రాజంపేటలో టీడీపీ ఫ్లెక్సీని తొలిగిస్తున్న మున్సిపల్ అధికారులు
సాక్షి, రాజంపేట: ఎన్నికల కోడ్ వచ్చేసింది. ఆదివారం సాయంత్రం నుంచి కోడ్ అమలుచేసేందుకు అధికారయంత్రాంగం రంగంలోకి దిగింది. రాజకీయనాయకుల ఫ్లెక్సీల తొలిగింపు చర్యలు చేపట్టారు. అలాగే ఎన్టీ రామారావు, వైఎస్సార్ విగ్రహాలకు ముసుగులు వేశారు. కేంద్ర ఎన్నికల సంఘం మార్చి 18న మొదటి నోటిఫికేషన్ విడుదలచేయనుంది. అధికారులు ఎన్నికల ఆదేశాలను అమలుచేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
అమలుకు ఆలస్యం
రాజంపేట నియోజకవర్గంలో కోడ్ అమలు చేయడంలో ఆలస్యమైంది. సాయంత్రం ఎన్నికలసంఘం నోటిఫికేషన్ విడుదల కాగానే కోడ్‌కు సంబంధించిన నిబంధనలు పాటించడంలో అధికారులు జాప్యం చేశారు. ఆదివారం కావడంతో సిబ్బంది అందుబాటులో లేక ఈ పరిస్థితి నెలకొనిందని అధికారులు అంటున్నారు. నియోజకవర్గంలోని రాజంపేట, నందలూరు, ఒంటమిట్టి, సిద్దవటం, వీరబల్లి, సుండుపల్లె మండలాల్లో కోడ్ అమలుచేసేయాలని ఇప్పటికే ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి.రాజంపేట పట్టణంలో అధికారపార్టీ, జనసేన జెండాలు కోడ్ వచ్చినా కూడా దర్శనిమిచ్చాయి.
ఎన్నికల నోటిఫికేషన్‌పైనే చర్చ
ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో ఎక్కడచూసినా దీనిపైనే చర్చ జరుగుతోంది. ఎన్నికలనోటిఫికేషన్‌కు సంబంధించి అంశాలను వాట్సాప్ ద్వారా సేర్ చేసుకుంటున్నారు. చాలామంది టీవీలకు అతుక్కుపోయారు.
కోడ్ కఠినంగా అమలు చేస్తాం
ఎన్నికల కోడ్‌ను కఠినంగా అమలుచేస్తాం. ఎన్నికల సంఘం నుంచి నియమనిబంధనలు వచ్చాయి. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కూడా కోడ్‌ను వెంటనే అమలుచేయాలని ఆదేశాలు జారీ చేశారు. సోమవారం నుంచి పూర్తిస్థాయిలో కోడ్ అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటాం.
–నాగన్న, ఆర్డీఓ
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
రాజంపేట మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికల కోడ్ నిబంధనలు అమలు చేస్తాం. ఆదివారం సాయంత్రం నుంచి హోర్డింగ్, రాజకీయ నాయకుల ఫ్లెక్సీలను తొలిగించే కార్యక్రమం చేపట్టాం. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటాం.
–పత్తి శ్రీహరిబాబు, కమిషనర్, రాజంపేట
Comments
Please login to add a commentAdd a comment