కేంద్రాన్ని కోరిన రాష్ట్ర ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ వ్యవస్థలను రద్దు చేయాలని కేంద్రాన్ని రాష్ట్రం కోరింది. ప్రస్తుతం స్థానిక సంస్థల్లో ఉన్న మూడంచెల వ్యవస్థను కొనసాగించాలని పేర్కొంది. పంచాయతీ సర్పంచ్‌లు మండల పరిషత్ చైర్మన్‌ను, మండల పరిషత్ చైర్మన్లు జిల్లా పరిషత్ చైర్మన్‌ను ఎన్నుకుంటారని తెలిపింది. నగర పంచాయతీ, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ వ్యవస్థలను యథాతథంగా కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. స్థానిక సంస్థల పరిపాలన వికేంద్రీకరణకు సంబంధించి పూంచీ కమిటీ చేసిన సిఫార్సులపై రాష్ట్రం ఈ మేరకు తన అభిప్రాయాలను కేంద్రానికి లిఖిత పూర్వకంగా తెలిపింది.
రాష్ట్ర ప్రభుత్వం సూచన మేరకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ వ్యవస్థలను రద్దు చేసిన పక్షంలో రాష్ట్రంలో 10,148 ఎంపీటీసీ, 660 జెడ్పీటీసీ పదవులు రద్దు కానున్నాయి. ఇక స్థానిక సంస్థలకు అధికారాల బదిలీకి చట్టబద్ధత కల్పించాలని పూంచీ కమిటీ సిఫార్సు చేసింది. దీనిపై చట్టబద్ధత వద్దని, ఒక నమూనాను రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. పంచాయతీరాజ్ చైర్‌పర్సన్ పదవులకు ఎస్సీ, ఎస్టీ, మహిళా రిజర్వేషన్లను రొటేషన్ విధానంపై కొనసాగించాలని, అయితే ఒకే టర్మ్‌లో కాకుండా 2 టర్మ్‌ల తరువాత రొటేషన్ రిజర్వేషన్లను అమలు చేయాలని పూంచీ కమిటీ సిఫార్సు చేసింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం సమ్మతిస్తూనే రిజర్వేషన్లను నోటిఫై చేసే అధికారాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘానికి అప్పగించాలని కోరింది.