సాక్షి, నెట్‌వర్క్: పంచాయతీ తాజా ఎన్నికల్లోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగింది. గతేడాది జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అధిక స్థానాలు గెల్చుకుని మొదటి స్థానంలో నిలిచిన పార్టీ.. శనివారం జరిగిన ఎన్నికల్లో కూడా ఎక్కువ పంచాయతీలను కైవసం చేసుకుంది. సీమాంధ్రలో 36స్థానాలకు ఎన్నికలు జరగ్గా వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు 15చోట్ల విజయం సాధించారు. రెండవ స్థానంలో స్వతంత్రులు నిలవగా.. కాంగ్రెస్, టీడీపీలు మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి.
మంత్రి బాలరాజుకు శృంగభంగం!
మంత్రిబాలరాజు సొంత నియోజకవర్గం విశాఖ జిల్లా పాడేరు పరిధిలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌కు చావుదెబ్బ తగిలింది. నియోజకవర్గం పరిధిలోని 9 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా జీకే వీధి మండలంలోని మొండిగెడ్డ మినహా మిగిలిన ఎనిమిది స్థానాల నూ వైఎస్సార్‌సీపీ మద్దతుదారులే దక్కించుకున్నారు. ప్రకాశం జిల్లాలో ఐదుచోట్ల ఎన్నికలు జరగ్గా వైఎస్సార్‌సీపీ రెండు మేజర్ పంచాయతీలను స్వాధీనం చేసుకుంది. కొత్తపట్నం మండలంలోని కొత్తపట్నం, అల్లూరు పంచాయతీలను వైఎస్సార్‌సీపీ గెలుచుకోగా, కొత్తపట్నం పల్లెపాలెం, గవండ్లపాలెంలలో టీడీపీ, కాంగ్రెస్ సంయుక్త మద్దతుదారులు గెలుపొందారు. ఒంగోలు మండలంలోని మండువవారి పాలెం పంచాయతీ సర్పంచ్ స్థానంతోపాటు వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. శ్రీకాకుళం జిల్లాలో మూడు పంచాయతీల్లో పోలాకి మండలం చెల్లాయివలస సర్పంచ్‌ను వైఎస్సార్‌సీపీ స్వాధీనం చేసుకుంది. గుంటూరు జిల్లాలో నాలుగుచోట్ల ఎన్నికలు జరగ్గా వైఎస్సార్‌సీపీ ఒకస్థానాన్ని గెలుపొందింది. పశ్చిమగోదావరి జిల్లా కొత్తపల్లి మండలం నాగులాపల్లి పంచాయతీని వైఎస్సార్‌సీపీ బలపర్చిన అభ్యర్థి 1029 ఓట్ల ఆధిక్యతతో కైవసం చేసుకున్నారు.
ఖమ్మం నుంచి మరొకటి..
దమ్మపేట: ఖమ్మం జిల్లాలోని పంచాయతీల్లో వైఎస్సార్‌కాంగ్రెస్ ఖాతాలో మరొకటి చేరింది. దమ్మపేట మండల పరిధిలోని జమేదార్ బంజర్ పంచాయతీలో వైఎస్సార్‌సీపీ మద్దతుదారు దండి దుర్గ టీడీపీ మద్దతుదారుపై గెలుపొందారు. మరో పంచాయతీని సీపీఐ(ఎంఎల్) గెలుచుకుంది.
పంచాయతీ తాజా ఎన్నికల్లో వైఎస్సార్సీపీ హవా
Published Sun, Jan 19 2014 3:14 AM | Last Updated on Fri, May 25 2018 9:12 PM
Advertisement
Advertisement