
అమెరికా సదస్సుకు ఒడిశా మహిళా సర్పంచ్
భువనేశ్వర్: ఆరతీ దేవి (28) అనే ఒడిషాకు చెందిన మహిళా సర్పంచికి ఫిబ్రవరిలో అమెరికాలో జరిగే ఓ ప్రతిష్టాత్మక అంతర్జాతీయ నాయకత్వ సదస్సులో దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కింది. ఇంటర్నేషనల్ విజిటర్స్ లీడర్‌షిప్ ప్రోగాం (ఐవీఎల్‌పీ)గా పిలిచే ఈ మూడు వారాల కార్యక్రమానికి భారత్ నుంచి ఆమె ఒక్కరే ఎంపికవడం విశేషం. గంజాం జిల్లాలోని ధుంకపరా అనే మారుమూల గ్రామ సర్పంచి అయిన ఆరతి, హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్ జనరల్ ఫోన్ చేసి విషయం చెప్పగానే ఒక్కసారిగా ఆశ్చర్యానందాలకు లోనయ్యానన్నారు.
ఇల్లినాయీ రాష్ట్రంలోని స్ప్రింగ్‌ఫీల్డ్‌లో జరిగే ఈ సదస్సులో రాష్ట్ర ప్రభుత్వ పనితీరు, పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం తదితరాలపై ఆమె మాట్లాడతారు. పర్యటన ఖర్చులన్నీ అమెరికానే భరిస్తుంది. ఎంబీఏ పట్టభద్రురాలైన ఆరతి, సర్పంచ్ గా ఎన్నికవడం కోసం ఐడీబీఐలో ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ ఉద్యోగాన్ని కూడా వదులుకోవడం విశేషం. వయోజన విద్యా కార్యక్రమం, తదితరాలతో కొద్దికాలంలోనే ఊరి రూపురేఖలే మార్చేసి జేజేలందుకున్నారు. మన దేశం నుంచి మాజీ ప్రధానులు ఇందిరాగాంధీ, అటల్ బిహారీ వాజ్‌పేయి, మాజీ రాష్ట్రపతులు కేఆర్ నారాయణన్, ప్రతిభా పాటిల్ ఐవీఎల్‌పీలో గతంలో పాల్గొన్నారు.