సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి వరంగల్ బీఆర్‌ఎస్ పార్టీలో పెను ప్రకంటపనలు మొదలయ్యాయి. మాజీ డిప్యూటీ సీఎం, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మరోసారి వివాదాల్లో చిక్కుకున్నారు. రాజయ్యపై జానకీపురం మహిళ సర్పంచ్ నవ్య తీవ్ర ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే తనకు ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడుతున్నారని.. లైంగికంగా వేధిస్తున్నారని మండిపడ్డారు. తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని తెలిపారు.
ఎమ్మెల్యే కాల్ చేసి బయటకు రమ్మంటున్నారని నవ్య ఆరోపణలు చేస్తున్నారు. రాజయ్య మాట్లాడిన కాల్ రికార్డ్స్ ఉన్నాయని పేర్కొన్నారు. సమయం చూసి అవన్నీ భయటపెడతానని అన్నారు. తన వెనక ఎవరూ లేరని స్పష్టం చేశారు. ఎవరో చెప్పిన మాటలు వినాల్సిన అవసరం తనకు లేదన్నారు. ఇటువంటి వేధింపులు ఎదుర్కొంటూ రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
‘నీ మీద కోరికతోనే పార్టీ టికెట్ ఇచ్చానని అన్నారు. పక్కన నిలబడితే ఎక్కడెక్కడో చేయి వేస్తారు. హగ్ చేసుకోవడానికి వస్తారు. బిడ్డలాంటి దాన్ని అని చెప్పినా మారరా. మీకు సహకరించకుంటే నా బతుకు నాశనం చేస్తారా. రావాల్సిన నిధులు రాకుండా అడ్డుకుంటారా. దయచేసి ఇప్పటికైనా ఈ అరాచకాలు మానండి. ఇలాంటి వారితో పార్టీకి చెడ్డ పేరు వస్తోంది. ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకోవాలి’ అని తెలిపారు.
మరోవైపు తనపై చేస్తున ఆరోపణలపై ఎమ్మెల్యే రాజయ్య స్పందించారు. ఎన్నికలు దగ్గరపడుతున్నాయని, గతంలో జరిగినట్లు రాజకీయ కుట్రలు జరుగుతున్నాయని అన్నారు.ప్రజల్లో లభిస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ఇంటి దొంగలే శిఖండి పాత్ర పోషించి తనను అప్రతిష్టపాలు చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్‌ను కలిసి అన్ని విషయాలు వివరిస్తానని తెలిపారు. త్వరలోనే నిజాలు బయటకు వస్తాయని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment