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదలైంది. అలాగే, బాలానగర్ మండలంలోని బోడజానంపేటలో 10వ వార్డు, గౌతాపూర్‌లో 4వ వార్డు, పెద్దరేవల్లి లో 6 వార్డు, చిన్నచింతకుంట మండలం చిన్నచింతకుంటలోని 2వ వార్డు, హన్వాడ మండలం వేపూర్‌లో 7వ వార్డు, జడ్చర్ల మండలం బూర్గుపల్లిలో 4వ వార్డు, మద్దూర్ మండలం భూనీడులో 4వ వార్డు, నర్వ మండలంలో పెద్దకడ్మూర్‌లోని 10వ వార్డులకు ఉప ఎన్నికలు జరుగనున్నట్లు నోటిఫికేషన్ పేర్కొన్నారు.
17 నుంచి నామినేషన్ల స్వీకరణ...
జిల్లాలోని రెండు సర్పంచ్, 8 వార్డు సభ్యుల స్థానాలకు ఉప ఎన్నికలు జరునున్నాయి. ఈనెల 17వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ప్రతీరోజూ ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటలలోపు నామినేషన్లు స్వీకరిస్తారు. 21న నామినేషన్ల పరిశీలన, 24వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. అదేరోజు పోటీలో ఉన్న అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తారు. ఈనెల 29న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహిం చి, మధ్యాహ్నం 2 నుంచి ఓట్లు లెక్కిస్తారు. ఆ తర్వాత గెలుపొందిన అభ్యర్థుల పేర్లను అధికారులు ప్రకటిస్తారు.
గ్రామాల్లో కోలాహలం
సర్పంచ్, ఉప ఎన్నికల స్థానాలకు ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో గ్రామాల్లో కోలాహలం నెలకొంది. ప్రధాన పార్టీలు నేతలు తమ అనుయాయుల గెలుపునకు వ్యూహాలు రచించడంతో పాటు సరైన అభ్యర్థులను గుర్తించే పనిలో పడ్డాయి. ఇదే అదునుగా బలం ఉన్న నాయకులు ప్రధాన నాయకుల చుట్టూ తిరుగుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment