సాక్షి, అమరావతి : ఇంటి పన్నుపై నిన్న మొన్నటి వరకు వడ్డీ వసూలు చేసిన మున్సిపాలిటీలు ఇప్పుడు ఆఫర్లు ప్రకటించాయి. ఈ నెలాఖరులోపు పన్ను చెల్లిస్తే 5 శాతం రాయితీ ఇస్తామని ప్రచారం చేస్తున్నాయి. రెండు రోజుల నుంచి ఉద్యోగులను పన్ను చెల్లింపుదారుల ఇళ్లకు పంపుతున్నాయి. ఆదివారమైనా కార్యాలయాల్లో సిబ్బంది అందుబాటులో ఉంటారని చెబుతున్నాయి. రెండు నెలలుగా మున్సిపల్ సిబ్బంది సార్వత్రిక ఎన్నికల విధుల్లో ఉండిపోవడంతో పన్నుల వసూళ్లు నిలిచిపోయాయి. దీంతో నిర్దేశించిన లక్ష్యంలో 40 శాతం కూడా వసూలు కాలేదు. రెండు నెలలుగా ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు జీతాలు చెల్లించలేదు. పారిశుధ్య పరిస్థితులను చక్కదిద్దేందుకు అవసరమైన మెటీరియల్ కొనుగోలు చేయలేని దుస్థితి. మరో రెండు నెలల వరకు జీతాలు చెల్లించే పరిస్థితి లేకపోవడంతో వారంతా ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ఎన్నికల ఫలితాలు, ఆ తరువాత కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సమయం పట్టే అవకాశం ఉంది. అప్పటివరకు ఆపద్ధర్మ ప్రభుత్వం నుంచి నిధులు విడుదలయ్యే అవకాశాలు లేవు. దీంతో మున్సిపల్ అధికారులు పన్నులపై రాయితీ ప్రకటించారు.
రోజువారీ ఖర్చులకూ డబ్బుల్లేవ్
చిన్న, మధ్యతరగతి మున్సిపాలిటీల్లో రోజువారీ ఖర్చులకు సైతం నిధులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పన్ను రాయితీని ప్రకటించి యుద్ధప్రాతిపదికన వసూలు చేయాలని అధికారులు నిర్ణయించారు. రాష్ట్రంలో 110 మున్సిపాల్టీలు, 16 నగర పాలక సంస్థలు కలిపి 2019 మార్చి 31తో అంతమయ్యే ఆర్థిక సంవత్సరానికి రూ.219.34 కోట్ల పన్నును వసూలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించాయి. గత ఏడాది ఏప్రిల్‌లోనే పన్ను చెల్లింపుదారులకు నోటీసులు జారీ చేశాయి. ఆలస్యంగా చెల్లించే వారినుంచి నెలవారీ వడ్డీ వసూలు చేస్తామని ప్రకటించి.. డిసెంబరు వరకు వసూలు చేశాయి. జనవరి నుంచి మున్సిపల్ సిబ్బంది ఓటర్ల జాబితాలు, పోలింగ్ నిర్వహణకు సంబంధించిన పనుల్లో నిమగ్నం కావడంతో పన్ను వసూళ్లు మందగించాయి.
మార్చి 31 నాటికి రూ.219.34 కోట్ల పన్ను వసూలు చేయాల్సి ఉంటే.. రూ. 21.03 కోట్లను వసూలు చేశాయి. రూ.36.45 కోట్ల కుళాయి పన్ను వసూలు చేయాల్సి ఉండగా.. రూ.3.78 కోట్లు మాత్రమే వచ్చాయి. దాదాపు రూ.197 కోట్ల ఇంటి పన్నును వసూలు చేయాల్సి ఉంది. ఈ మొత్తాలకు తోడు ఐదారు సంవత్సరాల నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు దాదాపు రూ.1,200 కోట్లను చెల్లించాల్సి ఉంది. ఇవన్నీ కలిపితే.. పన్నుల బకాయిలు రూ.1,400 కోట్ల వరకు చేరింది. ఈ నెల 11న పోలింగ్ ప్రక్రియ పూర్తి కావడంతో ఆ మర్నాడు నుంచే మున్సిపల్ సిబ్బందిని పన్నుల వసూలుకు నియమించి, స్పెషల్ డ్రైవ్ చేపట్టారు.
పన్ను కట్టండి.. రాయితీ పొందండి
Published Sun, Apr 14 2019 9:41 AM | Last Updated on Sun, Apr 14 2019 12:45 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment