మా ఆదేశాలను అమలు చేయాల్సిందే | definitely follow the insructions highcourt clears to government | Sakshi
Sakshi News home page

మా ఆదేశాలను అమలు చేయాల్సిందే

Published Wed, Apr 15 2015 4:46 AM | Last Updated on Fri, Aug 31 2018 9:15 PM

మా ఆదేశాలను అమలు చేయాల్సిందే - Sakshi

మా ఆదేశాలను అమలు చేయాల్సిందే

  • ఫ్లెక్సీలు, కటౌట్ల తొలగింపుపై రాష్ట్ర సర్కార్‌కు హైకోర్టు స్పష్టీకరణ
  • సాక్షి, హైదరాబాద్: బహిరంగ ప్రదేశాల్లో చట్ట నిబంధనలకు విరుద్ధంగా వెలసిన ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు, బ్యానర్లు, కటౌట్లు తదితరాలను తొలగించాలంటూ తామిచ్చిన ఆదేశాలను అమలు చేయాల్సిందేనని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు తేల్చి చెప్పింది. ఒక వేళ ఆ పని చేయలేకపోతే అదే విషయాన్ని తమకు చెప్పాల ని, తామే వాటిని తొలగింప చేసి చూపుతామని స్పష్టం చేసింది. ఈ విషయంలో తామిచ్చిన ఆదేశాల విషయంలో వెనక్కి తగ్గే సమస్యే లేదని తెలిపింది. రాజకీయ నేతల జన్మదినోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు తొలగింపు కష్టసాధ్యమవుతోందని ప్రభుత్వం చెప్పడాన్ని కోర్టు తప్పుపట్టింది. వాటిని ఎప్పటికప్పుడు తొలగిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా, వాస్తవం అందుకు విరుద్ధంగా ఉంటోందని ఘాటుగా వ్యాఖ్యానించింది.
     
    తొలగింపు విషయంలో ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు వివరించాలని ప్రభుత్వానికి సూచించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రకాశం జిల్లాలో ముక్తినూతలపాడు-గుడిమిల్లపాడు మధ్య రోడ్డును ఆక్రమించుకుని, ఓ విగ్రహం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఎస్.మురళీకృష్ణ అనే వ్యక్తి 2008లో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ పిల్‌ను ధర్మాసనం సోమవారం మరోసారి విచారించింది. ఈ సందర్భంగా ఫ్లెక్సీలు, కటౌట్‌ల తొలగింపు విషయంలో ఏపీ ప్రభుత్వం సమర్పించిన నివేదిక పట్ల ధర్మాసనం సంతృప్తిని వ్యక్తం చేసింది. తెలంగాణ సర్కార్ తీరు పట్ల మాత్రం అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఫ్లెక్సీలు, కటౌట్లను తొలగిస్తున్నారని చెబుతున్నారే గానీ, క్షేత్రస్థాయిలో తమ అనుభవాలు అందుకు భిన్నంగా ఉంటున్నాయంది. తమ ఆదేశాల అమలుకు ఇప్పటి వరకు ఏం చర్యలు తీసుకున్నారో వివరించాలని మరోసారి ఆదేశిస్తూ విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement