‘ఆడపిల్లలకు ఒక రోజు అధికారం’ ఈ విజన్... నిజమవ్వాలి
శక్తి మిషన్
దసరా నవరాత్రుల సందర్భంగాఉత్తర ప్రదేశ్‌లో హఠాత్తుగా పది జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చారు.అందరూ హైస్కూల్ గర్ల్ స్టూడెంట్లే. ‘జనతా దర్శన్’ పేరుతో సాగే ప్రజా దర్బార్‌లలో పాల్గొని సమస్యలు విని పరిష్కారాలకోసం నిర్ణయాలు తీసుకున్నారు. ఇది ఉత్తుత్తికి కాదు.స్త్రీ శక్తి నిరూపణ కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంచాలా సీరియస్‌గా నిర్వహించిన ‘ఆడపిల్లలకు ఒక రోజు అధికారం’ కార్యక్రమంలోజిల్లా యంత్రాంగం చేతులు కట్టుకుని వారి మాట వింది.ఈ అమ్మాయిలు ఈ అనుభవంతో ఐ.ఏ.ఎస్ కావాలనే తలంపునకు వచ్చారు. ప్రతి రాష్ట్రం ఇలాంటి ప్రయత్నం చేయాలి.
అమ్మాయిలు చదువుకోవడం, విదేశాలకు వెళ్లి పై చదువులు చదవడం, మగవారికి మాత్రమే సాధ్యమయ్యే ఉద్యోగాలు తామూ చేయడం చూస్తూనే ఉన్నాం. చరిత్రలో మొదటిసారి అమెరికాలో అధ్యక్షపదవికి ఒక మహిళ పోటీ పడటం వరకూ ఈ మహిళా చైతన్యం సాగింది. అయినప్పటికీ మహిళల పట్ల వివక్ష, కుటుంబాలలో మగ పిల్లాడికి దక్క ప్రాధాన్యం, చదివించే విషయంలో అబ్బాయిలకు మంచి కోర్సు అమ్మాయిలకు అప్రధానమైన కోర్సు దేశంలో సాగుతూనే ఉన్నాయి. ఇలాంటి మైండ్‌సెట్‌ని మార్చడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ‘శక్తి మిషన్’ అనే కార్యక్రమం నిర్వహిస్తోంది. మహిళల స్వావలంబనే కాదు... అమ్మాయిల ఆత్మవిశ్వాసం పెంచడం ఈ కార్యక్రమం ఉద్దేశం. ఇందులో మరో ముఖ్యమైన కార్యక్రమం ‘అమ్మాయిలకు ఒకరోజు అధికారం’. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మొన్నటి అక్టోబర్ 12న దాదాపు పది జిల్లాలలో ఈ కార్యక్రమం కింద ఇంటర్ లోపు చదువుతున్న అమ్మాయిలకు జిల్లా కలెక్టర్‌గా, ఎస్.పి.గా, సి.డి.ఓ. (చీఫ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్‌గా) పూర్తి అధికారాలు ఇచ్చారు. సర్వోన్నత ఉద్యోగాల్లో ఉంటే పేదవారికి, బలహీనులకు ఎలా న్యాయం చేయవచ్చో ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థినులకు తెలియచేయడమే కాదు... వారు అధికారంలో ఉంటే మిగిలిన సిబ్బంది ఎలా వ్యవహరిస్తారో నిజంగా చేసి చూపించారు. ఆ విధంగా ఇదో స్ఫూర్తినిచ్చే కార్యక్రమం.
కూరగాయల రేట్లు ఇవా?
