remove flexies and hordings
-
కోడ్ కూసింది..రంగంలోకి దిగిన యంత్రాంగం
సాక్షి, రాజంపేట: ఎన్నికల కోడ్ వచ్చేసింది. ఆదివారం సాయంత్రం నుంచి కోడ్ అమలుచేసేందుకు అధికారయంత్రాంగం రంగంలోకి దిగింది. రాజకీయనాయకుల ఫ్లెక్సీల తొలిగింపు చర్యలు చేపట్టారు. అలాగే ఎన్టీ రామారావు, వైఎస్సార్ విగ్రహాలకు ముసుగులు వేశారు. కేంద్ర ఎన్నికల సంఘం మార్చి 18న మొదటి నోటిఫికేషన్ విడుదలచేయనుంది. అధికారులు ఎన్నికల ఆదేశాలను అమలుచేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అమలుకు ఆలస్యం రాజంపేట నియోజకవర్గంలో కోడ్ అమలు చేయడంలో ఆలస్యమైంది. సాయంత్రం ఎన్నికలసంఘం నోటిఫికేషన్ విడుదల కాగానే కోడ్‌కు సంబంధించిన నిబంధనలు పాటించడంలో అధికారులు జాప్యం చేశారు. ఆదివారం కావడంతో సిబ్బంది అందుబాటులో లేక ఈ పరిస్థితి నెలకొనిందని అధికారులు అంటున్నారు. నియోజకవర్గంలోని రాజంపేట, నందలూరు, ఒంటమిట్టి, సిద్దవటం, వీరబల్లి, సుండుపల్లె మండలాల్లో కోడ్ అమలుచేసేయాలని ఇప్పటికే ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి.రాజంపేట పట్టణంలో అధికారపార్టీ, జనసేన జెండాలు కోడ్ వచ్చినా కూడా దర్శనిమిచ్చాయి. ఎన్నికల నోటిఫికేషన్‌పైనే చర్చ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో ఎక్కడచూసినా దీనిపైనే చర్చ జరుగుతోంది. ఎన్నికలనోటిఫికేషన్‌కు సంబంధించి అంశాలను వాట్సాప్ ద్వారా సేర్ చేసుకుంటున్నారు. చాలామంది టీవీలకు అతుక్కుపోయారు. కోడ్ కఠినంగా అమలు చేస్తాం ఎన్నికల కోడ్‌ను కఠినంగా అమలుచేస్తాం. ఎన్నికల సంఘం నుంచి నియమనిబంధనలు వచ్చాయి. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కూడా కోడ్‌ను వెంటనే అమలుచేయాలని ఆదేశాలు జారీ చేశారు. సోమవారం నుంచి పూర్తిస్థాయిలో కోడ్ అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటాం. –నాగన్న, ఆర్డీఓ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు రాజంపేట మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికల కోడ్ నిబంధనలు అమలు చేస్తాం. ఆదివారం సాయంత్రం నుంచి హోర్డింగ్, రాజకీయ నాయకుల ఫ్లెక్సీలను తొలిగించే కార్యక్రమం చేపట్టాం. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటాం. –పత్తి శ్రీహరిబాబు, కమిషనర్, రాజంపేట -
మా ఆదేశాలను అమలు చేయాల్సిందే
ఫ్లెక్సీలు, కటౌట్ల తొలగింపుపై రాష్ట్ర సర్కార్‌కు హైకోర్టు స్పష్టీకరణ సాక్షి, హైదరాబాద్: బహిరంగ ప్రదేశాల్లో చట్ట నిబంధనలకు విరుద్ధంగా వెలసిన ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు, బ్యానర్లు, కటౌట్లు తదితరాలను తొలగించాలంటూ తామిచ్చిన ఆదేశాలను అమలు చేయాల్సిందేనని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు తేల్చి చెప్పింది. ఒక వేళ ఆ పని చేయలేకపోతే అదే విషయాన్ని తమకు చెప్పాల ని, తామే వాటిని తొలగింప చేసి చూపుతామని స్పష్టం చేసింది. ఈ విషయంలో తామిచ్చిన ఆదేశాల విషయంలో వెనక్కి తగ్గే సమస్యే లేదని తెలిపింది. రాజకీయ నేతల జన్మదినోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు తొలగింపు కష్టసాధ్యమవుతోందని ప్రభుత్వం చెప్పడాన్ని కోర్టు తప్పుపట్టింది. వాటిని ఎప్పటికప్పుడు తొలగిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా, వాస్తవం అందుకు విరుద్ధంగా ఉంటోందని ఘాటుగా వ్యాఖ్యానించింది. తొలగింపు విషయంలో ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు వివరించాలని ప్రభుత్వానికి సూచించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రకాశం జిల్లాలో ముక్తినూతలపాడు-గుడిమిల్లపాడు మధ్య రోడ్డును ఆక్రమించుకుని, ఓ విగ్రహం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఎస్.మురళీకృష్ణ అనే వ్యక్తి 2008లో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ పిల్‌ను ధర్మాసనం సోమవారం మరోసారి విచారించింది. ఈ సందర్భంగా ఫ్లెక్సీలు, కటౌట్ల తొలగింపు విషయంలో ఏపీ ప్రభుత్వం సమర్పించిన నివేదిక పట్ల ధర్మాసనం సంతృప్తిని వ్యక్తం చేసింది. తెలంగాణ సర్కార్ తీరు పట్ల మాత్రం అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఫ్లెక్సీలు, కటౌట్లను తొలగిస్తున్నారని చెబుతున్నారే గానీ, క్షేత్రస్థాయిలో తమ అనుభవాలు అందుకు భిన్నంగా ఉంటున్నాయంది. తమ ఆదేశాల అమలుకు ఇప్పటి వరకు ఏం చర్యలు తీసుకున్నారో వివరించాలని మరోసారి ఆదేశిస్తూ విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది.