మచిలీపట్నం/కైకలూరు, న్యూస్‌లైన్ :పంచాయతీ సర్పంచ్‌లకు చెక్ పవర్ ఇప్పట్లో వచ్చే సూచనలు కానరావడం లేదు. నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లను ప్రతిచోటా నిధులు లేమి వెక్కిరిస్తూనే ఉంది. దీంతో వర్షాకాలంలో గ్రామాల్లో కనీస పారిశుధ్య పనులు, తాగునీటి పంపిణీ తదితర పనులకు ఒక్క రూపాయి కూడా ఖర్చుపెట్టలేని దుస్థితిలో ఉన్నారు. ప్రభుత్వం సర్పంచ్‌లకు, పంచాయతీ కార్యదర్శికి జాయింట్ చెక్‌పవర్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేయటంతో ఈ అంశంపైనా సర్పంచులు గుర్రుగానే ఉన్నారు.
అయితే ఈ ఉత్తర్వులు ఇంకా పంచాయతీలకు అందలేదు. ప్రభుత్వం నుంచి జారీ అయిన ఉత్తర్వులు కలెక్టర్‌కు, అక్కడి నుంచి డీపీవో, డీపీవో నుంచి ట్రెజరీ కార్యాలయానికి వెళ్లాల్సి ఉంది. సమైక్యాంధ్ర సమ్మెలో అన్ని విభాగాల ఉద్యోగులు పాల్గొంటుండటంతో ఈ ఉత్తర్వులు ఇప్పట్లో అమలయ్యే అవకాశాలు లేవని ఉద్యోగులు చెబుతున్నారు. సమైక్యాంధ్ర సమ్మె ముగిసిన అనంతరమే ఈ ఉత్తర్వులు పంచాయతీలకు చేరే అవకాశం ఉంది.
పాత బకాయిలు విడుదలయ్యేనా...
రెండేళ్ల విరామం అనంతరం పంచాయతీలకు నూతన పాలకవర్గాలు ఏర్పాటయ్యాయి. రెండేళ్లపాటు ప్రత్యేకాధికారుల పాలనలోనే పంచాయతీలు కొనసాగాయి. ప్రత్యేక అధికారుల పాలనలో ప్రత్యేకాధికారి, సంబంధిత పంచాయతీ కార్యదర్శికి సంయుక్తంగా చెక్ పవర్ ఉండేది. పంచాయతీలకు పాలకవర్గాలు లేకపోవటంతో కేంద్ర ప్రభుత్వం నుంచి 13వ ఆర్థిక సంఘం నిధులు విడుదల కాలేదు. జిల్లాలోని 969 పంచాయతీలకు దాదాపు రూ. 100 కోట్లకు పైగా నిధులు నిలిచిపోయాయి. ఈ నిధుల విడుదలపై స్పష్టమైన హామీ ఇచ్చేవారే కరువయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, రూపాయి మారక విలువ పడిపోవటం తదితర అంశాలన్నీ పంచాయతీలకు పాత బకాయిలు విడుదలపై ప్రభావం చూపే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
జాయింట్ చెక్‌పవర్‌పై ఆగ్రహం ...
నూతనంగా ఎన్నికైన సర్పంచులకు, పంచాయతీ కార్యదర్శులకు జాయింట్ చెక్‌పవర్ ఇవ్వనున్నట్లు ప్రభుత్వం సోమవారం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులపై సర్పంచులు ఆగ్రహంగా ఉన్నారు. తమ అధికారాలకు ప్రభుత్వ వైఖరి కత్తెర పెట్టేలా ఉందని వారు వాపోతున్నారు. పంచాయతీలు ఏర్పడిన కొత్తలో సర్పంచులకు కాకుండా పంచాయతీల్లోని ఎగ్జిక్యూటివ్ అధికారులకు చెక్ పవర్ ఉండేది. పంచాయతీల్లో కావాల్సిన పనులను పాలకవర్గం తీర్మానం చేసి అందుకయ్యే ఖర్చును అంచనా రూపొందిస్తే ఈవో సంతకం చేసేవారు.
నిధుల దుర్వినియోగమైతే చెక్‌పై సంతకం చేసిన ఈవో నుంచే రికవరీ చేసే వెసులుబాటు అప్పట్లో ఉండేది. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సర్పంచులకు చెక్ పవర్ అధికారం ఇచ్చారు. ఇదే అదనుగా భావించిన కొంత మంది సర్పంచులు నిధులను ఇష్టారాజ్యంగా వాడుకున్న దాఖలాలున్నాయి. దుర్వినియోగమైన నిధుల రికవరీకి ఆస్కారం లేకుండా పోయింది.
కరెంటు బిల్లులు కట్టేదెలా...
వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మైనర్, మేజర్ పంచాయతీల్లో కరెంటు బిల్లులను ప్రభుత్వమే చెల్లించేది. ఆయన మరణానంతరం కరెంటు బిల్లులను పంచాయతీలే చెల్లించాల్సి వస్తోంది. కరెంటు బిల్లులు కట్టకుంటే వీధిలైట్లకు విద్యుత్ సర ఫరా నిలిపివేస్తామని విద్యుత్ శాఖాధికారులు హుకుం జారీ చేస్తున్నారు. ఒక్కొక్క మేజర్ పంచాయతీలో నెలకు లక్ష నుంచి రూ. 1.50 లక్షల వరకు బిల్లులు చెల్లించాల్సి వస్తుంది. పంచాయతీలకు నూతన పాలకవర్గాలు ఏర్పడడంతో కరెంటు బిల్లులు చెల్లించాల్సిన బాధ్యత వారిపైనే ఉంది. చెక్‌పవర్ లేకుండా కరెంటు బిల్లులు ఎలా చెల్లిస్తారనే అంశంపై సందిగ్ధత నెలకొంది. ఈ పరిణామాల మధ్య పంచాయతీల్లో పాలనా ఎలా సాగుతుందనే అంశంపై అనేక అనుమానాలు నెలకొన్నాయి.
సర్పంచులకు ‘చెక్’... పవర్ ఎప్పటికో !
Published Wed, Aug 21 2013 1:01 AM | Last Updated on Fri, Sep 1 2017 9:56 PM
Advertisement