లక్ష్మీపూర్ ఖేరి జిల్లాకు ఎనిమిదవ తరగతి చదువుతున్న అగరిమ ధావన్ ఒకరోజు కలెక్టర్ అయ్యింది. ఆమె ఆ రోజు తన దగ్గరకు వచ్చిన ప్రజల సమస్యలు వింది. అందులో భాగంగా కూరగాయల రేట్లు పెరగడం వల్ల ఇబ్బంది పడుతున్నామన్న ఫిర్యాదు వింది. వెంటనే కింది స్థాయి అధికారులను పిలిచి ‘కూరగాయల రేట్లు ఇలా ఉంటే ఎలా? వీటిని క్రమబద్ధీకరించరా?’ అని ప్రశ్నించి వాటి అదుపునకు చర్యలు తీసుకోమంది. వెంటనే అందుకు తగిన చర్యలు మొదలయ్యాయి. జౌన్‌పూర్ జిల్లాకు ఇంటర్ చదువుతున్న సాజల్ గుప్తా కలెక్టర్ అయ్యింది. ప్రజాదర్బార్ లో 87 ఫిర్యాదులు ఆమె వద్దకు వచ్చాయి. వాటిలో 14 ఫిర్యాదులను అక్కడిక్కడే ఆమె పరిష్కరించింది తన అధికారాలతో. ఇక మహరాజ్ గంజ్‌కు కలెక్టర్ అయిన నిధి యాదవ్ అనే అమ్మాయి ఆ ప్రాంత వాసులకు రావాల్సిన (హైవే నిర్మాణం వల్ల) నష్టపరిహారాన్ని అప్పటికప్పుడు మంజూరయ్యేలా చేసింది. అదే జిల్లాకు ఎస్.పి.గా అధికారాలు స్వీకరించిన గోల్టీ అనే అమ్మాయి తన పరిధిలోని స్టేషన్లలో ఆడవాళ్లు ఇబ్బంది పడుతున్న కేసులను మొదటగా ఇన్వెస్టిగేట్ చేసి పరిష్కరించాలని గట్టి ఆదేశాలు ఇచ్చింది. మిర్జాపూర్, ఘాజీపూర్, షామ్లీ, శ్రావస్థి, బాందా తదితర జిల్లాలలో కూడా ఆ జిల్లాల్లో చురుగ్గా చదువుతున్న అమ్మాయిలను ఎంపిక చేసి కలెక్టర్, ఎస్.పి. బాధ్యతలు అప్పజెప్తే వారు ఒక రోజంతా అద్భుతంగా బాధ్యతలు నిర్వహించడమే కాదు... విజిట్‌లకు కూడా వెళ్లారు.
ఒక రోజు ఆఫీసర్
ఎన్.శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఒకే ఒక్కడు’ సినిమాలో అర్జున్ ఒక్క రోజు కోసం సి.ఎం. అయినా అతని నిర్ణయాలన్నీ అమలవుతాయి. ఇక్కడ కూడా ఈ అమ్మాయిలు తీసుకున్న నిర్ణయాలు అమలయ్యాయి. అమలు అయ్యేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ కార్యక్రమంలో కొన్ని జిల్లాల్లో తాసిల్దార్లుగా కూడా అమ్మాయిలను నియమించారు ఒకరోజు కోసం. కలెక్టర్‌గా నియమితమైన అమ్మాయి, తాసిల్దార్లుగా నియమితమైన అమ్మాయిలు కలిసి మాట్లాడుకుని ఆ రోజున తమ టేబుళ్ల మీద ఉన్న సమస్యలను చకచకా పరిష్కరించడం అందరినీ ఆకర్షించింది. ఎస్.పి.గా చేసిన అమ్మాయిలు కొందరు ఎఫ్‌ఐఆర్‌ల మీద కూడా సంతకాలు చేశారు.
కలెక్టర్లమవుతాం
ఈ కార్యక్రమంలో పాల్గొన్న అమ్మాయిలందరూ ప్రజల సమస్యలు విన్నారు. తాము బాగా చదువుకున్న ఆ సమస్యలను పరిష్కరించే అధికార స్థానంలో వెళ్లవచ్చని గ్రహించారు. ‘మేము బాగా చదువుకుంటాం’ అని ఆత్మవిశ్వాసంతో చెప్పారు. ఈ సందర్భంగా వీరందరూ కాన్వాయ్‌లలో ఆఫీసులకు చేరుకున్నారు. వీరందరూ భవిష్యత్తులో ఇంతకుమించిన బాధ్యతాయుత స్థానాల్లోకి వెళ్లాలని కోరుకుందాం.
Comments
Please login to add a commentAdd a comment