స్థానిక ‘ఉప’ సమరం
విశాఖపట్నం/నక్కపల్లి: జిల్లాలో నాలుగు పంచాయతీ సర్పంచ్‌లు, 124 వార్డు సభ్యులు, 21 ఎంపీటీసీ సభ్యుల ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఇందుకు ఏర్పాట్లు, బడ్జెట్ కేటాయింపులు చేసుకోవాలని ఎన్నికల సంఘ కార్యదర్శి నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రక్రియలో భాగంగా మొదటి దశలో పోలింగ్‌స్టేషన్‌ల ముసాయిదా ప్రకటన, అభ్యంతరాల స్వీకరణ, పరిశీలన, తుదిజాబితా ప్రకటనవంటి చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
గతంలో ఎన్నికలప్పుడు నామినేషన్ దాఖలుకాని పంచాయతీల్లోను, ఎన్నికల అనంతరం వివిధ కారణాల వల్ల ఖాళీఅయిన సర్పంచ్, వార్డు సభ్యులు, ఎంపీటీసీ సభ్యుల పదవుల ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి చేయాలని పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఈనెల 15న పోలింగ్‌స్టేషన్‌ల ముసాయిదా ప్రకటిస్తారు. వీటిపై అభ్యంతరాలను 17న స్వీకరిస్తారు. 18న పరిశీలన,19న తుదిజాబితా ప్రకటిస్తారు. ఈమేరకు ఏఏ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాలన్నదానిపై జిల్లాపరిషత్ అధికారులు దృష్టి సారించారు. షెడ్యూల్ వెలువడిన వెంటనే ఎన్నికలకు సమాయత్తమవుతున్నారు.
ఈ ఏడాది మార్చి పదో తేదీన ప్రకటించిన ఓటర్ల జాబితా ఆధారంగానే ఎన్నికలు నిర్వహిస్తారు. 2013లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఉపయోగించిన గుర్తులనే ఇప్పుడూ వాడాలని ఎన్నికలసంఘం నిర్ణయించింది. ఏజెన్సీ పరిధి జీకేవీధి మండలం గాలికొండ, చింతపల్లి మండలం బలపం పంచాయతీలకు అప్పట్లో నామినేషన్‌లు దాఖలుకాలేదు. ఈ రెండు పంచాయతీల్లో సర్పంచ్‌తోపాటు అన్ని వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తారు. నాతవరం మండలం విబి అగ్రహారం సర్పంచ్ చనిపోయారు. నర్సీపట్నం మండలం ధర్మసాగరం సర్పంచ్ రాజీనామా చేశారు. ఈ రెండు చోట్ల సర్పంచ్ పదవులకు మాత్రమే ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నారు.
వార్డుల విషయానికొస్తే దేవరాపల్లిమండలం కొత్తపల్లి,కాశీపురం, పరవాడమండలం కన్నూరు,రావాడ, పెందుర్తిమండలం ఎస్‌ఆర్‌పురం, సబ్బవరం మండలం పైడివాడఆగ్రహారం, అమృతపురం,అచ్చుతాపురం మండలం దోసూరు, పెదపాడు,మాడుగుల మండలం ఎం.కోడూరు, ముకుందపురం, మాకవారిపాలెం మండలం కోడూరు, కే. అగ్రహారం, నక్కపల్లిమండలం గొడిచర్ల, ముకుందరాజుపేట, నర్సీపట్నంమండలం వేములపూడి,పాయకరావుపేటమండలం పి.లక్ష్మీపురం, సీతారాంపురం, యలమంచిలి మండలం లక్కవరం, రాంబిల్లి మండలం కుమార పల్లి, జీకేవీధి మండలం మొండిగెడ్డ,జర్రెల, చింతపల్లిమండంలో తమ్మంగుల, కుడుమసారె, ముంచంగిపుట్టు మండలం రంగబయలు, బుంగాపుట్టు,బోసిపుట్టు,అనంతగిరి మండలం ఎన్‌ఆర్‌పురం, లుంగపర్తి, గుమ్మకోట, పెదబయలుమండలం జమ్మిగుడ, కుంతర్ల,బొంగరం, లింగేటి,గుల్లెలు, గొమ్మంగి, కొయ్యూరు మండలం బూదరాళ్ల, మంప, రేవళ్లు గ్రామాల్లో వివిధ కారణాలతో ఖాళీ అయిన వార్డులకు ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది.
ఈ ఎంపీటీసీ సెగ్మెంట్లకు..
జిల్లాలోని 8 మండలాల్లో 21 ఎంపీటీసీ స్థానాలకు వివిధ కారణాల వల్ల ఎన్నిక నిర్వహించలేదు. చింతపల్లి మండలం చింతపల్లి-1, చింతపల్లి-2, గొందిపాకలు, కుడుంసారె, తమ్మంగుల సెగ్మెట్లు, పాడేరు మండలం వంట్లమామిడి, వి. మాడుగుల మండలం మాడుగుల-2, మాడుగుల-3, కె.జె.పురం-2, పెదబయలు మండలం జామిగూడ, ఇంజరి , జి.మాడుగుల మండలం గడుతూరు, గెమ్మిలి, కోరాపల్లి , కోటవురట్ల మండలం కోటవుట్ల-2 , పాయకరావు పేట మండలం పాయకరావుపేట-7, కుమరాపురం , ముంచంగిపుట్టు మండలం మాకవరం, పెదగూడ, బరడ ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది.