సాక్షిప్రతినిధి, నల్లగొండ : పంచాయతీల ఎన్నికలు సమీపిస్తున్నాయి. జూలైతో సర్పంచ్‌ల పదవీకాలం ముగియనుంది. గడువు దగ్గరపడుతుండడంతో చేపట్టిన నిర్మాణ పనులు సర్పంచ్‌లు చకచకా పూర్తి చేయిస్తున్నారు. పెండింగ్ పనులన్నీ ఒక్కొక్కటి పూర్తి చేయించుకుంటూ బిల్లులు చేయించుకునే పనిలో పడ్డారు. వచ్చే ఎన్నికల్లో అదృష్టం కలిసివస్తే మళ్లీ పదవి వస్తుందని, లేకపోతే పనులన్నీ పూర్తిచేయించాలని సర్పంచ్‌లు సమాయత్తమయ్యారు. ఉమ్మడి జిల్లా విభజన తర్వాత జిల్లాలోని 31 మండలాల్లో 563 గ్రామ పంచాయతీలున్నాయి. గ్రామ పంచాయతీల జనాభా ఆధారంగా వాటికి నిధులు విడుదలవుతాయి. పంచాయతీలో ప్రజలకు మౌలిక వసతుల కల్పనకు ఈ నిధులను ప్రభుత్వం మంజూరు చేస్తుంది. జిల్లాల విభజన తర్వాత పంచాయతీల్లో నిధుల ఖర్చుపై అధికార యంత్రాం గం పర్యవేక్షణ పెరిగింది. ఈ పరిస్థితితో నిధులను సర్పంచ్‌లు నీళ్లలా కాకుండా ప్రజా అవసరాల కోసం ఖర్చు చేస్తున్నారు. జిల్లాల విభజన అనంతరం జిల్లాలోని పంచాయతీలకు 2016–17 ఆర్థిక సంవత్సరంలో 60.01 కోట్లు మంజూరైతే ఇందులో ఇప్పటివరకు సుమారు రూ.45 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు తెలిసింది. అలాగే 2017–18 ఆర్థిక సంవత్సరంలో రూ.29.71 కోట్లు వస్తే సుమారుగా రూ.20కోట్లు ఖర్చు అయ్యాయి.
ప్రణాళికతో ఖర్చు ..
నిధుల మంజూరుకు ప్రభుత్వం.. పంచాయతీల స్థాయిలో పక్కా ప్రణాళికతో మందుకెళ్తోంది. నిధులపై సర్పంచ్‌లకు మండల స్థాయిలో పలుమార్లు అవగాహన కల్పించారు. ప్రభుత్వంనుంచి విడుదలైన నిధులను ప్రజల అవసరాలకు అనుగుణంగా ఖర్చుచేసేలా పంచాయతీ అధికారులు.. గ్రామ సర్పంచ్‌లకు ఆదేశాలు జారీ చేశారు. ప్రధానంగా తాగునీరు, పారిశుద్ధ్యం, ప్రజారోగ్యం, షోషకాహారం, విద్య, సాంఘిక భద్రత, పేదరిక నిర్మూలన, సామాజిక వనరుల అభివృద్ధి, వ్యవసాయం, మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ప్రతి గ్రామంలో ఏడు కమిటీల ఆధ్వర్యంలో గ్రామసభలు నిర్వహించి ప్రణాళిక ప్రకారం ఖర్చు చేశారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఎల్‌ఈడీ బల్బుల కోసం నిధులు కేటాయించారు. లైట్లు బిగిస్తే గ్రామాలకు మంజూరైన నిధులు దాదాపుగా ఖర్చు చేసినట్లే అవుతుందని జిల్లా పంచాయతీ అధికారుల అంచనా.
సీజన్‌లో నిధులు ..
రెండేళ్లుగా పంచాయతీలకు సీజన్ వారీగా నిధులు విడుదలవుతున్నాయి. వర్షాకాలంలో అంతర్గత రోడ్లు బురదమయం కావడం, దోమల స్వైరవిహా రం, రోగాలు, చెత్తాచెదారంతో దుర్వాసన తదితర సమస్యలు ఉత్పన్నమవుతాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వర్షాకాలం ముందే నిధులను విడుదల చేసింది. ఈ నిధులతో పారిశుద్ధ్య పనులు, రోడ్ల మరమ్మతులు, మురుగు నీరు నిల్వలేకుండా చర్యలు తీసుకున్నారు. అలాగే పాలనాపరమైన అవసరాలకు, చెత్త సేకరణ, కొత్తరోడ్లు, పాత రోడ్ల మరమ్మతు, ఇతర సేవలకు వినియోగించారు.
లెక్క చూపాల్సిందే..
పంచాయతీ ఒక కేంద్రం.. దీని పరిధిలోని ఆవాస ప్రాంతాల్లో మొత్తం ఎంత ఖర్చు చేశారో ప్రస్తుతమున్న సర్పంచ్‌లు లెక్కచూపాల్సిందే. నిధులు దుర్వినియోగం చేసిన విషయంలో జిల్లాలోని సర్పంచ్‌లపై గతంలో ప్రభుత్వం వేటు వేసిన సంఘటనలున్నాయి. అయితే ప్రతి రూపాయి ఖర్చును సర్పంచ్‌లు తమ పదవి కాలం ముగిసేనాటికి పంచాయతీ అధికారులకు అందజేయాలి. నిధులు దుర్వినియోగం చేసినట్లు రుజువైతే ఆయా సర్పంచ్‌లు మళ్లీ పోటీచేసే అవకాశాలు లేవు. ఈ విషయమై కూడా నూతన పంచాయతీరాజ్ చట్టం రూపకల్పనలో ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రిజర్వేషన్ కలిసి వస్తే మళ్లీ తమ అదృష్టాన్ని పరీక్షించుకుందామనుకుంటున్న సర్పంచ్‌లు ఈ పరిస్థితుల నేపథ్యంలో నిధులను ఆచితూచి ఖర్చు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment